జుట్టు ప్రాధాన్యత ..ఆశ్చర్యపోవాల్సిందే!

Beautiful Long Hair
Beautiful Long Hair

ఈ జుత్తు అనేదాని గురించి ఎన్నో కథలున్నాయి. మహాభారతంలో దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టుపట్టి నిండుసభకి ఈడ్చుకురావడం, ఆ తర్వాత భీముడు దుర్యోధుని చంపి అతడి రక్తాన్ని ద్రౌపది జుత్తుకు పూస్తాననటం, అప్పుడే తన జుట్టును సంస్కరిస్తానని ద్రౌపది ప్రతిజ్ఞచేయటం గురించి మనం చదువ్ఞతాం. అలాగే చరిత్రలో నందరాజుల వలన అవమానం పొందిన చాణక్యుడు ఆ నందవంశాన్ని నిర్మూలించినపుడే తన జుత్తు ముడివేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. తన జుత్తుతో అడ్డుకట్టవేసి గంగను ధరించిన శివ్ఞడు గంగాధరుడయ్యాడు. చంద్రుణ్ణి తన తలపై ధరించి చంద్రశేఖరుడయ్యాడు. కృష్ణుడు తన జుత్తును నెమలి పింఛంతో అలంకరించుకున్నాడు.

మనిషికి అందాన్నిచ్చే వాటిలో అత్యంత ముఖ్యమైంది. జుత్తు. ఈ జుత్తు మనిషి ముఖాకృతిని, వయసును తెలుపటానికి కూడా ఆధారమైంది. జుత్తుకు జుట్టు, వెంట్రుకలు, నీలాలు, కుంతలాలు, కురులు, శిరోజాలు, కేశాలు వంటి ఎన్నో పేర్లున్నాయి. ఈ జుత్తు నొక్కుల జుత్తు, వంకీల జుత్తు, గిరజాల జుత్తు, నల్లజుత్తు, తెల్లజుత్తు, మెత్తని జుత్తు, బిరుసు జుత్తు-ఇలా ఎన్నో రకాలుగా ఉంటుంది. నుదుటిపై పడే జుత్తును ముంగురులు అని అంటారు. దానిని తుమ్మెదరెక్కలతో పోలుస్తారు. నల్లని పొడవైన జుత్తునే చాలామంది అందమైన జుట్టని అంటారు. అలాంటి జుత్తుతో అల్లిన జడ నల్లని నాగుపాములా ఉంటుందంటారు.
ఈ జుట్టుకు నూనె రాయటం, స్నానం చేయించటం, నున్నగా దువ్వటం మన నిత్యకృత్యాల్లో ఒక భాగం. అయితే ఈ జుట్టు ముఖంపై పడకుండా ఉండటానికి పక్కపిన్నులు వాడతారు మహిళలు.

జుట్టు జడగా అల్లి, అది ఊడిపోకుండా చివర ఊలుతో కాని, రిబ్బనుతో కాని, రబ్బరు బాండుగాని, జడగంటలు గాని వేసుకుంటారు. తలమీద జుత్తుకు మధ్యగా పాపిడిని తీసి దానికి అటు, ఇటు సూర్యుడు, చంద్రుడు పేర్లతో పిలిచే బంగారు ఆభరణాలను లేదా రకరకాల క్లిప్పులు (ఇప్పుడు) పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు తల వెనుక వైపున నాగరాన్ని పెట్టుకునేవారు. కొందరు జుత్తును ముడివేసి దానిని బంగారు, వెండి నగలతో, పూలతో అలంకరిస్తారు.
దేవ్ఞడికి తలనీలాలు (జుత్తు) సమర్పించటం అంటే భౌతికమైన అందాలకు లొంగక ఆత్మార్పణ చేసుకోవటం అన్నమాట. అలా ప్రజలు సమర్పించిన జుత్తుతో సవరాలు, విగ్గులు, కుంచెలు మొదలైనవెన్నో తయారుచేస్తారు. అలాగే గొర్రె మొదలైన జంతువ్ఞల జుత్తును బాగా పెంచి, దాన్నుండి కంబళ్లు, రగ్గులు, టోపీలు, దుస్తులు మొదలైనవెన్నిటినో చేస్తారు.

ఇంగ్లీషు కథల్లో (ఫెయిరీ టేల్స్‌) మంత్రగత్తె రఫుంజర్‌ అనే అమ్మాయిని ఒంటిస్తంభపు మేడలో ఉంచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లాల్సి వచ్చినపుడు పొడవైన అమ్మాయి జుత్తును కిందకు వేస్తే దాని ఆసరాతో మేడపైకి ఎక్కటం దిగటం చేస్తుంది. ఒకప్పుడు ఆడ,మగ జుత్తును పెంచుకునేవారే. జడలల్లి మల్లె, మొగలి, సంపంగి మొదలైన పూలతో అలంకరించుకునేవారు. ప్రస్తుతం జుత్తును కురచగా రకరకాల ఆకారాల్లో కత్తిరించడం చేస్తున్నారు. దానికోసం కొన్ని కొత్తవిద్యలే వచ్చాయి. జుత్తు సంరక్షణకు విటమిన్లను, రంగును, మందారం, గుంటగరగరాకు, వట్టివేళ్లు ఇలా ఎన్నిటినో కలిపి తయారుచేసిన నూనెను, కొబ్బరినూనెను వాడతారు. జుత్తు రక్షణకై నేడెన్నో కంపెనీలు ఎన్నో రకాల నూనెలు, క్రీములు, షాంపూలు తెస్తున్నాయి. జుత్తుకు పట్టే చుండ్రు, పేలు వగైరాలను వదిలించటానికి ఎన్నో మందులు, షాంపూలు వస్తున్నాయి.

బట్టతల గలవారు జుత్తును, ఆధునిక వైద్యపద్ధతుల ద్వారా మొలిపించు కుంటున్నారు. జుత్తును గురించి మన తెలుగులో ఎన్నో సామెతలు, పొడుపుకథలు ఉన్నాయి. జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పయినా పెడుతుంది. వెంట్రుకలు పెరికివేయగానే పీనుగు తేలిక అవ్ఞతుంది. వెంట్రుకకన్న ఏడుపాళ్లు సన్నం,
రోకటి కన్న ఏడుపాళ్లు లావ్ఞ; వెంట్రుక వేసి కొండను లాగినట్లు; వెంట్రుక పట్టుకుని పాకులాడినట్టు; ఆమెపేరు కుంతలమ్మ, చూడబోతే బట్టతల మొదలైనవి సామెతలు. మొక్క చింతమావికి మోపెడు తీగలు; మామిద్దెమీద ఒక చెట్టు, కొట్టిన కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. అటు ఇటు ముళ్లకంచెలు, మధ్యలో రోడ్డు, నల్లని చీకటిలో తెల్లని బావి(పాపిడి), గట్టుమీద ,చువ్వ, గాలింపు చువ్వ, విరిస్తే ఫెళఫెళ, మొద్దుమానుకు మోపెడు తీగలు వంటి పొడుపు కథలున్నాయి. ప్రమాదాల గురించి చెప్పేటపుడు వెంట్రుకవాసిలో తప్పింది అనటం మనకు తెలిసిందే. చూశారా, జుత్తేకదా అనుకుంటాం కానీ ఆ జుత్తుకే ఎంత ప్రాధాన్యత ఉందో!