వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలంటూ కేంద్రానికి మంత్రి కేటీఆర్ హెచ్చరిక

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలంటూ బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాసారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలన్న కుట్రలను ఎప్పటికప్పుడు అక్కడి కార్మికులు, అనేక ఇతర సంఘాలు, బిఆర్ఎస్ వంటి పార్టీలు అడ్డుకుంటున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని వెల్లడించారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.

ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో భారీ ఎత్తున సిమెంట్‌ను ఉత్పత్తి చేసిన పరిశ్రమలన్నింటిని పూర్తిగా ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని ప్రభుత్వాలు, ప్రస్తుతం స్టీల్ పరిశ్రమను కూడా అదే రీతిన ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటుపరం చేసే ముందు, దాన్ని నష్టాల పాలుచేసి, వాటిని సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను అంతిమంగా నష్టాల్లోకి నెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని దుయ్యబట్టారు.

కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతోనే కేంద్రం కుట్రలు ఆగదని, ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను భారీ ఎత్తున తెగనమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దిశగా ఎల్‌ఐసీ, బీఎస్ఎన్ఎల్, సింగరేణి వంటి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అంతిమంగా ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి పోయేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, లక్షలాదిమంది కార్మికుల శ్రేయస్సు కోసం వారితో కలిసి నడిచేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉంటుందని, ఈ దిశగా తమతో కలిసి రావాలని ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.