శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన వేలాది మంది

అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్

కొలంబో: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. పెట్రోల్, డీజిల్ దొరకడం లేదు. రోజుకు 13 గంటల విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నీళ్లు కూడా బ్లాక్ లో కొనుక్కోవాల్సిన దుర్భర పరిస్థితి. పేపర్ కొరతతో విద్యార్థుల పరీక్షలను కూడా వాయిదా వేశారంటే ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరుకుల కోసం జనాలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. మరి కొందరు దేశం దాటి పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. నిన్న అర్ధరాత్రి కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని వేలాది మంది ప్రజలు చుట్టుముట్టారు. అధ్యక్ష భవనం ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 5 వేల మంది నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్టు సమాచారం. మరోవైపు నిరసనకారులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో అక్కడ పరిస్థితి చేయి దాటి హింసాత్మకంగా మారింది. పోలీసుల మీదకు నిరసనకారులు రాళ్లు, బాటిళ్లు విసిరారు. దీంతో, టియర్ గ్యాస్, జల ఫిరంగులను పోలీసులు ప్రయోగించారు. ఈ క్రమంలో, నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో, శ్రీలంక ప్రభుత్వం కొలంబోలో 144 సెక్షన్ విధించింది. సైన్యాన్ని రంగంలోకి దించింది. మరోవైపు నిరసనకారులు ఆందోళన చేస్తున్న సమయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధ్యక్ష భవనంలో లేరని సమాచారం. ఆయన రహస్య ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఘటనలో 45 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ..పోలీసులు అడ్డుకుని ఉండకపోతే అధ్యక్ష భవనంపై దాడి జరిగేదని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/