వైజాగ్ లో వందే భారత్ రైలు ఫై రాళ్ల దాడి

వైజాగ్ లో వందే భారత్ రైలు ఫై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసారు. ఈ నెల 19 నుండి తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైలు పరుగులు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ నుండి వైజాగ్ కు ఈ రైలు ప్రయాణించబోతుంది. 19 న వందేభారత్ రైలును ప్రధాని మోడీ ప్రారభించబోతున్నారు. ఈ తరుణంలో ట్రయల్ రన్ ముగించుకుని విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి మర్రిపాలెంలోని కోచ్ మెయింటెనెన్స్ సెంటర్‌కు రైలు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రైలు ఫై రాళ్ల దాడి చేసారు. ఈ ఘటనలో ఒక కోచ్ అద్దం దెబ్బతింది.

ఈ ఘటనకు సంబంధించి DRM అనుప్ మాట్లాడుతూ.. “ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుండి కోచింగ్ కాంప్లెక్స్‌కు వెళ్తున్న వందేభారత్ రైలును గుర్తుతెలియని సంఘవిద్రోహులు రాళ్లదాడి చేసారు. నిందితుల ఫై RPF కేసు నమోదు చేసింది.

” ఈ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇది సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య దాదాపు ఎనిమిది గంటల్లో నడపాలని నిర్ణయించారు. రైలు కోసం ఊహించిన ఇంటర్మీడియట్ స్టాప్‌లలో వరంగల్, ఖమ్మం, విజయవాడ మరియు రాజమండ్రి స్టేషన్ ” లు ఉన్నట్లు తెలిపారు.

ఇక దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లను ప్రధాని స్వయంగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలు కేటాయిస్తూ రెండు నెలల క్రితం ప్రధాని అటు విశాఖ..ఇటు తెలంగాణలోని రామగుండం పర్యటన సమయంలో నిర్ణయం జరిగింది. వందేభారత్ ను ప్రారంభించటంతో పాటుగా సికింద్రబాద్ రీడెవలప్ మెంట్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇందు కోసం రూ 699 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుత భవనాలను కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు.. పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మించనున్నారు. 36 నెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి.

దేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే సెమీ హైస్పీడ్ రైలు. గతేడాది భారత రైల్వే 7 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, గాంధీనగర్- ముంబయి సెంట్రల్, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా, చెన్నై-మైసూరు, బిలాస్ పూర్-నాగపూర్, హౌరా-న్యూ జల్పాయ్ గురి స్టేషన్ల మధ్య వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వందేభారత్ రైలు ట్రయల్ రన్ లో గంటకు 180 కిమీ వేగం అందుకోవడం విశేషం.