ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక..భారత్‌ ఆపన్న హస్తం

కొలంబో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంక- భారత్‌తో మళ్ళీ స్నేహ సంబంధాలకు హస్తం చాచింది. గతంలో కొలంబో పాలకులు భారత్‌ను కాదని ఇతర దేశాలకు దగ్గరయ్యేందుకు యత్నించారు. ప్రత్యేకించి డ్రాగన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు శ్రీలంకను రుణ ఊబిలోకి నెట్టేశాయి. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఆప్త మిత్రదేశం ఇండియాతో పలు ఒప్పందాలు కుదుర్చుకొంటూ కొలంబో వడిగా అడుగులు వేస్తోంది. రుణాల పేరుతో హంబన్‌టొటా నౌకాశ్రయాన్ని డ్రాగన్‌ దేశం 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకోవడంపై శ్రీలంక ప్రజలు మండిపడుతున్నారు. గతేడాది కొలంబో నౌకాశ్రయం తూర్పు కంటైనర్‌ టెర్మినల్‌ ఒప్పందం నుంచి భారత్‌, జపాన్‌లను శ్రీలంక బయటకు పంపింది. జాఫ్నా ప్రాంతంలోని నైనతీవు, నెడున్‌తీవు, అనలైతీవు దీవుల్లో చైనాకు చెందిన సంస్థలతో హైబ్రీడ్‌ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీలంక ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌కు అత్యంత దగ్గరగా ఉండే జాఫ్నా దీవుల్లో చైనా అడుగుపెడితే భారత్‌కు ఇబ్బందులు తప్పవని రక్షణ రంగ నిపుణులు హెచ్చరించారు. తాజాగా ఆ మూడు దీవుల్లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని భారత్‌కు అప్పగిస్తూ శ్రీలంక నిర్ణయం తీసుకోవడం భారత్‌ దౌత్య విజయానికి చిహ్నం. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్‌ ఇప్పటికే వంద కోట్ల డాలర్ల రుణాన్ని ప్రకటించింది.

కాగా, చిరకాలంగా శ్రీలంకను ఆదుకుంటున్న భారత్‌పై అక్కడి ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉంది. కానీ, కొలంబో పాలకులతో పాటు జనతా విముక్తి పెరమున వంటి రాజకీయ పక్షాలు విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నాయి. తాజాగా గస్తీ విమానంతోపాటు తేలియాడే డాక్‌ సౌకర్యాన్ని కొలంబో రక్షణ దళాలకు ఇండియా అందజేసింది. ఆధార్‌ తరహాలో శ్రీలంకలోనూ చేపట్టనున్న డిజిటల్‌ గుర్తింపు కార్డుల ప్రాజెక్టుకు ఇండియా ఇప్పటికే నిధులు అందించింది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు పెట్రో ఉత్పత్తుల కొనుగోలుకు రుణాలు మంజూరు చేసింది. ఇప్పటికే భారత్‌లోని పలు నౌకాశ్రయాల నుంచి ద్వీపదేశానికి బియ్యం పంపేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగైతే, భారత వ్యతిరేక శక్తులకు వేదికగా శ్రీలంక మారకుండా నిలువరించే అవకాశం దక్కుతుందని భారత్‌ రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/