ప్రతినిధులు

Shirdi Sai
Shirdi Sai

సాయిసచ్చరిత శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతమనే అలలు లేస్తాయి. వానిలో మరలమరల మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి. జ్ఞానరత్నాల కోసం మరల మరల మునకలు వేయవలసినదే. సచ్చరితలోని ఏ గాధలో ఏ రత్నమున్నదో తెలియటం కష్టమే.

సప్తశృంగిని వాసిని తన పూజారిని సాయిబాబా వద్దకు పంపుతుంది. ఆమె పరాశక్తి రూపమేగాని వేరుకాదు. అమ్మను ఓంశాంతి మత్యైనం: అని కీర్తిస్తారు. అంటే శాంతగుణముగల మనసు అమ్మకు గలదని అర్ధమవ్ఞతుంది. శాంతగుణముగల అమ్మ భక్తులను కూడా శాంతిమతిత్వమును ఇచ్చి, బ్రహ్మానందానుపాత్రులను చేయుచున్నది. తన పూజారి కోరినది శాంతిని. ఆమె చీటికలో ప్రసాదింపగలదు. ఆ తల్లి అలా చేయకుండా సాయిబాబాను ఆశ్రయించమంటుంది.
అందులోని విజ్ఞత వెంటనే అర్ధం కాదు.
సాయిబాబా ఒకసారి మాట్లాడుతూ ‘భగవంతుడు చాలాగొప్పవాడు. వారి ప్రతినిధులు సర్వత్రా వ్ఞంటారు. వారు ఎంతో శక్తిసంపన్నులు అంటారు. భగవంతునికి అనేక పేర్లున్నాయి. మహావిష్ణువ్ఞ, సదాశివ్ఞడు, పరాశక్తి, మొదలైనవి. ఆదిపరాశక్తి అయిన సప్త శృంగి నివాసిని హరిబ్రహ్మేంద్ర సేవిత. అట్టి సప్తశృంగి షిరిడీలో నివసించు సాయివద్దకు తన పూజారి అయిన కాకాజీ వైద్యాన్ని పంపుట సబబు అనిపించును. ఎందుకంటే సాయిబాబా కూడా ‘నేను దైవమును కాను. పరమాత్ముడనుకాను. నేను వారి నమ్మకమైన బంటును అనేవారు. సాయిబాబా వంటి నమ్మకమైన బంటువద్దకు సప్తశృంగి తన పూజారిని పంపగా సాయి మారుమాట్లాడకుండా శాంతిని ప్రసాదించాడు. ఒకసారి పాండురంగడు తన భక్తుడైన నామదేవ్ఞని విశోబా వద్దకు పంపుతాడు. విశోబా నామదేవ్ఞనకు తత్వోపదేశం చేస్తాడు. నామదేవ్ఞడు సంపూర్ణుడవ్ఞతాడు. అంటే నామదేవ్ఞడు గతంలో సగం కాలిన కుండ. విశోబా వద్దకు రాగానే, నామదేవ్ఞనకు తత్వం తెలిసి పూర్తిగా కాలినకుండ అయ్యాడు. ఇక జ్ఞానదేవ్ఞడు మొదలైనవారి వరుసలో చేరాడు. ఈతత్వ బోధనను పాండురంగడు చేయలేకపోయాడా? అలాగే సప్తశృంగి కూడా పూజారికి శాంతిని ప్రసాదింపలేకపోయింది. సాయి, విశోబాశేచరు వంటి వారు సత్పురుషులు, జ్ఞానమునకు నిలయాలు, భగవంతుని ప్రతినిధులు ఆసత్పురుషులు తమ వద్దకు చేరినవారికి భక్తి, జ్ఞాన, శాంతాదులు ప్రసాదిస్తారు. సత్పురుషులు, యోగులు భగవంతుని సృష్టిలో, భగవంతుని లీలావిలాసంలో పాలుపంచుకుంటారు. భగవంతుని సృష్టిలో ఓ వ్యవస్థలో జరుగవలసినది ఆ వ్యవస్థలోనే జరుగుతుంది. ఆ సత్పురుషులు, యోగులు మాత్రమే నిర్వర్తించాలి. అంతేకాని స్వయంగా భగవానుడు నిర్వర్తించడు. ఈ విషయాన్ని కాకాజీ, నామదేవ్ఞ గాధలు తెలుపుతాయి. జ్ఞానరత్నాలు సాయిసచ్చరిత, గురుచరిత్ర మొదలైన వాటిలో ఉంటాయి. కానీ, శ్రమపడందే ఫలితము దక్కదు.

  • యం.పి.సాయినాధ్‌