కళ్ల కింద వలయాలకు చికిత్స

Treatment of rings under the eyes

చాలా మందికి కళ్లకింద వలయాలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మేకప్‌ వేసినా కనిపిస్తూనే ఉంటాయి. ఈ సమస్య ఆలస్యంగా పడుకోవడం, కంటినిండా నిద్రలేకపోవడం, ఒత్తిడి, అలర్జీలు, కళ్లు నలిపినపుడు రావచ్చు. దాంతోపాటు సైనస్‌, ఎటోపిక్‌ డెర్మటైటీన్‌, ఎగ్జిమా, రక్తహీనతా, ఆస్తమా, డీహైడ్రేషన్‌ ఇలా చాలానే కారణాలున్నాయి.

ఈ సమస్యను తగ్గించడానికి ప్రతిరోజు ఏదో ఒక నూనెతో కళ్లచుట్టూ మర్దన చేసుకోవాలి. నిద్రపోయేముందు మాయిశ్చరైజర్‌ రాసుకుని అండర్‌ ఐ క్రీమ్‌ని పూతలా వేసుకోవాలి. అలాంటి క్రీమ్‌లను వైద్యల సలహాతో వాడుకోవచ్చు. అలానే విటమిన్‌ సి, కె, కెఫీన్‌, లికోరిన్‌ ఉన్న క్రీములు వాడాలి. సన్‌స్క్రీన్‌ తప్పనిసరిగా రాయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సమస్య అదుపులో ఉంటుంది. చికిత్సే కావాలనుకుంటే కెమికల్‌ పీల్‌ చేయించుకునే ఫలితం ఉంటుంది.

వంటింటి పదార్థాలతోను వలయాలను తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. బంగాళాదుంప గుజ్జులో చెంచా చొప్పున నిమ్మరసం, గులాబీ నీళ్లు చేర్చి కళ్లకింద పూతలా వేసుకోవాలి. కాసేపయ్యాక మర్దన చేసుకుని కడిగేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుండాలి.

గ్రీన్‌ టీ బ్యాగులను ఫ్రిజ్‌లో ఉంచి కళ్లమీద పెట్టుకోవాలి. చెంచా చొప్పున పుదీనా గుజ్జూ, నిమ్మరసం కలిపి కళ్ల అడుగున రాసుకోవాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. అలానే డార్క్‌ చాక్లెట్లూ, వాల్‌నట్స్‌, చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటి నుంచి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అంది రక్తప్రసరణ మెరుగవుతుంది.

దాంతో నల్లటి వలయాలు కూడా తగ్గుతాయి. అలాగే కంటి నిండా నిద్రపోవాలి. కంప్యూటర్‌ ముందు పనిచేస్తున్నవారు ప్రతి గంటకోసారి కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. కీరదోస, బంగాళాదుంప ముక్కలను చక్రాల్లా తరిగి కళ్ల మీద పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/