ప్రేమ సరే.. పాప సంగతి ఏంటి?

మనస్విని (ప్రతి శనివారం)

నమస్కారం మేడమ్‌ నా పేరు సరిత. నాకు 52 సంవత్సరాలు నాకు ఒకే ఒక కుమారుడు. అతని చిన్నతనంలోనే వాళ్ల నాన్న చనిపోయారు. ఎంతో కష్టపడి పెంచి పెళ్లి చేసాను. పెళ్లయి రెండు సంవత్సరాలు అయింది. ఒక పాప పుట్టింది. మా కోడలు మాత్రం కొంచెం తెలివి తక్కువ. ఈ విషయం పెళ్లి తరువాత తెలిసింది. నా ఆస్తి మొత్తం నా కొడుకుకు రాసి ఇచ్చాను. కానీ నా కొడుకు, నా కోడలు ఇద్దరు ఆస్తి కాగితాలపై సంతకాలు పెట్టించి నాకు తెలియకుండా భూమి అమ్ముకున్నారు. ఇది తెలిసి మానసికంగా చాలా కుంగిపోయాను. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియడంలేదు. ఈ సమస్యతో చాలా బాధగా ఉంది. మా కొడుకుని తిట్టాలో లేక మా కోడలిని తిట్టాలో సతమతమైపోతున్నా. ఇందుకు గల పరిష్కారం తెలియజేయండి మేడమ్‌. __మీ సరిత, మల్థకల్‌

Mother with child

మీరు తప్పక ఈ సమస్యల నుండి బయట పడగలరు. మీరు ధైర్యంగా, తెలివిగా ఉండండి. అయిపోయిందేదో అయిపోయింది. దాని గురించి చింతించవద్దు. ఆస్తులు శాశ్వతం కాదు. మీకు ఆనందంగా జీవించటానికి గల వనరులు మీ దగ్గర ఉన్నాయి. అవిచాలు ఆనందంగా బ్రతకటానికి. ఆత్మ విశ్వాసమే పెద్ద ఆస్తి. అవగాహనే పెద్ద ఐశ్వర్యం. సంతృప్తి మాత్రమే పెద్ద గెలుపు. అందువల్ల మీరు స్పష్టతతో, సానుకూల దృక్పథంతో జీవించాలి. వ్యతిరేక ఆలోచనలు దరి చేరనీయవద్దు. జీవితం అపురూపమైన వరం. దానిని ఆనందంగా స్వీకరించాలి. సమస్యలు పది అయితే, ఆనందాలు లక్షల్లో ఉంటాయి. అందువల్ల అన్ని పరిస్థితుల్లోనూ ఆనం దంగా ఉండాఇ. ఎంతో చక్కని జీవితాన్ని మీరు సొంతం చేసుకోండి. మీలో చాలా ప్రతిభ ఉంది. దానిని వినియోగించుకుని జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకోండి. ఆస్తిపోతే మరల సంపాదించుకోవచ్చు కానీ జీవితంలో గడిచిన ఒక్క రోజు కూడా తిరిగి రాదు. అందువల్ల వర్తమానంలో ఆనందంగా జీవించాలి. గతాన్నుండి మంచి పాఠాలు నేర్కుఓవాలి. భవిష్యత్‌ని మార్చిదిద్దుకోవాలి. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలి. సమాజానికి మనకి తోచినంత సహాయం చేయాలి.

బలహీనులకు ఆసరా అందించాలి.

నమస్కారం మేడమ్‌ నా పేరు నిహారిక. నాకు 27 సంవత్సరాలు. నాకు పెళ్లి అయి రెండు సంవత్సరాలయింది. పెళ్లికాకముందు నాకు ఒకరు ప్రపోజ్‌ చేశారు. ఇద్దరం ప్రేమించుకున్నాము. కానీ మా తల్లిదండ్రులు చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నాకు ఇప్పుడు ఒక పాప పుట్టింది. నాకు ఈ మధ్యలో పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తి గుర్తుకువస్తున్నాడు. ఇప్పుడు మా ఆయనతో నాకు ఉండడం ఇష్టం లేదు. నా మనసు అంగీకరించడం లేదు. నాకు నేను ఎన్నో విధాలుగా సర్దిచెప్పు కున్నాను. ఎంతగానో ఆలోచించాను. మా ఆయనతో ఉండటం ఏ మాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు నేను పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తిని మళ్లీ పెళ్లి చేసుకుందాము అని ఉంది. కానీ నా పాపను వదిలిపెట్టి వెళ్లాలని లేదు. అలా అని మా ఆయనతో ఉండాలని లేదు. ఎలా అయినా తిరిగి పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందామని ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూడండి మేడమ్‌. _ మీ నిహారిక, వరంగల్‌.

మీరు తప్పక ఈ సమస్యలో స్పష్టత తెచ్చుకోగలరు. పరిష్కారం చేసుకోగలరు. మీరు తొందరపడవద్దు. క్షుణ్ణంగా ఆలోచించండి. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. మీరు విడిపోవాంటే చట్టపరంగా కారణాలు చెప్పాలి. అయినా మీకు పాప కూడా ఉంది. అందువల్ల మీరు తప్పక కౌన్సిలింగ్‌ తీసుకోండి. వృత్తి నిపుణుల సలహాతో ఎంతో మార్గదర్శకంగా ఉంటాయి. అప్పుడు సరియైన నిర్ణయం తీసుకోగలరు. ప్రేమకి, అయిష్టతకి గల కారణాలు విశ్లేషించండి. అప్పుడు మీకే అర్ధం అవ్ఞతుంది. ఎట్టి పరిస్థితిలోనూ సమస్యను జటిలం చేసే నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ విషయమైనా కుటుంబ సభ్యుల, మిత్రుల, శ్రేయోభిలాషులను సంప్రదించి, సరియైన నిర్ణయాలు తీసుకోండి. మోహానికి, ప్రేమకు గల తేడాని గ్రహించండి. కుటుంబపరంగా, సామాజిక పరంగా వివాహం అయ్యాక, పాత ప్రియుడితో సంబంధాలు హర్షించే విషయాలు కావ్ఞ. అలాంటి చట్టవిరుద్ధ సంబంధాలు ఇంకా సమస్యలు కొని తెచ్చి పెడతాయి. వివాహం అనేది ఎంతో మందికి సంబంధించిన విషయం. అందువల్ల సరైన సమయంలో, చక్కని నిర్ణయాలు తీసుకోవాలి. మీ నిర్ణయం అందరికీ ఆమోద యోగ్యంగా ఉండాలి. అంతేకానీ ఇతరులకు హాని చేసేదిగా ఉండకూడదు. ఏది ఏమైనా జీవితాన్ని చక్కగా నడిపించుకోవాలి.

– డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/devotional/