ముండకోపనిషత్తు

Swamy vivekananda

‘అన్ని దానముల్లోకి జ్ఞానదానము మిన్న అంటాడు వివేకానందుడు. అత్యుత్తమ జ్ఞానము ఉపనిషత్తుల్లో ఉంది. అట్టి ఉపనిషత్తుల్లో ముండకోపనిషత్తు ముఖ్యమైనది. ముండకమంటే మంగలి కత్తి అని అర్ధం. తలపై నున్న వెంట్రుకలనన్నిటినీ మంగలి కత్తి ఎలా పూర్తిగా తొలగించగలదో తలలోనున్న అజ్ఞానాన్ని పూర్తిగా నిర్మూలించ గల శక్తి ఈ ఉపనిషత్తుకు ఉండుట వల్ల ఆ పేరు దీనికి వచ్చింది. ఈ ఉపనిషత్తును అంగిరస మహర్షి శౌనకునికి బోధించాడు. అందులోని ఒక శ్లోకాన్ని పరిశీలిద్దాం
నాయమాత్మా ప్రవచనేన లభ్యో
న మేధయా న బహునా శ్రుతేన
యమే వైష వృణుతే తన లభ్య
స్తస్యైష ఆత్మా వివృణుతే తనుం స్వామ్‌
ఇది తృతీయ ముండకం ద్వితీయ ఖండంలోని 3 వ శ్లోకం. ఈ శ్లోకం యొక్క భావం గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడం చేతగాని., చాలా శాస్త్రాల అధ్యయనం చేయడం వలనగాని, ఎన్నో గూడార్ధలు మహాత్ముల వద్ద వినడం వలన గాని ఆత్మప్రాప్తి జరుగదు. ఆ ఆత్మకోసం హృదయ పూర్వకంగా ఆరాటపడిన వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తున్నది. సనాతన ధర్మానికి, ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేసిన మన పవిత్ర భారతదేశంలో ఈనాడు ఎక్కువ మంది పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు – ధర్మాలు చేసి ఇహలోకంలోను, పరలోకంలోను భోగాలను అనుభవించాలని ఆశిస్తుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనవుతుంటారు. జనన – మరణ చక్రంలో పడి గిరగిర తిరుగుతుంటారు. ఏ కొద్ది మందో అసలైన ఆధ్యాత్మికత వైపు పయనిస్తుంటారు. వారిలో కూడా కొందరు రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలను చదివి, ప్రవచనాలను టివి ఛానళ్ల ద్వారా విని, సేవా కార్యక్రమాల్లో పాల్గొని సత్కర్మలు చేసినామని, సత్‌ సంగం చేసినామని తృప్తిపడుతారు. మరి కొందరేమో సంస్కృతం నేర్చి, ఉద్గ్రంథాలను పఠించి, శ్లోకాలను కంఠస్థం చేసి, బహిరంగ సభల్లో ధారాళంగా ప్రసంగించి, శ్లోకాలను మృదుమధురంగా వల్లించి, అర్ధతాత్పర్యాలను వివరించి శ్రోతల కరతాళ ధ్వనులను వీనుల విందుగా గ్రహించి, సన్మానాలను, బిరుదులను, పొంది, కొంత మందిని శిష్యులుగా చేసికొని వారి నుంచి శుశ్రూషలను, విరాళాలను గ్రహించి, వారికి పాద పూజలు చేసికొనే సదవకాశాన్ని అనుగ్రహించి సంతృప్తి చెందుతుంటారు. అంటే దాదాపు అందరూ లక్ష్యాన్ని మరచి, మాయలో పడి, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆపి అక్కడే నిలబడి పోయారన్న మాట. ఆత్మసాక్షాత్కారానికి ఇవేవీ ఉపయోగపడవని ఘంటాపథంగా చెబుతుంది. ముండకోపనిషత్తు.
ఆత్మసాక్షాత్కారాన్ని పొందటానికి ఎవరికైనా కావలసింది, ఉండవలసింది హృదయపూర్వకమైన ఆరాటం. పై శ్లోకం నిజంగా సత్యాన్నే ప్రకటిస్తున్నాదా అని మనం ఏ మాత్రం సందేహించవలసిన పనిలేదు. ఎందుకంటే నిన్న మొన్నటి రమణమహర్షి, రామకృష్ణ పరమహంసలు మనకు బాగా తెలిసిన మహనీయులు. వారు వేద, వేదాంగాలను, పురాణేతి హాసాలను చదవలేదు. గంభీర ఉపన్యాసాలను చేయలేదు. కానీ వారికి ఆత్మసాక్షాత్కారమైంది. సత్యదర్శనమైంది. కారణం వారి కుండిన జిజ్ఞాస, సత్యదర్శనం కోసం ఆరాటం, తపన.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/