బిడ్డను మరచిన తల్లి

Shirdi Sai Baba
Shirdi Sai Baba

మహాత్ముల జీవితాలు అసాధారణ సంఘటనలు చోటు చేసుకుంటాయి. సాయిబాబా సాహిత్యంలో కూడా అటువంటివి ఉన్నాయి. షిర్డీకి కొద్దిదూరంలో ఉన్న ఒకరిద్దరు భక్తుల ఇండ్లకు సాయిబాబా వెళ్లేవారు. నానాసాహెబ్‌ డెంగ్లే ఇల్లు కూడా అందులో ఒకటి. ఒకసారి షిరిడీలో ఉన్న సాయిబాబా నానాసాహెబ్‌ డెంగ్లే ఇంటికి వెళ్లలేదు. నానాసాహెబ్‌ డెంగ్లే పొలానికి వెళ్లాడు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. నానాసాహెబ్‌డెంగ్లే ఇంటికి కనుకవెళ్లి వ్ఞంటే, డెంగ్లేతోను ఇతర భక్తులతోను ముచ్చటించి ఉండేవాడు సాయి. కాని డెంగ్లే పొలంలో ఎవరు ఉంటారు, సాయితో ముచ్చటించడానికి? అదీకాక తాను వస్తున్నట్లు సాయిబాబా ముందుగానే సమాచారాన్ని పంపి ఉన్నట్లయితే, భక్తులు ఎందరో వచ్చివ్ఞండేవారు ఆ డెంగ్లే పొలానికి?
నానాసాహెబ్‌ డెంగ్లే పొలంలో ఎందరో కూలీలు పనిచేస్తుండేవారు. ఒకనాడు మామూలుగానే కూలీలు ఆయన పొలంలో పని చేస్తున్నారు. ఆ పని చేసేవారిలో ఒక ఆడకూలీ కూడా ఉన్నది. ఆ మహిళాకూలీ తన పసిబిడ్డను అక్కడే ఉన్న ఒక చెట్టు నీడ కింద నిద్రపుచ్చి పనిలోనికి వచ్చింది. అందరూ పనులలో నిమగ్నమై ఉన్నారు. ఉన్నట్టుండి వాన కురవటం మొదలైంది. కూలీలందరూ పరుగుపరుగున కొద్దిదూరంలో ఉన్న పాకలోనికి పరుగుతీశారు. అలా పాకలోనికి పరుగెత్తి పోయిన కూలీలతో, ఆ మహిళా కూలీ కూడా ఉన్నది. కొద్దిక్షణాలైన తర్వాత, తన బిడ్డను చెట్టుకింద ఉంచిన విషయం గుర్తుకు వచ్చింది ఆమెకు. వెంటనే ఆమె తన పసిబిడ్డ కోసం ఆ చెట్టువద్దకు పరుగుతీసింది. ఆమె ఒక విచిత్రమైన దృశ్యం చూసింది. అక్కడ సాయిబాబా నిలబడి ఉన్నారు. ఆయన చేతులలో ఆడపనిమనిషి బిడ్డ ఉన్నది.
సాయి ఆ బిడ్డపై ఎటువంటి వర్షం పడకుండా ఎత్తుకున్నాడు. ఆమెకు ఆశ్చర్యం కలగటం సహజమే. బిడ్డను మరచినందుకు సాయి ఆమెను సున్నితంగా మందలించాడు. తల్లిబిడ్డను మరచినా, విశ్వమాత అయిన సాయి మరువలేదు. ఈ సంఘటనను వినినవారికి ఆశ్చర్యం కలిగించిన విషయం మరొకటున్నది. చెట్టుకింద సాయిబాబా నిలబడి పసిబిడ్డను ఆడించే సమయంలోనే, షిరిడీలోనే సాయిబాబా ఉండటం! మరోసారి సాయిబాబా షిరిడీలో ద్వారకామాయిలోనే ఉండి, నిప్పుకొలిమిలో పడిన పసిబిడ్డను తన రెండు చేతులతో ఆ నిప్పుల కొలిమి నుండి ఏ ఆపదా లేకుండా పైకి తీశాడు. పసిబిడ్డడు తన ఒడిలో ఉన్నాడనే విషయం మరచి, తొందరగా లేవటం వలన, ఆ పసిబిడ్డడు కొలిమిలో పడ్డాడు. మతిమరుపులు మానవ్ఞలకు సహజం. వాటివలన కలిగే ఆపదల నుండి సాయిబాబా వంటి సత్పురుషులే కాపాడెదరుగాక!

  • యం.పి.సాయినాధ్‌