నేటి అలంకారం (విజయవాడ కనకదుర్గ అమ్మవారు) శ్రీసరస్వతీ దేవి

Sri Saraswati devi Alamkaram

‘ఘంటాశూల హలాని శంఖమునలే చక్రం
ధనుస్సాయకం
హస్తాబ్జెర్దధతీం ఘనాంత
విలసచ్చీతాంశు తుల్య ప్రభామ్‌
గౌరీదేహ సముద్భవాం
త్రిజగతామాధారాభూతాం మహా
పూర్వ మత్ర సరస్వతీ మనుభజే
శుంభాది దైత్యార్దినీమ్‌

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో ఐదవ రోజు మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువుల తల్లి సరస్వతీ రూపంతో దుర్గాదేవి దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి వీణ, దండ, కమండలం, అక్షరమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. శ్వేత వర్ణంలో వుండే హంస ఈ తల్లికి వాహనం. ఆధ్యాత్మిక పరిభాషలో హంసను ఉచ్ఛ్వాస, నిశ్వాసలకు ప్రతీకగా పేర్కొంటారు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఈ తల్లి మన మనోవికాసం, బుద్ది, జ్ఞాన చైతన్యం కలిగించి మోక్షమార్గంలో పరమపద సోపానాన్ని కలిగిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు మొదలైన లోకోత్తర చరిత్రులకు ఈమె వాగ్వైభవాన్ని వరంగా ఇచ్చింది. శరన్నవరాత్రులంటే శరత్‌రుతువు కాలంలో వచ్చే మొదటి 9 రోజులు. అలాగే శారదా మాతను ఆరాధనకు ముఖ్యమైన రోజులు. అలాంటి శారదా మాతకు ప్రియమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీ దేవిగా మనకు దర్శనమిస్తుంది. సరస్వతీదేవిని కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుద్ధి వికాశం కలుగుతుంది. త్రిశక్తి స్వరూపాలలో సరస్వతీదేవి మూడో శక్తి స్వరూపం. సంగీత, సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల జిహ్వాగ్రంపై ఈమె నివాసం ఉంటుంది.
అలంకారం: తెలుపు లేదా క్రీమ్‌ వర్ణంతో కూడిన పట్టుచీర అంచు మాత్రం మెరూన్‌ రంగు కలిగి వుండాలి.
మంత్రం : ఓం శ్రీం హ్రీం క్లీం మహాసరస్వత్యైననమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పిల్లలకు పుస్తకాలు పంచుతూ, సరస్వతీదేవి అష్టోతరం పఠించాలి.
్దనివేదన: అమ్మవారికి దద్ద్యోదనం, పాయసం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/