శ్రీమద్రామాయణం

ఆధ్యాత్మిక ఆరాధన

Srimadramayanam
Srimadramayanam

‘ఓ హనుమంతుడా! నాకూ, నా భర్తకు మాత్రమే తెలిసిన సంఘటన ఒకటి చెబుతాను. ఆ విషయాన్ని నీవుఆయనకు ఓ విశిష్టమైన గుర్తుగా చెప్తు అని సీత హనుమంతునికి చెబుతుంది.

‘మేం చిత్రకూటపర్వతంపై ఉండేవాళ్లం. ఒకరోజు మేమిద్దరం జలక్రీడలతో పొద్దుపుచ్చి అలసిపోయి ఆశ్రమానికి వచ్చాం.

అప్పుడు నా భర్త నా తొడపై తలపెట్టి పడుకొన్నాడు. అప్పుడు ఒక కాకి వచ్చి నా స్తనాలపైన గోళ్లతో గీరింది, ముక్కుతో పొడిచింది.

ఇట్లా చేస్తూ ఉండగా నా రక్తం నా భర్త ఒంటిమీదపడి ఆయన ఒళ్లంతా తడిసింది. ఆయన లేచి నాలుగుపక్కలా తలత్రిప్పి పరిశీలనగా చూశాడు.

అది మామూలు కాకికాదు. దేవేంద్రుడి కుమారుడే కాకి రూపంలో వచ్చాడు.

మహాబాహువ్ఞ మతిమతుడైన ఆ దాశరధి కోపంతో కూర్చున్న చోటు నుండి ఒక గడ్డిపరకను పెకలించి బ్రహ్మస్త్రంగా మంత్రించి ఆ కాకిమీదకు వదిలాడు (పుటలు 591-592 శ్రీమద్రామాయణం, రామకృష్ణమఠం)

ఇది మనకు రామాయణం ద్వారా తెలిసే కథ. దేవేంద్రుడి కొడుకు కాకిరూపంలో వచ్చాడు, పోకిరీ చేష్టలు చేశాడు. శిక్షను అనుభవించాడు,

తాను చేసిన దుర్మార్గానికి తగిన ఫలితాన్ని పొందాడు. అదిసరే, వానికి ఆ దుష్టబుద్ధులు, దుర్మార్గపు చేష్టలు ఎందుకు అలవడినాయి? వాడు తన తండ్రికి తగ్గకొడుకు.

ఎవరైనా యాగాన్ని చేస్తుంటే యాగాశ్వాన్ని దొంగలించటం, ఏస్త్రీపైనైనా కోరిక కల్గితే ఆమె భర్తరూపంలో వెళ్లి ఆమెను అనుభవించటం ఇలాంటి దుష్టచేష్టలు చేసేవాడు దేవేంద్రుడని రామాయణం ద్వారా తెలుస్తుంది.

అలాంటి తండ్రికి పుట్టిన తనయుడు తండ్రిలాగానే పోకిరీపనులు చేశాడు, తండ్రిలాగానే చేసిన తప్పులకు తగిన శిక్షను అనుభవించాడు.

ఈ కథ నుంచి నేటి తల్లిదండ్రులు నేర్చుకోవలసింది. ఎంతో ఉంది కదా! జన్మించినది మొదలు పెరుగుతున్నకొద్దీ పిల్లలు తమ తల్లిదండ్రులనే తీక్షణంగా గమనిస్తుంటారు. తల్లిదండ్రుల ప్రభావమే పెరిగే పిల్లలపై బలంగా ఉంటుంది.

తల్లిదండ్రుల జీవనశైలి ఉత్తమంగా ఉంటే పిల్లల ప్రవర్తన బాగుంటే అవకాశం ఎక్కువ.

అది ఆ రామాయణ కాలంలోనైనా, ఇప్పుడైనా సాధారణంగా అలాగే ఉంటుందని మన నిజజీవిత అనుభవాలు రుజువ్ఞ చేస్తాయి. రాఘవయ్య అని నా చిననాటి మిత్రుడున్నాడు. అతనిది పేద బ్రాహ్మణ కుటుంబం.

పండుగ సందర్భంగా ఇతర బ్రాహ్మణపిల్లల్లాగా సమీపంలో నున్న వైశ్యుల ఇండ్లకు వెళ్లి ‘శమీశమయతే పాపం అని చెప్పి పత్రి ఇచ్చి, వారిచ్చే డబ్బును తెస్తే వారి తండ్రి రామస్వామిగారు దండించేవారు.

సిగ్గులేదూ, చేతులు జావి డబ్బులడిగేదానికి అని తిట్టేవారు. అందుకే నా మిత్రునికి అన్యాయంగా డబ్బును ఒకరికి ఇవ్వటంగానీ, ఒకరి నుంచి తీసుకోవటంగానీ అసలు గిట్టదు.

దాదాపు 13 ఏండ్ల చిరుప్రాయంలోనే ఒక హెడ్‌మిస్ట్రెస్‌ ఒక సర్టిఫికేట్‌ ఇవ్వటానికి అర్ధరూపాయి లంచం అడిగితే ఆయన ‘అర్ధరూపాయ చాలా, రూపాయవద్దా? అని ఆమెను ఎగతాళిగా అడిగాడు.

అంత చిన్నవయస్సులోనే అన్యాయాన్ని నిలదీసే ధైర్యం ఆయనకు అలవడింది.

ఇప్పుడు, ఈ కాలంలో నీతి నిజాయితీగా బ్రతకడం సాధ్యమా? అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. ముందు నీతి, నిజాయితీలు వారసత్వంగా రావాలి.

ఆస్తిపాస్తులు వారసత్వంగా వస్తేకలగే మేలు కొంతే. నీతి, నిజాయితీలు వారసత్వంగా వస్తే చేకూరేమేలు ఇంత అని చెప్పలేం.

మా మిత్రుడు రాఘవయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఈనాడు వారందరూ బాగా చదువ్ఞకొని, మంచి ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడ్డారు.

భార్యాపిల్లలతో ఏ లోటూలేక ఆరోగ్యంగా, ఆనందంగానే మా మిత్రుడు ఉన్నాడు.

ఈనాడైనా నీతి, నిజాయితీలను అంటిపెట్టుకొని జీవించవచ్చు అనటానికి ఇది నిరూపణ కాదా? సక్రమమైన, న్యాయమార్గంలో సంపాదించి ఇవ్వగలిగినంత డబ్బును మనపిల్లలకు ఇద్దాం.

అంతకంటే విలువైన విలువలతో మనం జీవించి మనపిల్లలకు వాటిని అందిద్దాం.

అప్పుడే రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలను మన పవిత్రగ్రంథాలుగా పేర్కొనే హక్కు. మనకుంటుంది.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/