శ్రీలంకలో 16వ రోజూ కొనసాగిన నిరసనలు

రాజీనామా డిమాండ్ చేస్తూ ప్రధాని నివాసం ముట్టడి
రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న మహీంద రాజపక్స


కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి బయపడేందుకు నానా అగచాట్లు పడుతున్న శ్రీలంకలో వరుసగా 16వ రోజూ ఆందోళనలు కొనసాగాయి. ప్రధాని మహీంద రాజపక్స రాజీనామాను డిమాండ్ చేస్తున్న వేలాదిమంది నిన్న ఆయన అధికారిక నివాసాన్ని ముట్టడించారు. ఇంటర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఐయూఎస్ఎఫ్)కు చెందిన వేలాదిమంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ప్రధాని నివాసానికి చేరుకుని ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఇంటి గోడపైకి ఎక్కి రాజపక్సకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే, నిరసనల సమయంలో ప్రధాని ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. మరోవైపు, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని రాజపక్స తేల్చిచెప్పారు. అలాగే, మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను కూడా తోసిపుచ్చారు. ఒకవేళ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే అది తన ఆధ్వర్యంలోనే జరగాలని మహీంద స్పష్టం చేశారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/