స్టీవ్ స్మిత్ పరుగుల సునామీ

Steve Smith
Steve Smith

మాంచెస్టర్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ పరుగుల సునామీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు సెంచరీలు బాదేసిన స్మిత్ తాజాగా నాలుగో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. స్మిత్ అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరును నమోదు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 126 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన స్మిత్ తన ఖాతాలో డబుల్ సెంచరీని జమ చేసుకున్నాడు. కెప్టెన్ పైన్ అండతో స్మిత్ కదం తొక్కాడు. ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించిన స్మిత్ పరుగుల వరద పారించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన స్మిత్ తొలుత లబుస్‌చంగెతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో కెప్టెన్ పైన్ అండతో స్మిత్ తన పోరాటాన్ని కొనసాగించాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ ఆస్ట్రేలియాకు భారీ స్కోరును సాధించి పెట్టాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 319 బంతుల్లో 24 ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 211 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పైన్ 8 బౌండరీలతో 58 పరుగులు సాధించాడు. చివర్లో మిఛెల్ స్టార్క్ మెరుపులు మెరిపించాడు. ధాటిగా ఆడిన స్టార్క్ ఏడు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లియాన్ కూడా అజేయంగా 26 పరుగులు చేయడంతో దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరును సాధించింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/