నేటి అలంకారం (విజయవాడ కనకదుర్గ అమ్మవారు) బాలాత్రిపురసుందరి

Sri Baala tripura sundari devi

”హ్రీంకారారసన గర్భితానల శిఖాం
సౌఃక్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం
త్రినేత్రోజ్జ్వలామ్‌
వందే పుస్తక పాశమంకుశధరాం
స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం
పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌
శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపురసుందరీదేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరిదేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపో తాయి. నిత్యసంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశవిద్యకు ఈమె అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజచేసి కొత్త బట్టలు పెట్టాలి.
అలంకారం: అమ్మవారిని చాక్లెట్‌ వర్ణంతో లేదా కనకాంబరం వర్ణంతో వున్న పట్టుచీరను అలంకరిస్తారు.
మంత్రం: ”ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
నివేదన: అమ్మవారికి పాయసం నివేదన చేసి, త్రిశతీ పారాయణ చేయాలి.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/