మరో రకం శారీపెట్టీకోట్‌

Petty coat Saree
Petty coat Saree

మరో రకం శారీ పెట్టీకోట్‌

నడుము : ముందుగా టేపుతో కొలుచుకోవాలి. అలా కొలుచుకున్న నడుము ఉదాహరణకి 30అంగుళాలు ఉందనుకోండి. 30ని 2తో భాగించగా వచ్చిన ఆన్సర్‌ని జిట్టాసైడుకి వచ్చేలాగా బట్టను రెండు మడతలు వేసి నడుము లూజు పెట్టాలి. తరువాత మనకు కావలసిన పొడవు పెట్టుకొని బట్టను నాలుగు మడతలు వేసి కత్తిరించాలి. ఆ తరువాత 30ని 6తో భాగించగా వచ్చిన కొలతను మడతలవైపు గుర్తుపెట్టి అదే కొలత కింద ఓపెన్‌వైపు కూడా గుర్తుపెట్టి పై గుర్తు నుండి కింది గుర్తు వరకూ క్రాస్‌గా గీయాలి.

మనం గీసిన క్రాస్‌ నాలుగు పొరలు కత్తిరించాలి. తరువాత పైన మడతలు కూడా ఓపెన్‌ చేయాలి. ఇప్పుడు మనకు రెండు పెద్ద ముక్కలు, నాలుగు చిన్న ముక్కలు మొత్తం ఆరు ముక్కలు వస్తాయి. తరువాత నడుముకు బెల్టు కత్తిరించాలి. బెల్టు కొలత మన నడుము ఎంత ఉందో అంత లూజు,నాలుగున్నర లేదా ఐదు అంగుళాలు కాని పొడవు కత్తిరించాలి. ఇప్పుడు కుట్టడం ఎలాగో నేర్చుకుందాం. ముందుగా ఒక పెద్ద ముక్కను తీసుకొని దానికి రెండు పక్కల చిన్న ముక్కలను తీసుకొని పై నుండి కింది వరకు క్రాస్‌గా అతకాలి.

తరువాత ముందు ఓపెన్‌లకి రెండు వైపులా నాలుగు అంగుళాల పొడవున సన్నగా రెండు మడతలు వేసి కుట్టాలి. తరువాత నడుముకు బెల్టువేసినప్పుడు దాన్ని కూడా రెండు వైపులా సన్నగా రెండు మడతలు వేసి కుట్టాలి. తరువాత బెల్టు వేస్తూ మధ్య మధ్య అతికిన ముక్కలకి కుచ్చు పెడుతూ బెల్టుకి సరిపడేలా కుట్టి, వెనుకకు తిప్పి సన్నగా మడుస్తూ బెల్టు వేయాలి. తరువాత ముందువైపు ఓపెన్‌ పెట్టాం కదా! అక్కడి నుంచి కింది వరకూ ముందు కూడా అతకాలి. దీనికి సింపుల్‌ కుచ్చు, తోపుడు కుచ్చు, విసనకర్ర కుచ్చు మనకు కావలసినట్టు పెట్టుకోవచ్చు. కుచ్చు వద్దనుకుంటే కింద రౌండుగా ఒకటిన్నర అంగుళం మడత పెట్టి కుట్టాలి.