స్పైస్ జెట్ విమానంలో పొగలు

స్పైస్ జెట్ విమానాలు తరుచు సాంకేతిక సమస్యలతో వార్తల్లో నిలుస్తున్నాయి. స్పైస్ జెట్ అంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితికి వచ్చాయి. ఒకటి రెండు సార్లు కాదు వారానికి ఓసారి ఏదో ఒక సాంకేతిక సమస్య తో స్పైస్ జెట్ విమానాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ క్యూ400 ఎయిర్‌క్రాఫ్ట్ VT-SQB కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాబోయే కొద్ది నిమిషల్లోనే విమానం నుంచి పొగలు వచ్చాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగలు రావడాన్ని గమనించిన ఫైలట్ అప్రమత్తమై ఎయిర్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. దీనితో అత్యవసర ల్యాండింగ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు.

ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం 11 గంటల సమయంలో జాగ్రత్తగా ల్యాండ్ అయింది. ఘటన సమయంలో విమానంలో 96మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్ జెట్ ల్యాండింగ్ అనంతరం 9 విమానాలను దారి మళ్లించినట్టు తెలిపారు. ఆ 9 విమానాల్లో 6 డొమెస్టిక్ కాగా, 2 అంతర్జాతీయ, ఒక కార్గో విమానం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఒకరు గాయపడగా.. ఎయిర్‌పోర్ట్‌లోని మెడికల్ సెంటర్‌కు తరలించినట్టు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ‘‘బాధితురాలికి స్పల్ప గాయాలయ్యాయి.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.. ఆమెను తదుపరి చికిత్స కోసం జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.. కొద్ది సేపటి తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు’’ అని పేర్కొన్నాయి. ఒకవేళ పొగలు రగిలి మంటలు అంటుకుంటే భారీ ప్రమాదం చోటు చేసుకునేది.