సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన శ్రీలంక

ఇక మా వల్ల కాదు.. విదేశీ అప్పులను ఎగ్గొట్టేస్తాం: శ్రీలంక

కొలంబో : ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక మంగ‌ళ‌వారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. విదేశాల నుంచి తీసుకున్న అప్పులను ఇకపై తాము కట్టలేమని, వాటిని ఎగ్గొట్టేస్తామని ఆ దేశ ఆర్థిక శాఖ ప్రకటించింది. 5,100 కోట్ల డాలర్ల (సుమారు రూ.3.88 లక్షల కోట్ల) అప్పులను కట్టబోమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి బెయిల్ అవుట్ ఇంకా పెండింగ్ లోనే ఉందని, కాబట్టి అప్పులను కట్టలేమని పేర్కొంది.

తమకు అప్పులిచ్చిన దేశాలు వడ్డీ కావాలంటే దేశంలోనే వేరే ఇతర మార్గాలనుంచైనా తీసుకోవచ్చని లేదా శ్రీలంక రూపీల్లో కట్టించుకునేందుకు అంగీకరించాలని తేల్చి చెప్పింది. అయితే, శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ అధికారులు మాత్రం అప్పులు చెల్లించడాన్ని తాత్కాలికంగా మాత్రమే రద్దు చేస్తున్నామని చెబుతున్నారు.

ఇప్పుడున్న డాలర్లతో అప్పులు కడితే తిండి గింజలు, నిత్యావసరాల దిగుమతులపై పెను ప్రభావం పడే ముప్పుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే అప్పుల చెల్లింపును తాత్కాలికంగా రద్దు చేసి ఆ డాలర్లను దిగుమతులకు చెల్లిస్తామని అంటున్నారు. ప్రస్తుతం అప్పు చెల్లింపులు తమకు పెద్ద తలనొప్పిగా మారాయని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అన్నారు. ఇప్పుడు అప్పులు కట్టడం అసాధ్యం కూడా అని తేల్చి చెప్పారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/