టేబుల్‌ టెన్నిస్‌లో రాణిస్తున్న శ్రావణి

Shravani
Shravani

క్రీడల్లోకాని, కళల్లో కాని రాణించాలంటే కష్టపడాలి. తిండి, నిద్రను త్యాగం చేయాలి. క్రమశిక్షణతో కూడిన సాధన ఎంతో అవసరం. అంతేకాదు మితాహారంతో సరిపెట్టుకోవాలి. విజయం సాధించేంతవరకు విశ్రాంతిని మర్చిపోవాలి. అప్పుడే అనుకున్న గమ్యం, లక్ష్యాన్ని చేరుకోగలరు. చిన్నవయసు నుంచే ఇలాంటి సాధనతో టెన్నిస్‌లో రాణిస్తున్న యువతి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఆమె పేరు నాగశ్రావణి. గ్రామీణ స్థాయి నుంచి జిల్లాస్థాయి, జాతీయస్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు పొందిన ఆమె నేటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. నాగశ్రావణి జాతీయస్థాయిలో టెబుల్‌ టెన్సిస్‌ పోటీలకు ఇప్పటివరకు ఏకంగా 15సార్లు ఎంపికై తన సత్తాను చాటుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులో క్రీడల్లో పాల్గొన్నారు. ఆట ఏదైనా క్రమపద్ధతి ద్వారా దూసుకుపోవాలనుకుంది. ప్రస్తుతం బుక్కరాయసముద్రంలోని రోటరీపురంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటిలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం ఈఈఈ విభాగంలో చదువుతున్నారు. క్యాడెట్‌ విభాగం నుంచి ప్రారంభమై ప్రస్తుతం సీనియర్‌ మహిళా విభాగంలో జాతీయస్థాయికి ఎంపికైంది. తన 11 ఏళ్ల క్రీడాచరిత్రలో ఎందరో క్రీడాకారులకు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యేలా చేసారు. సాధారణంగా క్రీడల్లో తనకంటే పెద్దవారు తన క్రీడకు స్ఫూర్తిగా ఉంటారు. కానీ నాగశ్రావణమాత్రం తన అక్క ఉమాదేవికి తానే ఆదర్శగా నిలిచారు. టేబుల్‌ టెన్నిస్‌లో రాణిస్తున్న చెల్లిని చూసి, తాను కూడా ఆట నేర్చుకున్నారు ఉమాదేవి. అంతేకాదు, యూనివర్శిటీ పరిధిలో జాతీయస్థాయిలో స్వర్ణపతకాన్ని పోటీలకు ఎంపికైంది. దీంతోపాటుగా తన చుట్టుపక్కల ఉన్న చిన్నారులకు తనే ఆదర్శంగా నిలుస్తుంది. తన ఆటను చూసి ఎంరో చిన్నారులు టేబుల్‌ టెన్నిస్‌ను నేర్చుకుంటున్నారు.
కుటుంబ నేపధ్యం..
నాగశ్రావణి తండ్రి శ్రీనివాసులు ఓ హోటల్‌ యాజమాని. తల్లి సావిత్రి సాధారణ గృహిణి. అక్క ఉమాదేవి. యూనివర్శిటీ స్థాయిలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. పెద్దనాన్న వారితో కలిసి నగరంలోని పాతూరులో ఉన్న బోయవీధిలో నివసిస్తున్నారు. పెద్దనాన్న కుమారుడి పోత్సాహంతో టేబుల్‌టెన్నిస్‌లో తన కెరీర్‌ను ఆరంభించారు. రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు 50 టైటిల్స్‌ సాధించి రాష్ట్రస్థాయి జూనియర్‌, యూత్‌ విభాగంలో రాష్ట్రఛాంపియన్‌గా కొనసాగుతోంది. రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పాయింట్ల పట్టికలోను జూనియర్‌ విభాగంలో 405, యూత్‌లో 420, సీనియర్‌ మహిళా విభాగంలో 315 పాయింట్లతో ముందుంది. తన ఆటతీరును చూస్తే ప్రత్యర్థికి చెమటలు పట్టిస్తుంది. ప్రధానంగా ర్యాలీస్‌, కౌంటర్స్‌, సర్వీస్‌ చేయడంలో దిట్ట. ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తుంది. టీమ్‌ ఈవెంట్‌లోను రెండు కాంస్య పతకాలు సాధించారు
జాతీయస్థాయిలో ప్రతిభ
రెండవ తరగతిలో టేబుల్‌టెన్నిస్‌ క్రీడలో ప్రవేశించి 6వ తరగతిలో కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కాంస్యపతకం సాధించింది శ్రావణి. దీంతోపాటు రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లోను కాంస్యపతకం సాధించింది.
రాష్ట్రస్థాయిలో టేబుల్‌టెన్నిస్‌ క్రీడా పోటీల్లో సాధించిన ఘనతతో తను 10వ తరగతి వరకు మొదటి మూడుర్యాంకులలో కొనసాగింది.
అంతర్జాతీయ స్థాయిలో..
ఆంధ్ర నుంచి అంతర్జాతీయస్థాయి క్రీడాకారిణిగా ఎదగాలనేదే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతోంది నాగశ్రావణి.
పాఠశాల స్థాయిలో ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యత అందించేది. ప్రస్తుతం దీనికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఆర్థికంగా ఆదుకునేవారే లేరు.
అయినా, కోచ్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ స్థాయి క్రీడలో రాణించగలుగుతున్నానీ, క్రీడల్లో రాణించాలంటే ఆర్థిక తోడ్పాటు కూడా ఉండాలనీ, కానీ తనకు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది నాగశ్రావణి.
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా..
నాకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు సాధించిపెట్టిన క్రీడ ద్వారానే ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యంతో కష్టపడుతున్నాను.
ఇంజినీరింగ్‌ను పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాను.
ఆంధ్ర నుంచి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు సాధించాలి అంటున్న నాగశ్రావణి ఆకాంక్ష తీరాలని మనం కోరుకుందాం.