తుమ్ములుకు చికిత్స

sneezing

వరుసగా తుమ్మలుండటం తరచుగా చూసే సమస్యే. చాలా మంది దీంతో బాధపడుతుండటం చూస్తూనే ఉంటాం. దీన్ని అలర్జిక్‌ రైనైటిస్‌ అంటారు ఈ సమస్యకు ప్రధాన కారణం ఇంట్లోని దుమ్ము ధూళి మూలంగా అలర్జీ ప్రేరేపితం కావటం, గాలి కాలుష్యం, పూల నుంచి వెలువడే పుప్పొడి, పెంపుడు జంతువుల బొచ్చు, కొన్నిరకాల సౌందర్య సాధనాలు, తలకు వేసుకునే రంగులు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు, చల్లగాలి, చల్లటి నీళ్ల వంటివీ అలర్జీని ప్రేరేపించవచ్చు. ఇలా సరిపడనివేవైనా తగలటం వల్ల ముక్కులోని పొరల్లో అలర్జీ మొదలైతే హిస్టమైన్‌ అనే రసాయనం విడుదలవుతుంది.

దీంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లయి, ముక్కులోని పొరలన్నీ ఉబ్బిపోతాయి. ఫలితంగా ఆగకుండా తుమ్ములు వస్తుంటాయి. ముక్కు వెంట ధారగా నీరు కారొచ్చు. క్రమంగా ముక్కు బిగుసుకు పోవచ్చు. కాబట్టి వేటి ప్రభావంతో తుమ్ములు వస్తన్నాయో గుర్తించి.. వాటికి దూరంగా ఉండటం అన్నింటికన్నా ముఖ్యం. ఇంట్లో తివాచీలుంటే వాటిల్లో దుమ్ము చేరకుండా ఎప్పటి కప్పుడు వాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవడం.. ఇల్లును శుభ్రం చేసే టప్పుడు పుస్తకాలు సర్దేటప్పుడు ముక్కుకు రుమాలువంటివి చుట్టుకోవటం వంటి జాగ్రత్తలూ తీసుకోవాలి.

బట్టలు ఉతికినా, తలస్నానం చేసినా తుమ్ములు వస్తుంటే సబ్బుల్లోని రసాయనాల వంటివేవైనా అలర్జీని ప్రేరేపిం స్తుండే అవకాశం కూడా ఉంటుంది. స్కిన్‌ ప్రిక్‌ టెస్ట్‌, రక్తపరీక్షల ద్వారా ఇలాంటి అలర్జీ కారకాలను గుర్తించ వచ్చు. ముక్కులో వేసుకునే కార్టికోస్టిరాయిడల్‌ స్ప్రేలతో మంచి ఉపశమనం లభిస్తుంది. వీటిని రోజుకు ఒకసారి వాడుకుంటే సరిపోతుంది. అలాగే ముక్కు దూలం వంకరగా ఉందా? బుడిపెలు ఏమైనా ఉన్నాయా? అలర్జీ మూలంగా ఇతరత్రా సమస్యలేమైనా మొదలయ్యాయా? అనేదీ చూసుకోవాలి.

ముక్కు దూలం వంకరగా ఉంటే ముక్కులోపలి మార్గం సన్నబడుతుంది. దీంతో అలర్జీ మూలంగా ముక్కు పొరలు కొద్దిగా ఉబ్బినా వెంటనే రంధ్రాలు బిగిసుకుపోయి తుమ్ములు రావొచ్చు. నాసల్‌ ఎండోస్కోపీ పరీక్ష ద్వారా ఇలాంటి సమస్యలను గుర్తించవచ్చు. అలర్జీ తీవ్రమైతే, దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తుంటే సైనసైటిస్‌కూ దారి తీయవచ్చు. అప్పుడు యాంటీబయోటిక్‌ మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సమస్యను అలాగే నిర్లక్ష్యం చేస్తే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, ముక్కులో బుడిపెలు కూడా బయలుదేరవచ్చు. కాబట్టి ముక్కు, చెవి, గొంతు నిపుణులు సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/