సైకోథెరపీ చేయించడం మేలు

It is better to do psychotherapy

మా అక్క శాడిస్టు భర్తతో వేగలేక రోగిష్టి అయ్యింది. దిగులు నీరసం, నిస్సత్తువ, డిప్రెషన్‌కు గురై మంచం పట్టింది. డాక్టర్లు మందులు ఇస్తున్నా, సెలైన్‌ పెడుతున్నా కోలుకోలేకపోతున్నది. యవ్వనంలో సినీనటిలా ఉన్న ఆమె ఇప్పుడు బక్కచిక్కి జీవశ్చవంలా మారింది. డాక్టర్లు ఆమెకు సైకోథెరపి, కౌన్సిలింగ్‌ చేయించమని సలహా ఇచ్చారు. భర్త విపరీత ప్రవర్తన వల్ల భార్య మరీ ఇంతలా కృంగిపోతుందా! అని ఆశ్చర్యంగా ఉంది. మా అక్క కథనం చదివి చక్కని సలహా ఇస్తారని ఆశిస్తున్నాను. ఆమె వయస్సు 45 యేళ్లు. పిజి చేసి, ఓ ప్రభుత్వ సంస్థలో చిరు ఉద్యోగిగా ఉంది. మా బావ కూడా బాగా చదువ్ఞకుని స్వంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇద్దరు పిల్లలు చదువులు పూర్తయి ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారి కుటుంబం ఆర్థికంగా, సామాజికరంగా బాగుంది. మా బావ కూడ చాలా మంచివాడు.

చుట్టుపక్కల వారి గౌరవ మర్యాదలు పొందుతున్నాడు. అయితే మా అక్కమాత్రం అతన్ని భరించలేనంటున్నది. ఆయన ఇంటి వచ్చే ముందు తాగి వస్తాడని, మితిమీరిన ప్రేమ, అనురాగంతో వేధిస్తాడని అంటున్నది. బయటివారితో చక్కని స్నేహసంబంధాలు నిర్వహించే వ్యక్తి భార్యను ఎందుకు వేధిస్తున్నాడో అర్ధం కాలేదంటున్నది. ఒక్కోరోజు రాత్రంతా నిద్రపోనివ్వకుండా పనికిరాని కబుర్లు చెప్పడం, మితిమీరిన ప్రేమ ప్రదర్శించడం చేస్తుంటాడని చెప్పింది. తాగని రోజు మాత్రం, భోజనం చేసి, కొద్దిసేపు టివి చూసి హాయిగా నిద్రపోతారట. తాగిన సమయంలో అపరిచితునిలా ూరిపోతాడని తెలిపింది. ఇది బయటకు చెప్పుకోలేక తనలో తనే కుమిలిపోతున్నది. పదిరోజుల క్రితం స్కూటర్‌ పై వస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించాము. మూడురోజుల ఆసుపత్రిలోనే ఉంచి రక్తపరీక్షలు, ఎక్స్‌రేలు, స్కానింగులు తీసి పరీక్షించారు. శరీరంలో ఎలాంటి లోపాటు లేవని ఇది మానసిక సమస్యని తేల్చారు. మనసులో లోపముంటే శరీరంలో బాధలు, నొప్పులు వస్తాయా? కళ్లు తిరగడం, తలనొప్పి, మెడ, భుజాల నొప్పి, గుండెదడ, ఆకలిమందగించడం లాంటి సమస్యలు కనిపిస్తాయా? అన్న అనుమానం వస్తోంది. డాక్టర్లు సరిగా పరీక్షలు చేశారా? లేదా? అన్న సంశయం కలుగుతున్నది. ఈ నేపథ్యంలో మా అక్కను మామూలు మనిషిగా చేయడానికి తగిన మార్గం చెప్పండి. కిరణ్మయి, ఖమ్మం

అమ్మా, మీ అక్క మీ బావ ప్రవర్తనల వల్ల విరక్తి, విసుగు, భయం, ఆందోళనకు గురవ్ఞతున్నది. దీనివల్ల మానసిక ఒత్తిడి, కృంగుబాటు ఆవహించాయి. దీంతో ఆమెలో నీరసం, నిస్సత్తువ, ఇతర శారీరక సమస్యలు తలెత్తాయి. ఇలాంటి నొప్పులు, బాధలను సైకో సొమాటిక్‌ రుగ్మతలు అంటారు. అంటే మనోజనితమైన శారీరక సమస్యలు లేదా రుగ్మతలని అర్ధం. భర్తల విపరీత ధోరణి, మితిమీరిన ప్రేమ లాంటి వాటి వల్ల ప్రతి భార్య మీ అక్కలా కృంగిపోతుందని చెప్పలేము. వ్యక్తిత్వం, దృక్పథం, స్వీకరించే తీరును బట్టి ఉంటుంది. మీ అక్క సున్నితమనస్కురాలై ఉంటుంది. పైగా కొంత సాంప్రదాయాలు, సెంటిమెంట్లు పాటించే అలవాటు ఉంటుందని భావిస్తున్నాను. ఇలాంటి వారు భర్తతో నిర్మోహమాటంగా తన భావాలు చెప్పలేరు. ఒకవేళ చెప్పగలిగినా ఖచ్చితంగా వ్యవహరిస్తూ నియంత్రించలేరు. ఎదుటి వ్యక్తిని మార్చలేక తమ నుదుటి రాతను నిందించుకుంటూ కుమిలిపోతుంటారు. ఇలాంటి వారు త్వరగా ఒత్తిడి,కృంగుబాటుకు గురవ్ఞతుంటారు. వీరిని సైకోథెరపీ, కౌన్సిలింగ్‌ ద్వారా మానసిక శక్తిమంతులుగా మార్చవచ్చు. తట్టుకునే శక్తి, సామర్థ్యాలు పెంచవచ్చు. మందుకంటే మానసిక చికిత్సే మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక మీ బావ అన్ని విధాలా మంచివారే అనడంలో అతిశయం లేదు. అయితే తాగినప్పుడు ఆయనలో శాడిజం, అతి ప్రేమ తలెత్తుతుంటాయి.
ఈ లక్షణాలున్నవారు ఎదుటి వారు బాధపడుతున్నా పట్టించుకోకుండా తమ ఆనందానికి ప్రాధ్యాత ఇస్తారు. కాబట్టి ఆయనను డి అడిక్షన్‌ కేంద్రంలో చేర్పించి తాగుడు మాన్పించండి. భార్య ఎంత దృఢంగా ఉన్నప్పటికీ శాడిస్టు భర్తతో వేగడం కష్టమే. ఇద్దరికి ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ చేయించి, విడివిడిగా చికిత్సలు అందిస్తే అన్నీ సర్దుకుంటాయి. కాబట్టి డాక్టర్లు చెప్పినట్లు సైకోథెరపీ చేయించండి.

  • డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/