తిరుపతిలోని శ్రీనివాసం వసతిగృహం దగ్గర గందరగోళం..

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయడంతో.. శ్రీనివాసం వసతిగృహం దగ్గర గందరగోళం నెలకొంది. వందలమంది భక్తులు ఆందోళనకు దిగారు. రేపటి నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్లు ఇస్తామని..తక్షణం శ్రీనివాసం వసతి గృహం ఖాళీ చేయాలనీ పోలీసులు, అధికారులు చెప్పడం తో భక్తులంతా ఆందోళనకు దిగారు.

టోకెన్లు ఇవ్వాలంటూ భక్తులు అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.. భక్తులను బలవంతంగా పక్కకు పంపారు. ఈ సమయంలో భక్తులు.. పోలీసుల మధ్య తోపులాట, వాగ్వావాదం జరిగింది. ఎట్టకేలకు భక్తులను అక్కడి నుంచి పంపేశారు. పెరటాసి మాసం కావడంతో ఏ రోజు టికెట్లు ఆ రోజు జారీ చేస్తామని చెప్పడంతో తాము కాలినడకన వచ్చామని.. ఇక్కడ టికెట్లు ఇవ్వడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటు అక్టోబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. మరోవైపు సర్వదర్శన టోకెన్లను శనివారం టీటీడీ విడుదల చేయనుంది. ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు ఎనిమిది వేల చొప్పున ఎస్డీ టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.