ఏపీ కొత్త సీఎస్‌గా శ్రీలక్ష్మి..?

ఏపీ కొత్త సీఎస్‌గా శ్రీలక్ష్మిని ఖరారు చేయబోతున్నారా..ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న సమీర్ శర్మ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో కొత్త సీఎస్‌ను ఎంపిక చేసే పనిలో ప్రభుత్వ పడినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త సీఎస్ కోసం పలువురు అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు చెబుతున్నారు. వారిలో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తుంది. సీఎం జగన్ కూడా శ్రీలక్ష్మి పనితీరు పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తోన్నాయి.

ఇటీవల ఓఎంసీకి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో.. ఆమెను సీఎస్‌గా నియమించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని ప్రభుత్వం భావిస్తోన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శిగా ఆమె పనిచేస్తోన్నారు. 1988 బ్యాచ్‌కి చెందిన శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గనులశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఏపీ క్యాడర్‌కు వెళ్లేందుకు ఆమె దరఖాస్తు చేసుకోవడంతో.. తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ క్యాడర్‌కు మారిన తర్వాత జగన్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి పనిచేస్తున్నారు.