శ్రీలంక ప్రధానికి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు

కొలంబో : తీవ్ర ఆర్థిక‌, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న‌ శ్రీలంకలో పరిస్థితిని గట్టెక్కించేందుకు ప్రధాని రణిల్‌ విక్రమసింఘేను ఆ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఆర్థికమంత్రిగా బుధవారం నియమించారు. ఈ మేరకు ఆయన ప్రమాణస్వీకారం చేశారు. స్వాతంత్య్రం తర్వాత తొలిసారిగా శ్రీలంక ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవడం, ఆ తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధానిగా కొనసాగిన మహింద రాజపక్స రాజీనామా చేయడంతో విక్రమసింఘే ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు ఐదుసార్లు ఆయన ప్రధానిగా పని చేసిన అనుభవం ఉన్నది. ఈ నెల 12న ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విక్రమసింఘే.. ఆ తర్వాత పలు దేశాలతో సంబంధాలను పెంపొందించేందుకు చొరవ చూపారు.

అలాగే ఇంధన సరఫరా, మధ్యంతర బడ్జెట్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. 225 మంది సభ్యులున్న అసెంబ్లీలో కేవలం ఒకే సీటున్న విక్రమసింఘేకు కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాజకీయ పక్షాలు మద్దతునిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. శ్రీలంకలో ఆహారం, ఇంధనం, మందులు, వంటగ్యాస్‌, టాయిలెట్‌పేపర్‌ సహా అగ్గిపుల్లలకు సైతం కొరత ఉన్నది. స్టోర్లలో స్టాక్‌ పరిమితంగా ఉండడంతో కొనుగోలు చేసేందుకు జనం క్యూలైన్లలోనే బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొన్నది. 2026నాటికి తిరిగి చెల్లించాల్సిన 25 బిలియన్ల విదేశీ రుణాల్లో సుమారు ఏడు బిలియన్ల చెల్లింపులను నిలిపివేసింది. అయితే, నిత్యావసరాల కొరత నేపథ్యంలో ప్రస్తుతం సంక్షోభాన్ని నివారించేందుకు శ్రీలంకకు 4 నుంచి 5 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అవసరం.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/