నేడు శ్రీరామ పట్టాభిషేకం

Sri Sita Rama Kalyanam at Bhadrachalam
Sri Sita Rama Kalyanam at Bhadrachalam

హైదరాబాద్‌: ఆదివారం భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. కుటుంబం తరపున వ్యక్తిగతంగా సీతారామచంద్రస్వామివారికి పట్టువస్ర్తాలను పంపించారు. ఈ పట్టువస్ర్తాలను దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ అందజేశారు. త్రిదండి చినజీయర్‌స్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీరంగక్షేత్రం, శృంగేరి పీఠం నుంచి స్వామివారికి పట్టువస్ర్తాలు, శేషమాలికలు, పవిత్రాలు పంపించారు. రామదాసు వంశం పదోతరంగాఉన్న కంచర్ల శ్రీనివాస్ దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు అందజేశారు.
శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో తొలుత ధ్రువమూర్తులకు కల్యాణం చేశారు. తరువాత మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా.. భక్తుల జయజయ ధ్వానాల మధ్య పల్లకీలో కల్యాణమండపానికి స్వామివారు తరలివచ్చారు. ముందుగా తిరుకల్యాణానికి సంకల్పం చేసి విశ్వక్సేన పూజ నిర్వహించారు. అనంతరం పుణ్యాహవాచనం జరిగింది. తర్వాత 24 అంగుళాల పొడవుగల 12 దర్భలతో అల్లిన దర్భతాడును సీతమ్మవారి నడుముకు బిగించారు. రామయ్య కుడిచేతికి, సీతమ్మ ఎడమ చేతికి రక్షాసూత్రాలు తొడిగి, స్వామి గృహస్థాశ్రమసిద్ధికోసం సువర్ణయజ్ఞోపవీతాన్ని ధరింపచేశారు. అనంతరం కన్యాదానం చేశారు. వేద మంత్రాల నడుమ అభిజిత్‌లగ్నం సమీపించగానే సీతారాముల శిరస్సుపై జీలకర్ర, బెల్లం ఉంచారు. జనకమహారాజు, దశరథమహారాజు తరపున చేయించిన రెండు మంగళసూత్రాలతోపాటు భక్తరామదాసు సీతమ్మకు చేయించిన మరొక సూత్రం కలిపి మూడుసూత్రాలతో మాంగళ్యధారణ చేశారు.

నేడు శ్రీరామ పట్టాభిషేకం

శ్రీసీతారాముల కల్యాణం ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరుగగా.. అధికారులు సోమవారం నిర్వహించనున్న శ్రీరామపట్టాభిషేకంపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. పట్టాభిషేకం వేడుకను వీక్షించే భక్తులకు టికెట్లను విక్రయించింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరుకానున్నారు.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/