విచారణకు రమ్మంటూ చంద్రబాబు కు మహిళా కమిషన్ సమన్లు

27న చంద్రబాబు కమిషన్ ఆఫీసుకు రావాలంటూ నోటీసులు
క‌మిష‌న్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 14 ప్ర‌కారం నోటీసుల జారీ

అమరావతి: విజ‌య‌వాడ ఆసుప‌త్రిలో జ‌రిగిన సామూహిక అత్యాచారం ఘ‌ట‌న‌కు సంబంధించి చోటుచేసుకున్న ప‌రిణామాల నేపథ్యంలో రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌ను బెదిరించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై టీడీపీ అధినేత‌, ఏపీ విప‌క్ష నేత నారా చంద్రబాబునాయుడు‌కు మ‌హిళా కమిష‌న్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. నోటీసు కాపీని చంద్ర‌బాబుకు అందించేందుకు మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి వెళ్లిన మ‌హిళా క‌మిష‌న్ ప్ర‌తినిధుల నుంచి పార్టీ కార్యాల‌య వ‌ర్గాలు నోటీసును అందుకున్నాయి.

ఈ నెల 27న ఉద‌యం 11 గంట‌ల‌కు క‌మిష‌న్ కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ స‌ద‌రు నోటీసుల్లో చంద్ర‌బాబును మ‌హిళా క‌మిష‌న్ కోరింది. విజ‌య‌వాడ ఆసుప‌త్రిలో జ‌రిగిన సామూహిక అత్యాచారం ఘ‌ట‌న‌లో బాధితురాలి ప‌రామ‌ర్శ సంద‌ర్భంగా మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ను అవ‌మానించారని స‌ద‌రు నోటీసుల్లో చంద్ర‌బాబుకు క‌మిష‌న్ తెలిపింది. ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 14 ప్ర‌కారం క‌మిష‌న్‌ ఈ నోటీసులు జారీ చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/