దివ్యాంగుల డ్రైవింగ్‌ సేవలో అనిత

Hellping for handicapped persons
Hellping for handicapped persons

అన్ని అవయవాలు బాగున్నా నల్లగా ఉన్నామని, లావ్ఞగా ఉన్నామని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేవారు కొందరున్నారు. ఇంతటితో ఆగక ఆత్మహత్యలకు పాల్పడేవారు కూడా ఉన్నారు. కానీ పోలీయోతో రెండుకాళ్లతో నడిచేందుకు వీలుకాకపోయినా ఆమె అధైర్యపడలేదు. జీవితాంతం వికలాంగురాలిగా జీవించాలనే చింత ఆమెను వెంటాడలేదు. ఆత్మవిశ్వాసం ఉండాలే కాని, కాళ్లులేకపోయినా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని నిరూపించారు ఆమె. ఆమె పేరు అనిత. జైపూర్‌కు చెందిన ఆమె పోలియోతో రెండు కాళ్లతో నడవలేనిస్థితి. నేను నడవలేను కానీ పరుగులు తీస్తున్నాను, నాలాంటివాళ్లను కూడా పరుగులు తీయిస్తున్నాను అంటున్న ఆమె మనోనిబ్బరం ముందు అందరూ ఫీదా అయిపోవాల్సిందే. అనిత అందకిలాగే పుట్టింది. చలాకీగా అడుగులు వేసింది, పరుగులు తీసింది, ఆడింది, పాడింది. ఇంతలోనే ఊహించని విధంగా ఆమె ఆరో ఏట ఆకస్మాత్తుగా నడవలేక కూర్చుండిపోయింది. ఆమె నడకను పోలియో ఎత్తుకుపోయింది. రెండుకాళ్లు కదపలేకపోయింది. ఆమెది జైపూర్‌. నడక కోసం అనిత కర్రకాళ్ల మీద ఆధారపడవలసి వచ్చింది. అయితే ఆ కర్రకాళ్లు ఆమె విజయాలకు ఎన్నడూ అడ్డంకి కాలేదు. చిన్నతనంలోనే అనిత సపోర్ట్‌ వీల్స్‌తో బైక్‌ నడిపింది. పెద్దయ్యాక మారుతి ఆల్టోకారు కొనుక్కుంది. యాక్సిలరేటర్‌, బ్రేక్‌, క్లచ్‌లను చేతితో వాడే విధంగా మార్పులు చేయించుకుంది. తనకు కావలసిన వేగాన్ని మార్చుకునేందుకు అనువుగా డాష్‌ బోర్డు మీద ఒక లీవర్‌ని ఏర్పాటు చేయించుకుంది. జైపూర్‌లోని రాజేష్‌శర్మ అనే ఒక మెకానిక్‌ ఈ విధంగా కారులో మార్పులు చేశాడు. ఈ కస్టమైజ్డ్‌ మార్పుల విద్యను ‘జుగాడ్‌ అంటారు. ‘ఈ కారు వల్ల డ్రైవింగ్‌ నేర్చుకోవడంతోపాటు, ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండగలుగుతున్నాను అంటున్నారు అనిత. రాజేష్‌ ఇప్పటికి ఈ విధంగా మూడువేలకార్లు తయారు చేశాడు. శరీరంలో కాళ్లభాగం అసలు పనిచేయనివారికి అనువుగా మరికొన్ని మార్పులు చేస్తున్నాడు రాజేశ్‌శర్మ. అంతేకాదు ఎవరికి అవసరమో వాళ్ల ఇంటి దగ్గరకు వచ్చి మరీ కారుకి సంబంధించిన పనులు చేస్తాడు రాజేశ్‌. గేర్‌ బాక్సుని ఏ మాత్రం కదపకుండా, స్టీరింగ్‌ చక్రానికి కిందిగా లీవర్లు ఉంచుతాడు. బైక్‌కి ఉన్నట్లుగానే యాక్సిలరేటర్‌ను తేలికగా ఉపయోగించుకునేలా చేస్తాడు. అనిత ఉన్నత చదువులు చదవడానికి ఈ కారే ప్రోత్సహించింది. ‘డిజెబిలిటీ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అనే అంశం మీద ఐఐఎం ఇండోర్‌లో పి.హెచ్‌.డి చేయడానికి ఆమెకు ఈ కారే సహకరించింది. ఇప్పుడు తనలాంటి వారికి ఆమె కార్‌ డ్రైవింగ్‌ నేర్పించడం కూడా ఈ కారు కారణంగానే. అనిత పిహెచ్‌డి చేసే సమయంలో నవీన్‌ గులియా అనే సాహస బాలుడిని కలవడం తటస్థించింది. అతడు సాహసాలలో ఎన్నో ప్రపంచ రికార్డులు సాధించాడు. అతనికి మెడ నుంచి కింద వరకు శరీరం నిర్జీవం అయిపోయింది. అతడితో కార్‌ డ్రైవింగ్‌ గురించి మాట్లాడుతూ ఉండగానే, ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చి, అనిత తయారు చేయించుకున్న కారులో ఎలా డ్రైవింగ్‌ చేయవచ్చో నేర్పించమంది. ఆ అమ్మాయి సరదాగానే అడిగింది కానీ, అనిత డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రారంభించడానికి అదే పునాది అయ్యింది. ఆ తరువాత అనిత, దివ్యాంగుల డ్రైవింగ్‌ స్కూల్స్‌ గురించి విచారణ చేసింది. ఎవరికీ లైసెస్సు లేదు. ఇటువంటివారికి ట్రయినింగ్‌ ఇవ్వాలంటే లైసెన్స్‌ తప్పనిసరి. ఈ క్రమంలో భారతదేశంలో 2013లో మొట్టమొదటి సారిగా దివ్యాంగుల కోసం డ్రైవింగ్‌ స్కూల్‌ మొదలైంది. అప్పటికే అనిత తనకారులో కొందరికి డ్రైవింగ్‌ నేర్పించారు. తానూ ప్రొఫెషనల్‌గా మారాలనుకున్నారు. ‘డ్రైవింగ్‌ నేర్చుకోవాలంటే అందుకు మనోధైర్యం ఉండాలి. వారి మీద వారికి నమ్మకం లేకపోవడం మరో కారణం అంటారు అనిత. అనిత కూడా లైసెన్సు తీసుకుని, స్వయంగా డ్రైవింగ్‌ నేర్పించడం మొదలుపెట్టారు. ఆమె విద్యార్థులలో ఒకరికి ఎడమ చేయి లేదు. కుడి చేత్తో స్టీరింగ్‌ తిప్పుతూ, గేర్లు మార్చుతూ కారు నడుపుతున్నారు. గేర్లు మార్చేటప్పుడు ఏ మాత్రం తడబాటు లేకుండా ధైర్యాన్ని అలవర్చుకున్నారు అనిత. ప్రారంభించిన ఎనిమిది నెలలకే 16 మందికి డ్రైవింగ్‌ నేర్పారు ఆమె. ఒకసారి ఒక్కరిని మాత్రమే ఎంచుకుంటున్నారు. ఆమె ఇప్పుడు 17వ విద్యార్థికి డ్రైవింగ్‌ నేర్పిస్తున్నారు. ఆరువేల రూపాయల ఫీజు తీసుకుంటూ డ్రైవింగ్‌నేర్పిస్తున్న అనిత,ఈ ఫీజులో అధికభాగం వీర్‌చెయిర్లకే కేటాయిస్తున్నారు. అందుకే అందరికంటె కొద్దిగాఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారు. మనోబలం చాలు కార్యసాధనకు అని అంటారు అనిత.