కాబుల్ లో మహిళా ఉద్యోగులపై ఆంక్షలు

మహిళా వర్కర్లను ఇంటికే పరిమితం చేసిన మేయర్

కాబుల్ : ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మహిళలపై వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. తాము మారామని తొలుత ప్రకటించినప్పటికీ తాలిబన్ల ప్రవర్తనలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. తాజాగా కాబూల్ మేయర్ హమదుల్లా నామనీ చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. కాబూల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని హుకుం జారీ చేశారు.

ఈ విషయాన్ని కాబూల్ మేయర్ హమదుల్లా నామనీ ఆదివారం నాడు వెల్లడించారు. పురుషులతో భర్తీ చేయలేని ఉద్యోగాల్లో ఉన్న మహిళలు మాత్రమే విధుల్లో కొనసాగుతున్నట్లు నామనీ తెలిపారు. మిగతా మహిళా ఉద్యోగులందరూ ఇళ్లలోనే ఉండాలని చెప్పిన విషయాన్ని ఆయన వెల్లడించారు. అయితే ఇలా ఎంతమంది మహిళా ఉద్యోగులను ఇళ్లకే పరిమితం చేసింది మాత్రం ఆయన చెప్పలేదు. ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వని తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై రకరకాల ఆంక్షలు విధిస్తూనే వస్తున్న విషయం తెలిసిందే.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/