కిలో పాలు రూ. 1,195…2,657కు పెరిగిన వంట గ్యాస్

ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక

కొలంబో: ఆహార సంక్షోభంతో శ్రీలంక కొట్టుమిట్టాడు తున్నది. నిత్యావసరాలపై ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేయడంతో ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకాయి. పాలు, గ్యాస్ సిలిండర్ ధరలు ఎవరూ కొనుగోలు చేయలేని స్థాయికి చేరుకున్నాయి. కిలో పాల (అక్కడ కిలోలుగా పరిగణిస్తారు) ధర ఐదింతలు పెరిగి ఏకంగా రూ. 1,195 (శ్రీలంక కరెన్సీ)కి చేరుకోగా, వంట గ్యాస్ ధర రెండు రోజుల్లో 90 శాతం పెరిగి రూ.2,657కు ఎగబాకింది. పప్పులు, ఉప్పులు, సిమెంట్ సహా ధరలన్నీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

దేశంలోని విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో నిత్యావసరాలపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది. ఫలితంగా డిమాండ్-సరఫరా మధ్య భారీ అంతరాయం ఏర్పడింది. దీంతో ధరలు కొండకెక్కాయి. పెరిగిపోతున్న ధరలను నియంత్రించేందుకు అత్యవసర నిబంధనలు తీసుకురావడం మరిన్ని సమస్యలకు దారితీసింది. అక్రమ నిల్వలు పెరిగాయి. ఫలితంగా మార్కెట్లో సరకు తగ్గిపోయింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధ్యక్షతన గత గురువారం కేబినెట్‌ సమావేశమైంది. ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని నిర్ణయించింది. శుక్రవారం ఈ విషయమై అధికారికంగా ప్రకటించిన తర్వాత ధరలు అమాంతం పెరిగిపోయాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/