గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్

సంచలన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యులు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు వరల్డ్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ లో పాల్గొంటూ మొక్కలు నాటుతూ..మరికొంతమందికి ఈ ఛాలెంజ్ ని విసురుతున్నారు. సినీ , రాజకీయ, బిజినెస్ ఇలా అనేక రంగాల వారు ఈ ఛాలెంజ్ లో పాల్గొనడం జరిగింది. తాజాగా ప్ర‌ముఖ సినీ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో ఆయ‌న మొక్క‌లు నాటారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాట‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని థ‌మ‌న్ పేర్కొన్నారు. ఒక ప్రాణం పోసిన‌ట్లుగా గొప్ప అనుభూతి క‌లిగింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 16 కోట్ల‌కు పైగా మొక్క‌లు నాట‌డం చాలా గొప్ప విష‌య‌మ‌ని కొనియాడారు. ప‌చ్చ‌ద‌నం కోసం చేప‌డుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్య‌క్ర‌మాలు మ‌రింత విజ‌య‌వంతం కావాల‌ని థ‌మ‌న్ ఆకాంక్షించారు. ఇంత మంచి కార్య‌క్ర‌మంలో త‌న‌ను భాగ‌స్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కు థ‌మ‌న్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అనంతరం ముగ్గురు సంగీత దర్శకులు అనూప్, కళ్యాణ్ మాలిక్, మిక్కీ జే మేయర్లకు ఈ ఛాలెంజ్ ను విసిరారు థమన్.