శ్రీమద్రామాయణం

ఆధ్యాత్మిక చింతన

Srimadramayanam
Srimadramayanam

మన పవిత్ర గ్రంథాలైన రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలకు సంబంధించిన విషయాలను గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో కొంత భేదంగా కనబడితే వెంటనే …

నువ్వు ఒరిజినల్‌ గ్రంథాన్ని (మూలాన్ని) చదివావా? సంస్కృతంలో ఉన్నదానిని చదివావా? అనువాదాన్ని చదివావా? ప్రింటెడ్‌ పుస్తకాన్ని చదివావా లేక తాటియాకుల గ్రంథాన్ని చదివావా? ఆ తాటియాకుల గ్రంథం మూడు వందల ఏండ్ల కిందటిదా లేక (లక్షల ఏండ్ల నాటి) త్రాతాయుగం నాటిదా? అని సవాలక్షల ప్రశ్నలు వేస్తారు.

ఎందుకంటే ఆ మూలగ్రంథంలో అంతా మంచే ఉంటుందని, అంతా సత్యమే ఉంటుందని తరువాతి వాళ్లు వారి అజ్ఞానం వల్ల ఆనాటి మహర్షులు, బ్రహ్మజ్ఞానులు చెప్పినదాన్ని ఉన్నదున్నట్టు చెప్పి ఉండరని అభిప్రాయం. ప్రాచీన మహర్షుల పట్ల, గ్రంథాల పట్ల అంత గౌరవం ఉండటం మంచిదే. అయినా వారు అంతా మంచే చెప్పింటారని, సత్యాన్నే రాసింటారని అనుకోవటం చాదస్తమే అవుతుంది.

ఈ మాట చెప్పటానికి ఆ గ్రంథాలన్నిటినీ ఆమూలాగ్రం అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. అయినా ఒక్కొక్క కాలానికి చెందిన ప్రవచనకారులు, ప్రబోధకులు ఆయా కాలానికి తగినట్టు మూలంలో వున్న కథకు కొన్ని మార్పులు, చేర్పులు చేసి మెరుగులు దిద్దితే మంచే జరుగుతుంది కానీ నష్టమేమీ రాదు.

వాల్మీకి రామాయణము, వ్యాస ఆధ్యాత్మ రామాయణము, తులసీదాస రామచరిత మానసము, సత్యసాయి రామకథారసవాహిని ఈ గ్రంథాల నుండి ఒక్క ఉదాహరణ తీసుకొందాం.

గౌత మహర్షి లేని సమయంలో ఇంద్రుడు గౌతముని వేషంలో వచ్చి గౌతముని భార్య అహల్యను కలిశాడు. చివరకు గౌతమునికి పట్టుబడ్డాడు. గౌతముడు శాపం పెట్టాడు.

”నీ వృషణాలు రాలిపోవుగాక (పుట 61, బాలకాండము-48 సర్గ శ్రీమద్రామాయణము(వాల్మీకి విరచిత), రామకృష్ణ మఠం, హైదరాబాద్‌)

దేవతల కోర్కె పైన పితృదేవతలు వృషణాలు లేని గొర్రెలను భుజిస్తారు. దేవేంద్రునికి వృషణాలు (గొర్రెలవి) అతికించబడి మేష వృషణుడయ్యాడు.

ఇది వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణంలో 48, 49 సర్గలలో(బాలకాండ) వున్న విషయం. ఎంత అసహ్యంగా ఉంది.

”దుష్టాత్మా! యోనిలంపటా! నీ దేహమున వేయి భగములు ఏర్పడుగాక!
ఇది (పుట 43, సర్గ-5, బాలకాండము, ఆధ్యాత్మ రామాయణము(గీతా ప్రెస్‌, గోరఖ్‌పూర్‌)లో వున్న విషయం. రచయిత వ్యాసుడు.

వాల్మీకి రామాయణంలోని శాపం అసహ్యంగా ఉందనుకొంటే వ్యాసుని రామాయణంలోని శాపం పరమ అసహ్యంగా ఉంది. అలాంటి శాపాలను పెట్టిన వారిని, వాటిని అలా రాసిన వారిని ప్రశ్నిస్తే ”ఆ.. అంతటి మహర్షులనే ప్రశ్నిస్తావా? బ్రహ్మజ్ఞానులనే విమర్శిస్తావా? అని కోపగించుకుంటారు(శాపం పెట్టరు, సంతోషించాలి).

ఇక దాదాపు కేవలం ఆరు వందల సంవత్సరాల క్రితం జీవించిన తులసీదాసు తన ‘రామచరిత మానసములో ఇంద్రునికివ్వబడిన శాపాన్ని ఏమాత్రం ప్రస్తావించక ”అహల్య శాపవశమున శిలయై నీ పాదకమల రేణువును కాంక్షంచుచున్నది.

రఘువరా! ఆమెపై కృప జూపుము అని విశ్వామిత్రుడు చెప్పినట్టు రాస్తాడు (పుట 165, శ్రీరమ చరిత మానసము-గీతా ప్రెస్‌, గోరఖ్‌పూర్‌). తులసీదాస్‌ తగిన మార్పు చేసి, ఎంత మంచి పని చేశాడు! మహర్షుల పట్ల, పవిత్ర రామాయణం పట్ల ఏమాత్రం గౌరవం తగ్గకుండా ఉండేట్టు తగు జాగ్రత్త తీసికున్నాడు.

ఇక నేటి భగవాన్‌ సత్యసాయి రామకథా రసాహినిలో ఈ సంఘటనను ఎలా వివరిస్తారో చూద్దాం- గౌతముని భార్యయగు అహల్య మహా గుణవంతురాలు.

చక్కని చుక్క. ఒకనాడు ఆమె సౌందర్యమును చూచుటకు గౌతముడు ఆశ్రమమున లేని సమయం ఇంద్రుడు గౌతముని వేషమును ధరించి ప్రవేశించెను. అపుడు గుణవంతురాలైన అహల్య పతిగా భావించి అతనికి ఉన్నత రీతుల సేవలు సలుపుచుండెను.

ఇంతలో నిజమైన గౌతముడు ప్రవేశించి ఉగ్రుడై తన వేషమును ధరించి అహల్యతో సేవలు చేయించుకుంటున్న ఇంద్రుని చూసి ”దుర్మతీ! అని గర్జించగనే దేవేంద్రుడు అంతర్ధానమాయెను(పుట 104, రామకథారసవాహిని, ప్రథమ భాగం).

బాబావారు చెప్పిన విధానం ఎంత బాగుంది! ఎంత వినసొంపుగా ఉంది! దీన్ని చదివితే అహల్యను గురించిగానీ, గౌతముని గురించిగానీ, ఇంద్రుడిని గురించిగానీ మరీ అంత ఎక్కువగా దురభిప్రాయం ఏర్పడదు.

అదే వాల్మీకి రామాయణంలోని ఈ సంఘటనను గురించి చదివితే అహల్యను గురించి, గౌతమ మహర్షిని గురించి, ఇంద్రుడిని గురించి, విశ్వామిత్ర మహర్షిని గురించి, ఊరకే తలలూపి వినిన రామ, లక్ష్మణులను గురించి మనకున్న సదభిప్రాయ మంతా ఆవిరైపోతుంది.

నేను చెప్పదలచుకున్న విషయమేమిటంటే ఎంత పురాతన రుషులైతే అంత గొప్పవారన్న అభిప్రాయం మనలో స్థిరపడరాదు. వాల్మీకి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, భరద్వా జుడు గొప్ప మహర్షులే.

వారిపట్ల గౌరవం ఉండవల సిందే. అయితే అలాంటివాఏ ఇంకా, ఇంకా సాధన చేసి, ధ్యానం చేసి, తనస్సు చేసి జన్మ జన్మలకు అభివృద్ధి చెంది నేటి రామకృష్ణ పరమహంసగా, వివేఆకందనుని గా, రమణ మహర్షిగా, మలయాళ మహర్షిగా, దదదయానందునిగా, సత్యసాయిగా అవతరించి ఉంటారని గ్రహించాలి.

ప్రాచీన మహర్షులకు వందనం! నేటి మహర్షులకు వందనం! రాబోవు మహర్షులకు వందనం!

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/