నిత్యం సన్నిహితో మృత్యుః

ఆధ్యాత్మిక చింతన

Devotional stories
Devotional stories

కాల ప్రభావం చాలా తీవ్రమయినది. కాలపురుషునికి లొంగని వాళ్లు ఈ చరాచర జగత్తులో ఉండరు.

కాలప్రభావం వలననే భగవంతుడు కూడా ఎన్నెన్నో అవతారాలు ఎత్తవలసిన అవసరం వచ్చిందంటే అది కాల ప్రభావం కాక ఏముంది

పరిపూర్ణ మహాపురుషుడయినటువంటి శ్రీరాముడే అరణ్యానికి వెళ్లాల్సి వచ్చింది. బంగారులేడి ఉందని నమ్మి దాని వెంట పరిగెత్తాడు.

సీతమ్మ ఎంత సాధ్వి అయినప్పటికీ లక్ష్మణున్ని అనరాని మాటలనడం కాల ప్రభావమే. కాల ప్రభావం వల్లనే కుబేరుడు బిచ్చగాడవుతాడు. బిచ్చగాడు కుబేరుడవుతాడు.

కాలం మాత్రం అన్నింటిని తన ప్రళయంలో కలిపేసుకుంటుంది. కాలం ఆ ప్రళయంలోనూ ఎంతో హాయిగా ఉంటుంది.

ధర్మాధర్మాల మధ్య తేడాను చూపెడుతుంది. అందుకే పాండవులు కర్మం బాగోలేక అడవులపాలవుతారు.

కృష్ణుణ్ని చూసి మురిసిపోయిన యాదవకులం ఎటువంటి నామరూపాల్లేకుండా కాలగర్భంలో కలిసిపోయింది. దేవాధిదేవతా గుణాలు కలిగిన వారే కాలం యొక్క ప్రభావానికి లోనయ్యారంటే ఇక సామాన్య మానవలు పరిస్థితేంటి?

కాలం చేతుల్లో కీలుబొమ్మలుగా మారాల్సిందే మరి! ‘మహాగజాః పలాయంతే మశకా నాంతు కాగతిః అన్నట్లు పెద్ద పెద్ద ఏనుగులే పరుగులు తీస్తున్నప్పుడు మరి దోమల గతేమిటన్నట్లుంది.

ప్రతి ఒక్కరి జీవితాలు మన కళ్లముందే సమసిపోతుంటాయి.

ప్రకృతి విళయతాండవంలో ఎన్నో జీవరాశులు నశిస్తుంటాయి. అనుకుంటుండగానే ఆయుష్షు తీరిపోతుంది. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఇవన్నీజరిగిపోతూనే ఉంటాయి.

అలా గడిచిపోయిన రోజులు మళ్లీ తిరిగిరావు. కాలం అనేది ఈ జగత్తునే మింగేస్తోంది. సంపదలు శాశ్వతం కాదు.

ఎవరు ఎప్పుడు ఏ స్థాయిలో ఎన్నాళ్లుంటారో తెలియదు. మనిషి ఊహించిందేదీ జరగదు. జీవితం మెరుగులాగా మెరిసి మాయమైపోతుంది.

అంతా మిథ్యే.చావు,పుట్టుకల మధ్యన మనిషి జీవించి ఉన్న సమయంలోనే బంధాలు, ప్రేమలు, కోరికలు, స్వార్ధం ఇవన్నీ మనిషి యొక్క బాధ్యతలను, మంచి చెడులను జరిగేలా చేస్తాయి. మనిషి గుణం ఎప్పుడెలా ఉంటుందో తెలియదు.

మానవుల యొక్క బుద్దులు కాలం చేత బలవంతంగా లాగివేయబడతాయి. ప్రకృతి అంతా కూడా కాలానికి సంబంధించినదే. అందుకే ‘సర్వమ్‌కాలికం అంటుంది శాస్త్రం, పురాణం. కాలం వేగంగా ముందుకు పరిగెడుతుంటుంది.

ఆ వేగంలో ప్రతి జీవి కొట్టుకుపోవలసిందే. కాలాన్ని ఆపే శక్తి దేనికీ లేదు.

కాలం ప్రభావం వల్ల వందల సంవత్సరాలు పెరిగి పెద్దవై ఎంతో లోపలికి వేళ్లూనుకున్న మహామహావృక్షాలు గాలివేగానికి ప్రకృతి భీభత్సానికి తట్టుకోలేక నేలకొరిగిపోతాయి.

‘వాత్యేవ నసం కలిదేవ తైషా
బలాత్సమాకర్షతి బుద్ధి వృక్షాన్‌
తస్మాత్‌ గుహాయం హృదయేశయానం
హరింభజస్వాత్ర నకాలవాతాయ

కలిపురుషుడు మానవుల గుణాలనే చెట్లను బలవంతంగా లాక్కుపోతాడు.

కనుక నీ యొక్క గుహలో ఉన్నటువంటి భగవంతున్ని పూజించుము.అందుకే మనిషికి గర్వం ఉండటానికి వీలులేదు. స్వార్ధం, గర్వ, అహంకారాలు పనిచేయవు. ప్రేమైక జీవనమే మేలు.

ధనవంతుడయినా, బీదవాడయినా, బలవంతుడయినా, బలహీనుడయినా కాలవ వచ్చినపుడు వెళ్లిపోవలసిందే కాలం ముందు మనిషి శక్తి ఏదీ పనిచేయదు.

కర్మఫలం తప్ప, అందుకే భూమ్మీద బ్రతికున్నంతకాలం జాలి, దయ ప్రమానుబంధాలతో బ్రతికితే చాలు.

లేకపోయినట్లయితే ఎప్పుడో ఒక్కసారయినా ఈ జీవితమెందుకు అనిపిస్తుంది. ఇది తథ్యం.
‘నిత్యం సన్నిహితో మృత్యు:

మృత్యువనేది నిత్యం మనిషిని ఒక నీడలాగా వెంటాడుతేనే ఉంటుంది. చావుతప్పదు. కానీ ఆ బ్రతికున్న కాలంలో నువ్వెంత తృప్తిగా బ్రతికావన్నదే ముఖ్యం.

ఎన్నో కోట్ల రూపాయలుంటాయి. నువ్వు కూడా ఎంతో ఆరోగ్యంగానే ఉంటావు. అందరికీ నువ్వు మంచివాడననే అనుకుంటావు.

అంతలోనే ప్రకృతిలో జరిగే మార్పులు జీవపరిణామాలకు, ప్రళయాలకు దారి తీసి సృష్టినే అంతం చేస్తే నువ్వేం చేస్తావు?

  • శ్రీనివాస్‌ పర్వతాల

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/