శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం..వారానికి నాలుగు పనిదినాలకు అనుమతి

కొలంబో : ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను తాజాగా ఇంధన కొరత వేధిస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ కొరత నేపధ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు పనిచేసేందుకు అనుమతించింది. ఆర్ధిక సంక్షోభం చుట్టుముట్టడంతో ఇంధనం, ఆహారం, మందుల దిగుమతికి అవసరమైన విదేశీ మారకద్రవ్య నిల్వల కొరత శ్రీలంకను వెంటాడుతోంది.
లక్షలాది మంది దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వద్ద గంటల తరబడి వేచిచూసే పరిస్ధితి నెలకొంది. మరోవైపు నెలల తరబడి విద్యుత్ కోతలు లంకను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దిక్కుతోచని స్ధితిలో ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలల పాటు ప్రతి శుక్రవారం సెలవు దినంగా ప్రకటించేందుకు శ్రీలంక క్యాబినెట్ ఆమోదించింది.
ఇంధన కొరతతో కార్యాలయాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు సెలవు దినాల్లో వ్యవసాయ ఉత్పత్తుల సాగుకు వారిని ప్రోత్సహిస్తోంది. ఆహార కొరతను అదిగమించేందుకు ఉద్యోగులను వారానికి మూడు సెలవు దినాల్లో తమ ఇండ్లలో కూరగాయలు, పండ్లు సాగుచేసేందుకు ప్రోత్సహించాలని నిర్ణయించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/