గర్భిణీలకు యోగా మంచిదే!

Yoga for Pragnants
Yoga for Pragnants

ఇప్పుడు గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం సమస్యగా మారుతున్నది. జీవనశైలి మార్పులవల్ల ప్రకృతి ధర్మాలు వికటిస్తున్నాయి. కోతలేని కాన్పులు కనిపించడం లేదు. సుఖప్రసవం అన్న మాట వినిపించడం లేదు. దీంతో మధురానుభూతులు నింపాల్సిన మాతృత్వం భయాందోళనలకు గురి చేస్తోంది. మా అమ్మాయికి 27ఏళ్లు. బి.టెక్‌ పాసై చెన్నైలో ఉద్యోగం చేస్తున్నది. రెండేళ్ల క్రితం మంచి ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాం. అబ్బాయికి సిగ్గు, బిడియం, భయం ఎక్కువగా వ్ఞన్నందున మూడునెలలు మొదటి రాత్రి జరగలేదు. కౌన్సెలింగ్‌, మానసిక చికిత్స చేయించడంతో సమస్య పరిష్కారమయ్యింది. అయితే అమ్మాయి గర్భసంచిలో గాలిబుడగల వల్ల రుతుసమస్యలు తలెత్తి ఏడాదిపాటు గర్భధారణ జరగలేదు. గైనకాలజిస్టు వద్ద చికిత్స చేయించడంతో ఆ సమస్య పరిష్కారమయ్యింది. ఐదు నెలల క్రితం గర్భం దాల్చింది. ఎట్టకేలకు తల్లి కాబోతున్నదని సంతోషపడుతుండగా ఆమెలో ప్రవర్తనా లోపాలు తలెత్తాయి. లేనిపోని భయం, ఆందోళనతో సతమతమవ్ఞతున్నది. అనవసరంగా భర్తపై అనుమానం పెంచుకుని గొడవపడుతున్నది. నిరాస, నిస్పృహలతో కృంగిపోతున్నది. తిండి సహించక, నిద్రపట్టక చిక్కిపోతున్నది. డాక్టరు పరీక్షించి ఆమె మానసిక రుగ్మతలతో బాధపడుతున్నదని, సైకియాట్రిస్టుకు చూపమని సలహా ఇచ్చింది. సైకియాట్రిస్టు పరీక్షలు జరిపి ప్రినేటల్‌ డిప్రెషన్‌ వల్ల అలా ప్రవర్తిస్తున్నదని చెప్పి మందులు రాసిచ్చారు. అయితే మందుల వాడకంతోపాటు జీవనశైలి మార్చుకోవాలని చూచించారు. అలాగే తేలికైన వ్యాయామాలు, వాకింగ్‌, యోగ, ధ్యానం సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఈ దశలో యోగ పద్ధతులు మంచివని నా స్నేహితురాలు సూచించారు. అయితే మానసిక సమస్యలు తగ్గడానికి, సుఖ ప్రసవం జరగడానికి యోగా ఎలా ఉపయోగపడుతుందన్న సంశయం ఉంది. ఇలాంటి పద్ధతులు ఏవీ పాటించకుండా మన పూర్వీకులు ఒక్కొక్కరు ఐదారుగురు పిల్లల్ని కన్నారుకదా! మరి ఇప్పుడెందుకు ఇలా జరుగుతున్నదో అర్ధం కావడం లేదు. ఇప్పుడిప్పుడే గర్భిణులకు యోగ సాధన కేంద్రాలు ఏర్పడుతున్నాయని తెలిసింది. ఈ నేపధ్యంలో మా అమ్మాయికి మందులు వాడితే సరిపోతుందా? లేక యోగ సాధన కూడా చేయాలా? అన్న మా సంశయాన్ని నివృత్తి చేయండి. – ఇందిరి, విజయవాడ
అమ్మా, విూరన్నట్టు ప్రకృతి సిద్ధమైన మాతృత్వం కూడా ఇప్పుడొక సమస్యగా పరిణమిస్తోంది. దీనికి ప్రధానమైన కారణం జీవనశైలే. ఇప్పటి యువత శారీరక వ్యాయామాలు, శ్రమకు దూరంగా వ్ఞన్నారు. పైగా చదువ్ఞ, ఉద్యోగం లాంటివన్నీ మహిళల్ని తీవ్ర వత్తిడికి గురిచేస్తున్నాయి. శారీరక, ఆరోగ్యం, సామర్థ్యాలు క్షీణించి, ఒత్తిడి పెరిగినపుడు శారీరక మానసిక సమస్యలు తలెత్తుతాయి. హార్మోన్ల అసమతుల్యత, శారీరక వ్యవస్థలు, అవయవాల పనితీరు క్షీణించడమే ఇందుకు కారణం. గర్భధారణ, కొనసాగింపు, ప్రసవం సాధారణ విషయమే అయినప్పటికి ఆ సమయంలో శారీరక ధర్మాలలో తలెత్తే సమస్యల వల్ల రుగ్మతలు ఆవహిస్తుంటాయి. ప్రసవానికి పూర్వం (ప్రీనేటల్‌), ప్రసవానంతరం (పోస్టునేటల్‌) డిప్రెషన్‌ వచ్చే అవకాశం కొందరిలో వ్ఞంటుంది. అలాగే ప్రసవానికి ముందు, తర్వాత సైకోసిస్‌ అరుదుగా వస్తుంటుంది. గర్భధారణ సమయంలో కొందరిలో భయం, ఆందోళన కనిపిస్తుంటుంది. అలాగే అరుదుగా బైపోలార్‌ డిజార్డర్‌, స్కిజోఫ్రెనియాలాంటి తీవ్రస్థాయి మానసిక రుగ్మతలు తలెత్తుతుంటాయి. అలాగే అనరొగ్జియానర్వోసా (అన్నం తినకపోవడం) బులీమియా (అతిగా తినడం) లాంటి ఆహార సంబంధ రుగ్మతలు కొందరిలో తలెత్తుతుంటాయి. ఈ రుగ్మతల వల్ల గర్భిణులలో ప్రవర్తనాలోపాలు, ప్రతికూల భావాలు తలెత్తి సమస్యలకు కారణాలవ్ఞతుంటాయి. భయం, ఆందోళన, దిగులు, నిరాస, నిస్పృహ, చావ్ఞభయం, ఉద్వేగలోపాలు లాంటి సమస్యలు ఆవహిస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించి చికిత్స అందించాల్సి వ్ఞంటుంది. చికిత్సతో పాటు కౌన్సెలింగ్‌, వ్యాయామాలు, యోగ, ధాన్యం సాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కాగా ఇప్పుడిప్పుడే కోతలేని కన్పు, సుఖప్రసవం కోసం యోగకేంద్రాలు ఏర్పడుతున్నాయి. గర్భధారణ నుంచి, ప్రసవం, ప్రసవానంతరం అవసరమైన యోగాసనాలు నేర్పించి సాథన చేయిస్తున్నారు. డాక్టర్ల సలహా మేరకు ఆరోగ్యసూత్రాలు పాటిస్తూ, యోగసనాలు సాధన చేస్తే తప్పకుండా సుఖప్రసవాలు జరుగుతాయని చాలా అధ్యయనాలు, పరిశోధనలు వెల్లడించాయి. ప్రసవ సమస్యలకు ప్రధాన కారణాలుగా గర్భసంచి, ప్రసవద్వారం, కటి (పెల్విక్‌) ప్రాంతంలోని కండరాల లోపమే. శారీరక శ్రమ, వ్యాయామాలు లేకపోవడం వల్ల కండరాలలో సాగుడు తత్వం క్షీణించిపోతుంది. భయం, ఆందోళన వల్ల కండరాలు మరింత బిగుసుకునిపోతాయి. ఈ నేపధ్యంలో డాక్టర్లు సిజేరియన్‌ చేసి పురుడుపోస్తుంటారు. పిండం ఎదుగుదలలో లోపం లాంటి ఇతర సమస్యలు ఉంటాయి. అయితే ప్రసవానికి తోడ్పడే ప్రధాన మార్గాలలో అవసరానికి అనుగుణంగా కండరాలు సాగి, ద్వారం వ్యాకోచించడానికి యోగసనాలు చక్కగా దోహదపడతాయి. అయితే గర్భధారణ సమయంలో పొట్టమీద ఒత్తిడి పడకుండా నిపుణుల పర్యవేక్షణలో ఎంపిక చేసిన ఆసనాలను సాధన చేయాలి.
కాగా రుతుక్రమ సమస్యలు, గర్భకోశ బాధలు, బహిష్టు బాధలు, పిసిడిఒ లాంటి పలు గైనిక్‌ సమస్యల నివారణకు యోగసనాలు దోహదపడతాయి. యోగ, ధ్యానం వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడి మానసిక రుగ్మతలు తగ్గుముఖం పడతాయి. మానసిక ఒత్తిళ్లు నివారణలోను యోగా ఔషధంలా పని చేస్తుంది. అయితే సమస్యను బట్టి డాక్టర్లు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టుల సలహాలు పాటిస్తూ, నిపుణుల సమక్షంలో యోగసాధన చేయాలి. లేదంటే వికటించే ప్రమాదం ఉంది. శరీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం యోగ బాగా పనిచేస్తుంది. కాబట్టి గర్భిణులకు యోగ మంచిదే అని గుర్తించి, ఆచరించండి.

-డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు