దివ్యాంగులకు మార్గదర్శి

Shanti

వైకల్యం ఉన్న వారిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు చాలా మంది వెనకడుగు వేస్తారు. అలాంటి దివ్యాంగులకు శాంతి రాఘవన్‌ ఒక మార్గదర్శిగా నిలిచారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శాంతి రాఘవన్‌ తమ్ముడు హరి రాఘవన్‌ ముంబయిలో చదువుకుంటున్నాడు. అతడు చూపు సంబంధ సమస్యతో బాధపడేవాడు. క్రమంగా అతడు అంధుడిగా మారిపోయాడు. తమ్ముడికి చికిత్స చేయించేందు శాంతి అతడిని అమెరికా తీసుకువెళ్లింది.

ఆమె భర్త దీపేస్‌ కూడా అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేస్తున్నారు. శాంతి తమ్ముడు హరికి చికిత్స చేయించే ఉద్దేశంతో స్క్రీన్‌ రీడింగ్‌ టెక్నాలజీని నేర్చుకుంది. తమ్ముడిలో మార్పు వచ్చేలా చేసింది. ఆ తరువాత హరి ముంబయిలోని ఎన్‌ఎంఐలో ఎంబిఎ చదివి బంగారుపతకం సాధించాడు. భారత్‌కు తిరిగిన వచ్చిన శాంతి బెంగుళూరులోని ఒక సంస్థలో ఉద్యోగంలో చేరింది. ఖాళీ సమయాల్లో కంటిచూపు సరిగ్గా లేని వారికి రకరకాల అంశాల్లో శిక్షణ ఇచ్చేది. అంతచేసినా తమ్ముడికి కంటిచూపు సరిగా లేదని ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో సంస్థల అవసరాలకు తగినట్లుగా అంధులకు శిక్షణ ఇచ్చేందుకు ఎనేబుల్‌ ఇండియా అనే సంస్థను ప్రారంభించారు.

కార్పొరేట్‌ సంస్థల అవసరాలు, సమస్యలు తెలుసుకుని అందుకు తగినట్లుగా దివ్యాంగులను తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. అయితే కొన్ని సంస్థలు వారి అర్హతకు తగినట్లుగా కాకుండా చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చారు. చదువుకు తగినట్లుగా ఉద్యోగాలు ఇప్పించాలన్న ఆశయంతో ఉన్న శాంతి దివ్యాంగులు చేయగలిగేవి 275 రకాల ఉద్యోగాలున్నట్లు గుర్తించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఉన్నంతలో వారిని నిపుణులుగా మార్చాలనుకుంది. మొదట దివ్యాంగులను అర్ధం చేసుకోవడంలోనే సమస్య ఎదురయ్యేది.

ఒక్కొక్కరు వారి సామర్ధ్యాన్ని ఒక్కోలా అంచనా వేసేవారు. కొందరికి తమపై నమ్మకం ఉండేది కాదు. సమాజంలోకి వస్తే ఏమవుతుందోనని భయపడేవారు. అందుకే మొదట వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కృషి చేశామంటారు. దివ్యాంగులు కొన్ని కారణాల వల్ల చదువు మధ్యలోనే ఆపేసేవారు. సంస్థలు మాత్రం డిగ్రీలు అడిగేవి. దీన్ని అధిగమించడానికి సంస్థలతోనూ అనుసంధానమయ్యారు. ఆ ఉద్యోగాలకు అనుగుణంగా మా దగ్గరికి వచ్చే వారికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాము. వాళ్లకు తర్ఫీదునివ్వడంలో రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నట్లు వివరించారామె. అందరితో సమానంగా వారిలో నైపుణ్యాలున్నాయని వారే గుర్తించేలా చేస్తామన్నారు.

తీవ్ర అంగవైకల్యం ఉన్నా సరే ఉద్యోగాలు సాధించలరనే నమ్మకం కల్పిస్తున్నట్లు చెప్పింది. ఒక దివ్యాంగుడి సమస్య అలాంటి వ్యక్తి మాత్రమే అర్ధం చేసుకోగలడన్న అభిప్రాయంతో అలాంటి శిక్షకులనే ఎంచుకుంటున్నామన్నారు శాంతి. 14 రకాల వైకల్యాలు ఉన్నవారికి తర్ఫీదు ఇస్తున్నట్లు చెప్పారు. కంటి చూపు లేని వారి కోసం శాంతి రాఘవన్‌ ఏర్పాటు చేసిన ఎనేబుల్‌ వాణి సంస్థ ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో పనిచేస్తుంది.

స్థానికంగాఉండే పరిస్థితులపై అక్కడి వారికే అవగాహన ఉంటుందని దేశవ్యాప్తంగా రెండొండలకు పైగా ఎన్జీవోలతో అనుసంధానమైంది. ఉద్యోగాల కల్పనలకు 725 కంపెనీలతో అవగాహన కుదుర్చుకున్నారు. దీని ద్వారా ఇప్పటివరకు మొత్తం 2.20 లక్షల మంది లాభం పొందారు. స్వయం ఉపాధి, నైపుణ్యాలు పెంచుకోవడం కోసం ఎవరైనా ఈ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయిస్తే శిక్షణ ఇస్తారు. శాంతి కృషిని గుర్తించిన పలు సంస్థలు ఆమెకు ఎన్నో అవార్డులు ఇచ్చాయి. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి బెస్ట్‌ సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అవార్డు పొందారు శాంతి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/