శ్రీమద్రామాయణం

లక్ష్మణా! ఇక్ష్వాకులలో పన్నెండవ వాడైన నిమి చక్రవర్తి కథ చెప్తా విను. ఆ నిమిచక్రవర్తి స్థిరమైన బుద్ధితో ధర్మాన్ని తప్పక పాటిస్తూ ఉండేవాడు. తన తండ్రి కోరిక మేరకు దీర్ఘ సత్రయాగం చేయాలని సంకల్పించాడు.

మనుచక్రవర్తి కుమారుడు, తన తండ్రియైన ఇక్ష్వాకుని ఆహ్వానించాడు. బ్రహ్మర్షులలో శ్రేష్టుడైన వసిష్టుని రుత్విక్కుగా నియమించాడు. ఆయనతో పాటు అత్రి మహర్షిని, అంగిరసుని, తపోనిధియైన భృగువును కూడా నియమించాడు.

ఇంతలో వసిష్ఠున్ని దేవేంద్రుడు పిలిచి తను చేస్తున్న యజ్ఞాన్ని పూర్తి చసి పొమ్మన్నాడు. దేవేంద్రుణ్ణి కాదనలేని వసిష్ఠుడు నిమి మహారాజుతో తను దేవలోకం నుండి వచ్చిన సత్రయాగాన్ని పూర్తి చేస్తానని చెప్పి వెళ్లిపోయాడు. పిదప నిమి మహారాజు తన యాగం త్వరగా పూర్తి కావాలని వసిష్ఠుని స్థానంలో గౌతముణ్ణి నియమించి తన యజ్ఞాన్ని పూర్తి చేశాడు.

ఆ యజ్ఞం పూర్తి అయ్యేందుకు అయిదువేల సంవత్సరాలు పట్టింది. పిమ్మట ఇంద్రుని యజ్ఞాన్ని పూర్తి చేయించి వచ్చిన వసిష్ఠుడు తన స్థానంలో గౌతముడు ఉండి యజ్ఞం పూర్తి చేయించాడని తెలుసుని మహారాజుపై ఉగ్రుడై పోయాడు. నిమిమహారాజు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో నిమి మహారాజు నిద్రపోతున్నాడు. రాజు కోసం ఒక ముహూర్త కాలం కూర్చున్నాడు.

ఆ తరువాత కోపావిష్టుడై ‘రాజా! నువ్వు నన్ను అవమానం చేశావు. నాకు వాగ్ధానం చేసి, మరొకరి చేత నీ యజ్ఞాన్ని పూర్తి చేయించుకున్నావు. అందువల్ల నీ దేహం చైతన్యం లేకుండా పోవుగాక! అని శపించాడు. పిదప నిద్ర మేల్కొన్న రాజు, మహర్షి శాపం గురించి విని ‘ఓ బ్రహ్మర్షీ! నేను స్పృహ లేకుండా నిద్రపోతూ ఉంటే నన్ను శపించావు. కాబట్టి బ్రహ్మర్షివైన నీ దేహం కూడా చైతన్యం లేకుండా పోవుగాక అని శపించాడు. లక్ష్మణా! ప్రభావంలో నిమి చక్రవర్తి, వసిష్ట మహర్షులు సమానులే కావటం వల్ల కోపావేశాలకు లోనై ఒకరినొకరు శపించుకున్నారు.

వెంటనే వారిద్దరూ దేహం లేనివారైనారు అని శ్రీరాముడు చెప్పాడు. తప్పో, ఒప్పు మంచిదో, చెడ్డదో దీనినంతా గ్రంథస్థం చేసిన వాల్మీకి మర్షికి ముందు వందనాలు. నిమిచక్రవర్తి ఒక రాజర్షి. వసిష్ఠుడు ఒక బ్రహ్మర్షి. నిమిచక్రవర్తి యాగంలో రుత్విక్కుగా వ్యవహరించటానికి ముందు వశిష్ఠుడు ఒప్పుకొన్నాడు.
ఆ తర్వాత పిలిచాడు ఇంద్రుడు ఆయన్ని. నిమిచక్రవర్తికి ముందు మాట ఇచ్చాను అతని యాగాన్ని పూర్తిచేసి తర్వాత నీ యాగాన్ని చేస్తానని ఇంద్రునికి చెప్పవలసింది. అలా చేయక, ఎప్పుడో అయిదువేల యేండ్ల తర్వాత వచ్చి కోపంతో నిజానిజాలను విచారించక నిమిచక్రవర్తి నిద్రలో ఉన్నప్పుడు ముందుగా తనే శాపం పెట్టడం బ్రహ్మర్షికి తగునా? ఏ మంచి పనినైనా వాయిదా వేయక వెంటనే చేయాలంటారు.

యాగాన్ని చేయటం మంచిది కాబట్టి అట్టి అవసర సమయంలో ఇచ్చిన మాటను తప్పి వసిష్ఠుడు ఇంద్రుని వెంట పోయినా కోప పడక, దిగులు చెందక నిమిచక్రవర్తి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకొని సత్కార్యాన్ని ముగించాడు. నిజానికి వసిష్ఠుడు సంతోషించి, అభినందించాలి. అలా కాకుండా శపించాడు. కోపమనేది రాజర్షినైనా, బ్రహ్మర్షినైనా భ్రష్టు పట్టిస్తుందని ఆధునిక శాస్త్ర సూత్రాన్ని మనకు ఏనాడో రాయబడిన శ్రీమద్రామయణం తెలుపుతున్నది.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/