నిద్రలేమికి మానసిక కారణాలు

ఒక జబ్బు కాస్త తగ్గుముఖం పడుతోందో లేదో మరో జబ్బు మొదలవ్ఞతుంది. ఏదో ‘క్యూ కట్టినట్లు ఒకదాని తరువాత ఒకటి రకరకాల జబ్బులు శరీరాన్ని కబలించి వేస్తుంటాయి. మందులు వేసుకోగానే ఏదో తగ్గినట్లే అనిపిస్తుంది కానీ, పూర్తిగా ఏదీ పోదు. విసుగొచ్చి మందులు మానేస్తే పరిస్థితి మరింత విషమిస్తుంది. ఇన్నిన్ని జబ్బులకు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడమే కారణమని చాలాకాలం దాక బోధపడదు. ఇంకాస్త లోతుకు వెళితే వ్యాధినిరోధకశక్తి తగ్గడానికి అసలు కారణం నిద్రలేమి అన్న నిజం బయటపడుతుంది. అందుకే హాయిగా నిద్రించలేకపోతే అన్నీ కష్టాలే అంటున్నారు నిపుణులు…

Sleep Disorders
Sleep Disorders

ఖరీదైన మంచాలూ, పరుపులూ కొనుక్కోవచ్చు. నిశ్శబ్దం, చల్లగాలి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇతరత్రా మరెన్నో సౌకర్యాలు సమకూర్చు కోవచ్చు. అయినా శారీరకంగానో మానసికంగానో సమస్యలు వేధి స్తున్నప్పుడు కంటిమీద కునుకే రాదు. నిజానికి 90శాతం నిద్రలేమి బాధలకు మానసిక సమస్యలే కారణం. మిగతా ఆ 10శాతం సమస్యలకే శారీరక కారణాలు ఉంటాయి. అయితే నిద్రలేమి ఏ కారణంగా వచ్చినా సమస్య తీవ్రంగానే వేధిస్తుంది.
ఇన్‌సామ్నియా
నిద్రలేమి సమస్యను ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు. మానసిక కారణాలతో వచ్చే నిద్రలేమిని మొదటి రకం ఇన్‌సామ్నియాగా, శారీరక కారణాలతో వచ్చే నిద్రలేమిని రెండో రకం ఇన్‌సామ్నియాగా గుర్తిస్తారు. దిగులు ఆందోళన వంటి మానసిక సమస్యలు నిద్రలేమికి ప్రధాన కారణంగా ఉంటాయి. చాలా అరుదుగా కొద్దిమందికి మానసిక రుగ్మతల (సైకోసిస్‌) కారణంగా కూడా నిద్ర పట్టకపోవచ్చు. ఇక శారీరక సమస్యల్లోకి వెళితే నరాల ఒత్తిళ్లు, తిమ్మిర్లు, నొప్పి, దురద, స్లీప్‌ అప్నియా వంటివి నిద్రలేమికి కారణమవ్ఞతూ ఉంటాయి. కొన్ని సమస్యలు నిద్రకు సంబంధించిన ప్రత్యేక పరీక్షాశాలల్లో తప్ప తేలవ్ఞ. వరుసగా రెండు రోజుల పాటు నిద్ర పట్టనంత మాత్రాన డాక్టర్‌ వద్దకు పరుగెత్తవలసిన అవసరం లేదు.

తన లోపాన్ని తనకు తానే సరిదిద్దుకునే శక్తి సహజంగానే శరీరానికి ఉంటుంది. ఒకవేళ ఆ సమస్య చాలా రోజుల పాటు కొనసాగితే మాత్రం న్యూరాలజిస్టును సంప్రదించాలి. నిద్రలేమి సమస్య దీర్ఘకాలికంగా కొనసాగితే వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతుంది. శరీరంలోని గ్లూకోజ్‌ను క్రమబద్ధం చేసే యంత్రాంగం దెబ్బతిని మధుమేహం మొదలవుతుంది. జీవక్రియలో వచ్చే తేడాల వల్ల అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. మెదడు సామర్థ్యం తగ్గిపోయి, ఏకాగ్రత లోపించడంతో పాటు జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ప్రతి చిన్న విషయానికీ కంగారు పడిపోవడంతో పాటు అసహనం పెరిగిపోతుంది. కొందరిలో ఇది మతిభ్రమణానికి కూడా దారితీయ వచ్చు.

వీటికి తోడు శరీరం బరువ్ఞ పెరిగిపోవడం, కండరాల నొప్పి, శరీరం వణకడం, మాట తడబడటం వంటి సమస్యలు కూడా మొదలవ్ఞతాయి. ఈ స్థితిలో నిర్లక్ష్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి ఒకవేళ డాక్టర్‌ సూచనలన్నీ పాటిస్తూ రాసిన మందులు వాడిన తరువాత కూడా ఏ ప్రభావమూ కనిపించకపోతే మానసిక నిపుణులను కలవడం అవసరం.