విజయాలను ఇచ్చే విజయదశమి

Kanaka durga

భారతీయ సంస్కృతి విశిష్టతతో పరబ్రహ్మను స్త్రీ రూపంగా ఉపాసించడం పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం. అతి ప్రాచీనమైన వేదాలలో భారతీయ విజ్ఞానం నిక్షిప్తమై ఉంది. శ్రీవిద్యోపాసన అనేది మంత్ర సాధనాపరంగా ఉపాసించే ఉత్తమమైన మార్గం. శ్రీవిద్యోపాసనతో ముఖ్యంగా శక్తిస్వరూపిణిగా పిలువబడుతున్నది. రాజేశ్వరి, లలితా పరాబ ట్టారిక మహాత్రిపుర సుందరి, దుర్గాస్వరూపాలలో అమ్మవారిని ఆరాధిం చడం, ఉపాసించడం ఉత్తమమైన సాధనంగా ఎంతోమంది మహనీయులు అనుభవపూర్వకంగా చెప్పారు. అమ్మకు అనంతరూపాలు ఉపాసించే విధానాలు వేర్వేరు. మన సంస్కృతి ఉపాసనతో కూడుకుని ఉంది.
”చరమే జన్మని శ్రీవిద్యయా
శ్రీవిద్య ఉసాసన చేసిన వారికి మరోజన్మ ఉండదు. ఈ జన్మే చివరి జన్మ కాగలదు. శ్రీవిద్యోపాసనతో బాల, పంచదశ, షోడశి, మహాషోడశి అను విశిష్టమైన మంత్రములను ప్రతిరోజూ స్మరించడం ద్వారా మంత్రసిద్ధి, కామ్యసిద్ధి, ఇహపర మోక్షం కలుగుతుందని పురాణాలు, శాస్త్రాలు, పండితులు, దేవి ఉపాసకులు చెబుతున్నారు. శ్రీవిద్య స్వరూపానికి యంత్రరూపమే శ్రీచక్రం. శ్రీవిద్య ఉపాసకులకు శ్రీచక్ర పూజ, అర్చన ఎంతో ప్రాధాన్యమైంది. అమ్మ స్వరూపానికి అభేద్యమైన యంత్ర స్వరూపమే శ్రీచక్రం. ఇది అనేక దేవతల స్వరూపం. శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి. దాన్నే దేవీ స్వరూపం అంటారు. భూపురత్రయం, వృత్తిత్రయం, షోడశదళ కమలం, అష్టదళ కమలం, చతుర్థశారం, అంతర్దశారం, బహిర్దశారం, అష్టారం, త్రికోణం, బిందువ్ఞ అనే ఆవరణలు ఉంటాయి. ఇందులో 9వ ఆవరణం బిందువ్ఞ శ్రీచక్రంలో మధ్యస్తంగా ఉంటుంది. శ్రీవిద్యా స్వరూపం విశిష్టత, దేవి తత్వాన్ని గురించి భాస్కరరాయలు, ఆదిశంకరులు, లలితా సహస్రనామము, సౌందర్యలహరి, సుభగోదయ స్తుతి, దేవీ భాగవతం వంటి గ్రంథాలలో వివరించారు.
శ్రీచక్రాలలో పలు రకాలు

 1. భూప్రస్తారం, మేరు ప్రస్తారం, కైవాస ప్రస్తారం, సనాతన ధర్మములలో ఏ సాధన చేసినా, ఏ పూజ చేసినా, ఏ దేవ్ఞళ్లను కొలిచినా అంతిమ ధ్యేయం మోక్షమని పండితులు పేర్కొంటున్నారు. అట్టి పూజలలో, ఉపాసనలలో శ్రీవిద్యోపాసన చాలా ఉత్తమమైంది. దేశంలో అనే దేవాలయాల్లో, శక్తిపీఠాల్లో శ్రీచక్రార్చనలు, దేవి పూజలు అమలులో ఉన్నాయి. తల్లిని ఆరాధించడానికి మూలమే శ్రీచక్రము. ఈ అర్చనలలో ముఖ్యమైంది చతుష్యష్టి. భగవత్‌ స్వరూపులు ఆదిశంకరులు శ్రీకారం చుట్టిన ఉపచార పూజ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్కొక్క శ్లోకమునకు ఒక్కొక్క ఉపచారం చేయడం ఈ పూజ ముఖ్య ఉద్దేశ్యము. ఆశ్వీయుజ మాసంలో జరిగే దేవీ నవరాత్రుల్లో, శక్తి దేవాలయాల్లో చతుష్యష్ఠి ఉపచార పూజతో అమ్మను విశేషంగా అర్చిస్తారు. ఇందులో 64 ఉపచారాలు ఉంటాయి. ఇదే కాకుండా దేవి ఉపాసకులు ప్రతినిత్యం ఈ ఉపచార పూజలతో అమ్మను అర్చిస్తున్నారు. ఆదిశంకరులు ముఖ్యంగా మానసికంగా అమ్మవారిని చతుష్యష్టి ఉపచారములతో పూజించారు.
  దేవీ నవరాత్రుల సమయంలో దేవాలయాల్లో తొమ్మిదిరోజులు, తొమ్మిది అలంకారాలతో పూజించడం ప్రస్తుతమున్న సాంప్రదాయం. చతుష్యష్టి పూజా విధానంగా శ్రీచక్రార్చనతో, అమ్మవారిని అర్చిస్తే విశేషమైన ఫలితంతో మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు, శాస్త్రాలు, పండితుల వివరణ. ఈ చతుష్యష్ఠి ఉపచార పూజ జంట నగరాల్లో కొన్ని శక్తి దేవాలయాలలో శృంగేరి పీఠాల్లో, బాసర సరస్వతి దేవాలయం, విజయవాడలోని ఇంద్రకీలాద్రి, వరంగల్‌ భద్రకాళి దేవాలయం, కంచనకోట రాజరాజేశ్వరి మందిరంతో పాటు రాష్ట్రంలోని పలు దేవాలయాలలో ఈ మానస పూజతో అమ్మవారిని విశేషంగా అర్చిస్తున్నారు. విజయవాడలో కనకదుర్గా అమ్మవారిని నవరాత్రుల్లో పలు ఉపచార పూజలతో అర్చిస్తున్నారు. మానవశక్తి కన్నా దైవశక్తి అధికం. ఆ దివ్యశక్తులకు మూలశక్తి, పరాశక్తిగా ఆశ్వీయుజమాసంలో శరదృతువ్ఞతో మొదలయ్యే నవరాత్రులు తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో వసంత రుతువ్ఞ, శరదృతువ్ఞ ఈ రెండు సంధికాలాలు ప్రాణకోటికి హానిచేసే మాసాలు. జ్వరాలు, దగ్గులు, జలుబు వంటి రోగాలు, బాధలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ రోగాలు కాకుండా ఉండడానికి నవరాత్రుల ఉత్సవాలు జరిపే సంస్కృతి, ఆరాధించే పద్ధతి, సాంప్రదాయాన్ని మహర్షులు మొదలుపెట్టినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. దేవీ నవరాత్రుల్లో సంఖ్యాపరంగా వచ్చే 9 చాలా విశిష్టమైన సంఖ్య. 9 పూర్ణ సంఖ్య. నవరంధ్రములచే నిర్మితమైన దేహం కలిగిన మానవ్ఞలు నవరాత్రులలో నవవిధ భక్తులచే నవదుర్గా స్వరూపాన్ని ఆరాధిస్తారు.
  ”ప్రథమా శైలపుత్రి, ద్వితీయ బ్రహ్మచారిణి
  తృతీయ చంద్రఘరిటేతి కుశ్మాండేతి చతుర్థకి.
  పంచమ స్కందమాతేతి షష్ట్యా కాత్యానేతిచ, సప్తమా కాళరాత్రిచ,
  అష్టమాశ్చాతి భైరవి.
  నవమా సర్వసిద్ధేశ్చేత్‌ నవదుర్గా ప్రకీర్తితాపి.
  నవరాత్రులలో మొదటిరోజు శైలపుత్రి, రెండోరోజు బ్రహ్మచారిణి, మూడోరోజు చంద్రఘంటా, నాలుగో రోజు కుశ్మాండరూపం, ఐదోరోజు స్కందమాతగా, ఆరోరోజు కాత్యాయనిగా, ఏడోరోజు కాళరాత్రిగా, ఎనిమిదో రోజు గౌరిదుర్గాగా, తొమ్మిదో రోజు సర్వసిద్ధి క్రమంగా పరాశక్తిని ఆరాధిస్తారు. నవరాత్రులలో సప్తమి నుంచి మూల నక్షత్రం రోజున సరస్వతిదేవిని పూజించడం ఇందులో విశేషం. దశకంఠుడైన రావణాసురుణ్ని సంహరించిన రోజు దశమి కావడంతో విజయదశమి అయింది. అదే దసరాగా మారింది.ఇదే కాకుండా వృక్షం నుంచి ఆయుధాలను తీసుకుని అర్జునుడు కౌరవ్ఞలపై విజయం సాధించడం వలన విజయదశమి అయిందని పురాణాలు చెబుతున్నాయి.అందుకే అదేరోజు జమ్మిచెట్టుకు పూజలు నిర్వహించి జమ్మి ఆకును బంగారంగా అభివర్ణిస్తూ పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు.అందరికీ విజయాన్ని తెచ్చిపెట్టే విశేషమైన పర్వదినం విజయదశమి. ఈ నవరాత్రులు ఆనందంగా జరుపుకునే పండుగ.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/