శుభకరం- శ్రావణం

వేడుకలు -విశిష్టత

Varalakshmi devi
Varalakshmi devi

తెలుగు నెలల్లో కొన్ని నెలలను ప్రత్యేకంగా పేర్కొంటారు. ఆ నెలలలో పూజలు, వ్రతాలు చేస్తారు. అందులో శ్రావణమాసం ఒకటి. శ్రావణ మాసం కొత్తగా పెళ్లయిన స్త్రీలకు ఎంతో ప్రత్యేకమైనది.

సాధారణంగా ఈ మాసం ఆగస్టు నెలలో వస్తుంది. శ్రవణ నక్షత్రం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసంగా పేరొచ్చింది. ఈ నెలలోని ప్రతిరోజు మంగళప్రదమైనదే. శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువ్ఞ జన్మనక్షత్రం కావడం వల్ల ఈ నక్షత్రాన్ని ఎంతో మంగళకరమైనదిగా భావిస్తారు

శ్రవణ నక్షత్రం రోజున మహావిష్ణువ్ఞ బ్రహ్మదేవ్ఞడిని మొదటిసారిగా చూశాడని పురాణాలు చెపుతున్నాయి. ఈ సమయంలోనే విష్ణువ్ఞ గోవిందుడిగా వెలిసాడు. శ్రవణ నక్షత్రం రోజునే గోవిందుడు మహాలక్ష్మిని వెతుకుతూ తిరుమల కొండకు చేరుకున్నాడు.

పురాణ కాలంలో ఈ శ్రావణ మాసంలోనే ఉపకర్మలు, వేదపఠనం జరిగింది. ఈ మాసం లక్ష్మీదేవి, గౌరీదేవికి ప్రీతికరమైనది. ఆషాఢ మాసంలో వేరుగా ఉండే కొత్త దంపతులు శ్రావణ మాసంలో కలుస్తారు. శ్రావణమంటే పండుగలకు శోభను తెచ్చే మాసం. అందుకే ఈ మాసం అమూల్యమైనదిగా భావిస్తారు. శ్రవణమంటే వినడం.

వినడం కూడా ఒక కళే. చక్కగా వినేవారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి కుటుంబాన్ని రూపొందించేది ఇంటి ఇల్లాలు. స్త్రీలకు అన్ని మాసాలల్కోఇ శ్రావణ మాసం అంటే ఇష్టం. ఈ మాసంలో వచ్చే పండుగ ఎంతో శుభకరమైది.

కార్తీక మాసంలో సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది. అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారం కూడా అంతే మంగళప్రదమైనది. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అందే ప్రత్యేకమైనవి.

ఈ మాసంలో స్త్రీలు తమ సౌభాగ్యం, అందరి సంతోషం కోసం పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. ఈ మాసంలో మొదటి పదిహేను రోజుల్లో వచ్చేది గరుడ పంచమి.

గరుడుడు తన తల్లిని దాస్యత్వం నుంచి విముక్తి కలిగించి మహావిష్ణువ్ఞకు వాహనంగా మారతాడు. బలం, ధైర్యం కోసం గరుడుడిని పూజిస్తారు. శ్రావణ సుధ సప్తమి సూర్యారాధనకు ముఖ్యమైనది.

సంతానం బాగుండాలని శ్రావణ సుధ ఏకాదశి రోజున వ్రతం చేసి, గొడుగులను దానం చేస్తారు. శ్రావణ సుధ ద్వాదశి రోజున శ్రీహరిని ప్రార్థిస్తారు. త్రయోదశి, చతుర్ధశిలలో శివ్ఞడు, పార్వతిలను పూజిస్తారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి ప్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం కొత్తగా వివాహమైన స్త్రీలు భర్తల మంచికోసం, మంచి సంతానం కోసం చేస్తారు.

భర్త సంక్షేమం కోసం మంగళ గౌరీ వ్రతాన్ని కూడా నిష్టగా ఆచరిస్తారు. పాలసముద్రాన్ని చిలికినపుడు అందులో నుండి వచ్చిన గరళాన్ని శివ్ఞడు స్వీకరించకుండా ఆపేందుకు పార్వతిదేవి ఈ వ్రతాన్ని ఆచరించిందంటారు.

మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో ఆచరిస్తారు. నలుపు వర్ణంలో ఉన్న పార్వతీ దేవి తపసు చేయడంతో ఎరువ్ఞ వర్ణంలో మారిందని అప్పటి నుండి ఆమెను గౌరీదేవిగా మారిందట.

గౌర వర్ణం ధరించిన పార్వతీదేవిని లోకకళ్యాణం కోసం శివ్ఞడు శ్రావణంలో వచ్చే మంగళవారాలలో పూజించాడంటారు. సోమవారం శివ్ఞడిని ఆరాధిస్తారు.

శనివారం ఇలవేలును పూజిస్తారు. శ్రావణ పౌర్ణమిని రాఖీపౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున అక్కచెల్లెలు అన్నదమ్ములకు రక్షణ ఉండాలని రక్షాబంధం కడతారు. తమ అక్కాచెల్లెలు సంతోషంగా జీవించాలని అన్నదమ్ములు కోరుకుంటారు.

ఈ జంధ్యాల పౌర్ణమి రోజున పెళ్లయి ఉపనయనమయిన మగవారు గాయత్రి మంత్రాన్ని జపించి యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. జ్ఞానానికి మూలమయిన హయగ్రీవ్ఞడు, లోకాలకు సంతోషాలనిచ్చే సంతోషి మాత ఈ శుభదినాని ఆవిర్భవించారు.

ఈ రోజునే ఆగస్త్య మహాముని లలితా సహస్రనామ పారాయణం చేశాడు. సంవత్సరంలో వచ్చే అన్ని సంకటహార చతుర్ధులలోకెల్లా శ్రావణ మాసంలోవచ్చే సంకట హార చతుర్థి శ్రేష్టమైనది.

ఈ రోజున గణపతిని పూజిస్తారు. శ్రావణ శుక్ల అష్టమిని కృష్ణాష్టమిగా, గోకులాష్టమిగా జరుపుతారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన పాలు, వెన్న, జున్ను, పండ్లు నివేదిస్తారు.

ఇంటిల్లిపాది సంతోషంగా ఉండేలా దేవతలను దీవించమని ఈ నెలలో వచ్చే ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం చేసి వెన్న దానం చేస్తారు. శ్రావన బహుళ అమావాస్యను పొలాలా అమావాస్య అంటారు. ఈ రోజున జంతువ్ఞలను పూజిస్తారు.

ఉత్తర భారతదేశంలో నిర్వహించే కణ్వయాత్ర ప్రధానమైనది. ఈ రోజున బంబం భోలే అంటూ శివ్ఞడిని ప్రార్థిస్తూ గంగానది వరకు కాలినడకన చేరుకుని శివ్ఞడికి అభిషేకం చేస్తారు. ఈ విధంగా చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని స్కందపురాణంలో ఉంది.

ఈ నెలలో పదిహేను రోజులలో వచ్చే పదిహేను తిథులలో పదిహేను మంది దేవతలను పూజించటం ప్రత్యేకంగా చెప్పుకొంటారు.

పాడ్యమి రోజున బ్రహ్మదేవ్ఞడిని, విదియలో శ్రీపతి, తదియ పార్వతి, చతుర్థి గణపతి, పంచమి శశి, షష్టి నాగదేవత, సప్తమి సూర్యుడు, అష్టమి దుర్గాదేవి, నవమి మాతృదేవతలు, దశమి ధర్మరాజు, ఏకాదశి రుషులు, ద్వాదశి శ్రీమహావిష్ణువ్ఞ, త్రయోదశి అనంగుడు, చతుర్దశి శివ్ఞడు, పౌర్ణమి రోజున పెద్దలను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు.

గుణవంతుడైన భర్తతో పెళ్లి జరగాలని ఆడపిల్లలు ఈ నెలలో సోమవార వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించిన వారు ఒంటి పూట భోజనం చేస్తారు. మాంసాహారాన్ని ముట్టకుండా జపమాలలు, రుద్రాక్షలు ధరిస్తారు.

శివచాలీసా, మహా మృత్యుంజయ మంత్రా లను జపిస్తారు. వ్రతం పూర్తయిన తరువా త ఆ మాలలను పసుపు నీటితో కడిగి మణికట్టుకు కట్టుకుంటారు. శుభకార్యాలు చేసేందుకు శ్రావణమాసం ప్రధానమైనది.

ఈ మాసంలో వైకుంఠద్వారాలు తెరుచుకుంటాయి. పూజలు, వ్రతాలతో మహిళలు ఈ నెలలో ప్రతి ఇల్లు ఎంతో సందడిగా ఉంటుంది.

వర్షాకాలంలో ఈ మాసంలో మహిళలు పూజలు, వ్రతాలు చేసి ఉపవాసాలు ఆచరించటం వలన ఈ కాలంలోవచ్చే జబ్బుల నుండి రక్షించబడతారు. ఒంటి పూట భోజనం వలన ఆరోగ్యంగా ఉంటారు.

అందుకే ఈ శ్రావణమాసం ఎంతో శ్రేష్టమైనది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/