మహింద రాజపక్సను అదుపులోకి తీసుకోవాలి : శ్రీలంక కోర్టు

కొలంబో : శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స తోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకోవాలని శ్రీలంక కోర్టు సీఐడీకి ఆదేశించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారుపై దాడులు చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభానికి బాధ్యతవహిస్తూ రాజీనామా చేయాలని ప్రధాని నివాసం వెలుపల దాడులు జరిగినట్లు అటార్నీ సెనక పెరీరా అనే వ్యక్తి కొలంబో మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. మహింద మద్దతుదారులే ఈ దాడులకు తెగబడినట్లు అందులో ఆరోపించారు. దీనిపై రాజపక్సతోపాటు పార్లమెంటు సభ్యులు జాన్స్‌టన్‌ ఫెర్నాండో, సంజీవ ఎదిరిమన్నె, సనత్‌ నిశాంత, మొరాటువా మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సమన్‌ లాల్‌ ఫెర్నాండో, సీనియర్‌ పోలీసు అధికారులు దేశబందు తెన్నకూన్‌, చందనా విక్రమరత్నను తక్షణమే అరెస్టు చేయాలని పిటీషనర్‌ కోరారని శ్రీలంక మీడియా పేర్కొన్నది.

కాగా, మహింద రాజపక్స, ఆయన కుమారుడు నమల్, మిత్రపక్ష పార్టీ నేతలు దేశం విడిచి వెళ్లవద్దని కోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో వారు దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/