డైనమిక్‌ లేడీ…

Smruti Irani
Smruti Irani

మిస్‌ ఇండియా కిరీటం మాత్రం చేజారింది. కానీ ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. రెండు లక్షల రూపాయల అప్పు తీర్చవలసి వచ్చింది. దానికోసం వివిధ ఉద్యోగాల కోసం ప్రయత్నించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఎయిర్‌ హోస్టస్‌గా ప్రయత్నించింది కానీ ఆ ఉద్యోగం రాలేదు. బ్రతుకుదెరువు కోసం బాంద్రాలోని మెక్‌డొనాల్డ్స్‌లో ఉద్యోగానికి చేరింది.

స్మృతి ఇరానీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలుకొట్టి రాహుల్‌ గాంధీపై విజయం సాధించిన బిజెపినేత, కేంద్రమంత్రి. స్మృతి అసలు పేరు స్మృతి మల్హోత్రా 1976 మార్చి 23న జన్మించింది. ఆమె తండ్రి పంజాబీ, తల్లి బెంగాలీ. ఈమె తల్లిదండ్రుల ప్రేమను వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో బయిటకు వచ్చి పెళ్లిచేసుకుని దక్షిణ ఢిల్లీ శివారులో నివాసం ఉండేవారు. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో ఒక పశువుల కొట్టాన్ని చూసుకొని దానిలో పనిచేశారు. స్మృతి అక్కడే జన్మించింది. ఆమె తర్వాత మరో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఒక పక్క చదువుకుంటూనే పేదరికం కారణంగా కొన్ని కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. పదో తరగతిలో ఉన్నప్పుడు చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండేది. పదో తరగతి, ఆపై ఇంటర్మీడియట్‌ 60శాతంపైగా మార్కులతో పాసైనా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల కళాశాలకు వెళ్లడం మానేసి దూరవిద్యలో చదవడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులిద్దరూ పనికి వెళుతుండటంతో ఇంటి పనులన్నీ స్మృతి చేసేది. 16ఏళ్ల వయసున్నప్పుడు ఢిల్లీలోని జన్‌ఫథ్‌ వీధుల్లో సౌందర్య సాధనాలను మార్కెటింగ్‌ చేసే ఉద్యోగం చేసింది. ఒక స్నేహితురాలి సలహాతో తన ఫోటోను ఎవరికి తెలియకుండా మిస్‌ ఇండియా పోటీలకు పంపింది. అది మొదటి వడపోతలో ఎంపికైంది. కానీ తర్వాత పోటీల్లో ముంబై వెళ్లాల్సి వచ్చింది. తల్లిదండ్రులను దానికి కావాల్సిన రెండు లక్షల రూపాయలను అప్పుగా తీసివ్వమని కోరి ముంబై చేరింది. స్వంతంగానే పోటీలకు తయారవ్వడం మొదలుపెట్టింది. పోటీలో అందరి అంచనాలకు తలకిందులుగా చేస్తూ చివరి ఐదు మందిలో చోటు సంపాదించింది. కానీ మిస్‌ ఇండియా కిరీటం మాత్రం చేజారింది. కానీ ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. రెండు లక్షల రూపాయల అప్పు తీర్చవలసి వచ్చింది. దానికోసం వివిధ ఉద్యోగాల కోసం ప్రయత్నించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఎయిర్‌ హోస్టస్‌గా ప్రయత్నించింది కానీ ఆ ఉద్యోగం రాలేదు. బ్రతుకుదెరువు కోసం బాంద్రాలోని మెక్‌డొనాల్డ్స్‌లో ఉద్యోగానికి చేరింది. అక్కడ టేబుళ్లు, ఫ్లోర్లు శుభ్రం చేయడం నుంచి ఆర్డర్లపై సప్లై చేయడం వరకు అన్ని పనుల చేసింది. ఇది చేస్తూనే మోడలింగ్‌ అవకాశాల కోసం స్టూడియోల కోసం తిరుగుతూనే ఉంది. కొద్దిరోజుల తర్వాత ఓ శానిటరీ నాప్‌కిన్‌ ప్రకటనలో కనిపించే అవకాశం వచ్చింది. తర్వాత టివిలో రెండు సినిమా కార్యక్రమాలకు యాంక రింగ్‌ చేసే అవకాశం లభించింది. ఈకార్యక్రమాలను చూసిన శోభా కపూర్‌ స్మృతిని.. కూతురు ఏక్తాకపూర్‌కు పరిచయం చేసింది. దాంతో ఆమెకు ‘క్యోకీ సాస్‌ బీ కబీ బహూ థీ అనే సీరియల్‌లో తులసి అనేపాత్రకి ఎంపికైంది. అదే ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. ఎనిమిదేళ్లపాటు ఆ సీరియల్‌లో కనిపించింది. టివి నటులకు అత్యుత్తమ అవార్డుగా భావించే ఇండియన్‌ టెలివిజన్‌ అకాడమీ అవార్డును వరుసగా ఐదుసార్లు అందుకుని చరిత్ర సృష్టించింది. తర్వాత సొంతంగా ఉగ్రాన్య ప్రొడక్షన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థ నెలకొల్పి టివి సీరియల్స్‌ నిర్మించింది. తెలంగాణ ఉద్యమ సమయం లో శంకర్‌ తీసిన జైబోలో తెలంగాణలో కూడా ఆమె ఒక ముఖ్యపాత్రలో నటించింది. స్మృతి ఇరానీ తనకంటే వయసులో చాలా పెద్దవాడైన చిన్ననాటి స్నేహితుడు జుబిన్‌ ఇరానీని వివాహమాడింది. వారికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి పేరు జోహ్ర్‌, అమ్మాయి పేరు జోయిష్‌.
స్మృతి ఇరానీ రాజకీయ ప్రస్థానం…
స్మృతి తాతయ్య ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసేవాడు. తల్లి జన్‌సంఘ్‌లో కార్యకర్తగా ఉండేది. స్మృతి కూడా చిన్నప్పటి నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యురాలు. నిర్మాతగా ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడే రాజకీయరంగంలోకి అడుగుపెట్టింది. 2003లో బిజెపిలో చేరింది. 2004 ఎన్నికల్లో ఢిల్లీ చాందినీ చౌక్‌ నుంచి కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌పై పోటీ చేసింది. కానీ నెగ్గలేదు. ఆమె బిజెపికి ఓటు బ్యాంకు సంపాదించిపెట్టింది. తర్వాత ఆమెను మహారాష్ట్ర యువత విభాగానికి అధ్యక్షురాలిగా నియమించింది. కొన్నాళ్లకు బిజెపి జాతీయ కార్యదర్శిగా, బిజెపి మహిళా కార్యదర్శిగా, బిజెపి మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఎదిగింది. 2014లో అమెథీ నుంచి పోటీచేసి రాహుల్‌ గాంధీపై ఓడిపోయినప్పటికీ ఆమెకు మోడీ ప్రభుత్వం రాజ్యసభ సీటిచ్చి మానవ వనరుల మంత్రిని చేసింది. 2004 ఎన్నికల సమయంలో, 2014 ఎన్నికల సమయంలో ఆమె విద్యార్హతపై చెలరేగిన వివాదాన్ని ఆమె దీటుగా ఎదుర్కొన్నారు. ఈమె మానవ వనరుల మంత్రిగా ఉన్న సమయంలో సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు పార్లమెంటులో ఆమె చేసిన ప్రసంగం అప్పట్లో ఓ రికార్డును సృష్టించింది. ఆతర్వాత ఈమెకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖను అప్పగించారు. తాజాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో గాంధీ కుటుంబం కంచుకోట అమేథీలో రాహుల్‌ ఓడించి పాగా వేసింది. ఎన్నికల సందర్భంగా ఆమె నియోజక వర్గంలోనే ఆమె మకాం వేసింది. రాహుల్‌ గాంధీ అమేథీని పట్టించుకోక పోవడంపై ఆమె పలు విమర్శలను సందించింది. ఇక్కడ నుంచి ఎంపిగా ఉన్న రాహుల్‌ గాంధీ 15 ఏళ్లుగా కనిపించలేదని, అందుకే తను ఎన్నిసార్లు నియోజకవర్గానికి పర్యటకు వచ్చిందనేదానిపై ప్రియాంక లెక్కలేసుకుంటున్నారని, ఇప్పటివరకు అమేథీ ప్రజల కష్టాల గురించి, అమేథీ అభివృద్ధి గురించి రాహుల్‌ పార్లమెంట్‌లో ఒక్కసారి కూడా నోరు మెదకపోవడం దారుణమని విమర్శలను ఎక్కుపెట్టింది. గెలిచినా, ఓడినా నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిస్తానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చింది.
లోక్‌సభ ఎన్నికల్లో 55వేల పైగా ఓట్ల మెజారిటీతో రాహుల్‌ గాంధీని ఓడించింది. గెలుపు సందర్భంగా ఫేమస్‌ ఘజల్‌ దుశ్యాంత్‌ కుమార్‌ రాసిన పదాలను ప్రస్తావించారు. ‘నాథింగ్‌ ఈజ్‌ ఇంపాజిబుల్‌ మీకు ఎవరు చెప్పారు ఆకాశానికి పంక్చర్‌ అయి రంద్రం పడుతుంది. అని తనదైన శైలిలో కామెంట్లు చేశారు. రాహుల్‌పై గెలవడంతో ముంబయిలోని సిద్ధివినాయ ఆలయానికి 14కిలోమీటర్లు తన స్నేహితురాలు ఏక్తాకపూర్‌తో కలిసి వెళ్లి మొక్కులు తీర్చుకుంది. ఈసారి మోడీ మంత్రివర్గంలో మరోమారు ఆమెకు మోడీ కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టారు.ఈమె ఈపర్యాయం మోడీ మంత్రివర్గంలో అత్యంత పిన్నవయస్కురాలవడం విశేషం. మోడీ ఆమెకు ఈసారి మంత్రివర్గంలో స్త్రీశిశుసంక్షేమ, జౌళిశాఖ మంత్రిపదవిని కేటాయించారు. అయితే ఇటీవల ఎన్నికల ప్రచార సమయంలో ఒక గ్రామంలో అగ్నిప్రమాదం సంఘటనను గమనించి కాన్వా§్‌ుని అపి ఆప్రాంతానికి పరుగులు తీసి మంటలు ఆర్పడంలో సహాయం చేశారు. ఇటీవల కాల్పుల్లో చనిపోయిన ఆమె అనుచరుడు బిజెపి కార్యకర్థ సురేంద్ర సింగ్‌ అంతిమ యాత్రలో పాల్గొని తన భుజాలపై అతని పాడె మోసి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. మొన్న మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత ట్రాపిక్‌లో ఇంటికి వెళ్లడానికి ఇబ్బందిపడ్డ సింగర్‌ ఆశాబోస్లేకు స్మృతి దగ్గరుంచి సహాయం చేశారు. ఆమె ఇంటికి వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి చూశారు. దీనిపై స్పందించిన ఆశాబోస్లే ఇతరులకు సహాయం చేసే గుణం స్మృతికి ఉండటంతోనే ఆమె గెలుపు సాధ్యమయిందని కొనియాడారు. ఆమె నటిగా, రాజకీయ నాయకురాలిగా ప్రజాభిమానాన్ని చూరగొని ఓ డైనమిక్‌ లేడీగా గుర్తింపు పొందారు.

  • పోతుగంటి వెంకటరమణ