బాల్యం ..మరలిరాని వసంతం

బాల్యం మరలిరాని జ్ఞాపకం. వెంటాడే మధురమైన జ్ఞాపకం బాల్యం. కల్మషం ఎరుగని బాల్యంలో చేసే ప్రతి అల్లరి ఓ ముచ్చటైన జ్ఞాపకమే. గుర్తుకు వచ్చే ప్రతిసారి నవ్ఞ్వ ఆగదు. మనసు ఉప్పొంగిపోతుంది. కేరింతలాడలనే కాళ్ల తపనకు నానమ్మలు, అమ్మమ్మల చేతికర్రలతో వెంబడిస్తూ, కొట్టడం మర్చిపోలేని తీపిగుర్తే కదా! చెవిపిండి, గోడకుర్చీ వేయిస్తూ, బట్టలు ఊడదీసి, ఎండలో నిలబెట్టిన టీచర్ల దండన ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి దెబ్బలే మర్చిపోలేని జీవిత పాఠాలను నేర్పాయి. ఎలా జీవించాలో బోధించాయి, ఎలా ఉండకూడదో నేర్పాయి. ఇవే కదా నేటి మన జీవితానికి ఆధారాలు! మరి నేటి బాల్యం పరిస్థితి ఎలా ఉంది?

Childhood Memorable Life
Childhood Memorable Life


ప్రతి పిల్లవానికి బాల్యం బంగారు లోకం…రంగుల ప్రపంచం…తమ సృజనాత్మకతను ఆట,పాట,మాటల ద్వారా వ్యక్తపరిచే సమయం. కానీ నేడు ఆపరిస్థితి మారింది. నేటి బాల్యం బండెడు పుస్తకాలతో బరువెక్కుతోంది. ఆనందాన్ని అనుభవించే పరిస్థితులే లేవు. ఎల్‌కెజి నుంచి నడుం ఒంగిపోయాలా బండెడు పుస్తకాలతో మోత మొదలవుతుంది. తమ బరువుకు మూడింతలు మోస్తూ చిన్నారులు అవస్థలు పడుతున్నారు. వెన్నునొప్పి, కండరాల సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు కార్పోరేట్‌ విద్యతో ఎదిగే వయసులో పిల్లలకు ఆట, పాటలు లేకుండా మితీ మీరిన హోంవర్క్‌, ప్రాజెక్టు వర్కుల పేరుతో పిల్లలను కేరింతల జీవితానికి దూరం చేస్తున్నారు. వాళ్లలో నవ్వుల ఛాయలే లేకుండా పోయాయి.ఇదంతా తల్లిదండ్రులు తమ పిల్లవాడు చదవాలని..అందరికంటే ముందుండాలని.. ఆంగ్లం చదివితేనే చదువైనట్లు…మిగతాది చదువు కానట్లు…పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు పొరుగు వారి పిల్లలను చూసి పిల్లల స్వేచ్ఛను హరించివేస్తున్నారు.తమ పిల్లలకు అభిరుచులకు అనుగుణంగా విద్యను నేర్పించడం లేదు. తమ అభిప్రాయాలకు అనుగుణంగా తమ పిల్లలు చదవాలని భావిస్తున్నారు. బాలలు బాల్యాన్ని ఆనందంగా అనుభవించే పరిస్థితులకు దూరం చేస్తున్నారు.పిల్లల విషయంలో తల్లిదండ్రులు చదువు..చదువు..చదువు అనే ఒత్తిడి తప్ప ఇంకోటి చేయడం లేదు. వారి ఆటలకు, పాటలకు దూరం చేస్తున్నారు. కాలక్షేపం కోసం కొద్ది సమయం దొరికినా కంప్యూటర్లు, టివిలకు అతుక్కపోయేలా ప్రోత్సహిస్తున్నారు. వీటిలో హింసను, అసాంఘిక విషయాల సన్నివేశాలు చూడటంతో బాలలు బాల్యం బుగ్గిపాలవుతుంది.
ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నంతో పిల్లలపై ప్రభావం….
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడంతో తాత, నానమ్మ, అమ్మమ్మలు చెప్పే పంచతంత్ర, విక్రమార్క, చందమామ కథలు వారికి వినే అవకాశమే కలగడం లేదు. రామాయణం, మహాభారతం వంటి కథల సారాంశం తెలియక బాలల్లో అనురాగం, ఆప్యాయ్యతలు తగ్గడంతో పాటు పిల్లల్లో నైతిక విలువలు పెంపొందే అవకాశ కలగడం లేదు. ఇంటర్నెట్‌తో స్నేహం చేస్తూ పిల్లలపై తల్లిదండ్రుల సరైన పర్యవేక్షణ లేక దారితప్పుతున్నారు.
20 సంవత్సరాల కింద బాల్యం ఇలా… 20ఏళ్ల పూర్వం వరకు బాల్యం పిల్లలకు ఆనందమయంగా ఉండేది. అష్టాచెమ్మా, చెమ్మాచెక్క, దాగుడు మూతలు, వాన గుంతలు, తొక్కుడు బిల్ల, జిల్లగోన, బడ్డికాట, పచ్చిపాట, గాజులాట, పిట్టగూళ్లు తదితర ఆటలతో పిల్లల సంతోషాలకు హద్దులుండేవికావు. కానీ నేడు ఆ పరిస్థితులు లేవు.
తల్లిదండ్రులలో మార్పు రావాలి.
ప్రస్తుత ఈ పరిస్థితులను అధిగమించాలన్నా…పిల్లల్లో గతంలో ఉన్న ఆనందాలు కలగాలన్నా ముందు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. అయితే
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో బాలల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. కానీ, ప్రైవేటు పాఠశాల్లో అత్యంత దారుణంగా ఉంది. ఇలాంటి వారు వారి బాల్యం అనుభవించిన ఆనందాన్ని తమ పిల్లలకు కావాలని ఆలోచించాలి. సామాజిక వేత్తలు, రచయితలు, కవులు, కళాకారులు అందరూ బాల్యం పిల్లలు ఆనందమయంగా అనుభవించేలా కృషి చేయాలి