అవినీతి వ్యతిరేక యోధుడనే ప్రచారాన్ని మోడీ ఆపాలిః మల్లికార్జున్ ఖర్గే

ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం

Stop image makeover by calling yourself anti-corruption crusader: Kharge attacks PM Modi

న్యూఢిల్లీః కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పుతూ అవినీతిపరుల కూటమికి మోడీ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ షెల్ (డొల్ల) కంపెనీలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఖర్గే ప్రస్తావిస్తూ వరుస ట్వీట్లు చేసిన ఖర్గే ఆ కంపెనీల్లో రూ. 20 వేల కోట్ల ఎవరు పెట్టుబడి పెట్టారని ప్రశ్నించారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యారని ప్రధాని మోదీ విపక్షాలపై చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు.

‘అదానీ షెల్ కంపెనీల్లోని రూ. 20,000 కోట్లు ఎవరివి? లలిత్ మోదీ, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, జతిన్ మెహతా తదితరులు అవినీతిపరులను బయటికి పంపించే మీ కూటమి (భ్రష్టాచారి భగావో అభియాన్)లో సభ్యులుగా ఉన్నారా? ఈ కూటమికి కన్వీనర్ మీరేనా? మిమ్మల్ని మీరు అవినీతి వ్యతిరేక యోధుడు అని చెప్పుకోవడం ద్వారా మీ ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నాలను ఆపండి’ అని ఖర్గే హిందీలో ట్వీట్ చేశారు. మోడీకి ఆయన మరిన్ని ప్రశ్నలు సంధించారు.

‘మొదట మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. కర్ణాటకలో మీ ప్రభుత్వం 40% కమీషన్ తీసుకుంటుందోని అని ఎందుకు ఆరోపణలు వచ్చాయి? మేఘాలయలో నెం.1 అవినీతి ప్రభుత్వంలో మీరు ఎందుకు పాలుపంచుకున్నారు? రాజస్థాన్‌లోని సంజీవని కోఆపరేటివ్ స్కామ్‌లో, మధ్యప్రదేశ్లో పోషన్ స్కామ్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో నాన్ స్కామ్‌లో బిజెపి నేతలకు సంబంధం లేదా?’ అని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాలని ప్రధానికి ఖర్గే సవాల్ విసిరారు.