ఆదరణకు నోచుకోలేమా?

v
Oldage

తల్లి దండ్రులను చూడటం అనే బాధ్యత తీసుకునే ఆలోచనలు చేయాలి. సాంకేతిక విప్లవంతో దెబ్బతింటున్న మానవ సంబంధాలను మెరుగుపర్చేందుకు ఆత్మీయ కలయికలు దోహదపడతాయి.

చిన్నకుటుంబం చింతలేని కుటుంబం అనుకుంటున్నాం. ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకునే కాలం. వారు కూడా ఉన్నత చదువ్ఞల కోసం, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. డబ్బు సంపాదన కోసం తల్లిదండ్రులకు దూరంగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమకు ఉన్న ఆ ఒకరు ఇద్దరు సంతానానికి దూరంగా ఉంటున్నారు. కొందరు వృద్ధాశ్రమాలలో జీవిస్తున్నారు. కోరినంత డబ్బు ఉంది. సదుపాయాలు ఉన్నాయి. సొంత ఇల్లు, కార్లు ఉన్నాయి. బ్యాంకులో డబ్బు ఉంది. కానీ ఆదరించే వారు లేరు. టైమ్‌కు మందు వేసుకునేందుకు ఇచ్చేవారు దగ్గర ఉండరు. తిన్నావా? మందు వేసుకున్నావా? అని అడిగే నాధుడు ఉండడు. పెద్దలు కూడా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లతో కాలం గడుపుతున్నారు. కాలం ఎంతగా మారిపోయింది? కాలంతో కరిగిపోయే ఆస్తులకోసం రక్త సంబంధీకులను దూరం చేసుకుంటున్నామా? అనే అనుమానం రాకమానదు. అశాశ్వతమైన ఆడంబర జీవితం కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోకండి. అలావదిలేస్తే అన్నీ ఉన్నా మీరు ఆనాధలే. చింతలు లేని కుటుంబాలోచ్చాయి. అనుబంధాలూ ఆత్మీయతలకిక్కడ కర్ఫూ. ముసలీముతకల కేరాఫ్‌ అడ్రస్‌ వృద్ధాశ్రమాలు. మరి పిల్లలకు చిల్డ్రన్‌ హోములు, మన పిల్లలను మనమోట్లా ప్రేమించాలో మల్ట్టీనేషనల్‌ కంపెనీలు చెప్తాయి. ప్రేమ అప్యాయతల అనుబంధం, అనురాగం వట్టి బూటకాలుగా మారుతున్నాయి. పెద్దలను గౌరవించడం, వారి అనుభవసారాల్ని వడగట్టి ఫలితాలను చేజిక్కించుకోవడం వారి ఆశీస్సులు అందుకోవడం ఓ సంస్కారం. స్వార్థం లాభర్జన జీవిత లక్ష్యంగా మారిపోయింది. అమ్మానాన్నలను కంటి పాపల్లాగా సాకాల్సిన సత్సంప్రదాయానికి పాలు పోసి పాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మీయ స్పర్శ బాగున్నావా? అనే ప్రేమతో కూడిన పలకరింపు ఎన్నటికీ మరవరానిది. కొన్నిసార్లు మతాలకు, మానవత్వం ఉండదు. కొన్నిసార్లు మనుషులకు మమతలుండవు. వీళ్ల మధ్య బతుకున్న జీవచ్ఛవాలకు మానవ సంబంధాలే ఉండవు. అవసరం కోసం మొదలైన సౌకర్యంగా అలవాటై చివరికి ఇంటర్నెట్‌కు బానిసలుగా మారుతున్నారు. నా అని పలకరించేవారు లేరు. తన రక్త సంబంధీకులు వారి అప్యాయతలు ఆనందాలు, మనుషులు మానవరాండ్రులో అచ్చట్లూ ముచ్చట్లో ఆటలు పాటలు అవి పూర్తిగా కనుమరుగవుతున్నాయి. కుటుంబ పెద్దలలో తృప్తి కనబడక అసంతృప్తి, అభద్రతాభావం పెరిగిపోతున్నాయి. నీ కష్టానికి చలించటం మానవ సహజం. పరుల దు:ఖానికి స్పందించటం మానవగుణం. జీవితమంటే రంగుకాగితాలతో రగిలించుకుంటున్న అహాలబూడిదకాదు. మానవత్వపు కాగడాలతో మరో మనిషినైనా వెలిగించాలి. మనిషి వ్యాపార వస్తువై విఫణివీధిలో అంగడిసరుకైనాడు. తనకు తాను అమ్ముకోవడం కోసం కాలంతో పరుగులు తీస్తున్నాడు. కుటుంబంలోని పెద్దలతో పాటు జ్ఞానవృద్ధి పరిణతినీ పరమసత్యమైన శాంత స్వభావాన్ని అలవర్చుకోని అందుకనుగుణంగానే సూచనలు, సలహాలు ఇస్తుంటారు.

ఇవి యువతరానికి పనికిరాని ఆవేశం ఉద్వేగం సాహసం వేగం వారి సొంతం. పెద్దల మాటల చాదస్తం చాపల్యంగా వారికి అనిపిస్తాయి. అంతర్గత ఒత్తిడిని తట్టుకునే శక్తి వారిలో ఉంటుంది. తమ జీవితంలో ఎన్నేన్నో చెడు అనుభవాలను చవిచూసిన తర్వాత వారు నిర్మాణాత్మకమైన ఆలోచనలతో ముందుకు సాగడం ఎలా అనేది తెలుసుకుంటారు. వ్యతిరేక ఆలోచన దరిచేరనీయరు. మన చర్యలు మన ఆలోచనల ప్రకారం ఉంటాయని ఆలోచనలు మనం ఆపాదించుకున్న విలువలను బట్టి ఉంటాయని జీవితానుభవసారం ఫలితంగా వారు గుర్తించగలుగుతారు. అదేవారి జ్ఞాన సంపదలు. తల్లి దండ్రులను చూడటం అనే బాధ్యత తీసుకునే ఆలోచనలు చేయాలి. సాంకేతిక విప్లవంతో దెబ్బతింటున్న మానవ సంబంధాలను మెరుగుపర్చేందుకు ఆత్మీయ కలయికలు దోహదపడతాయి. విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి దోహదపడలదు.

సాంకేతిక విప్లవం సృష్టించిన సెల్‌, ఇంటర్నెట్‌ వాట్సాప్‌, ట్విట్టర్‌ తదితర సౌకర్యాలతో మానవసంబంధాలు మృగ్యమవుతున్నది. కుటుంబ సభ్యులు సైతం ఆత్మీయంగా, ఆనందంగా మాట్లాడుకోలేని పరిస్థితులు ఉత్పన్నం కావటం శోచనీయం. మనిషి మాట మనసు మాలిన్య కేంద్రాలు మారాయి. సంబంధాలన్నీ వ్యాపార వస్తువుగా మారి బంధాలకు చెదలు పట్టింది. బంధాలతో కుటుంబాలు గట్టిపడుతాయి. జ్ఞాపకాలతో అనుబంధం ముడిపడుతుంది. రక్త సంబంధీకుల పంచదార గుళికల్లాంటి పలుకులు సుతిమెత్తని మామయ్య చురకలు అమ్మమ్మ తాతయ్య ముద్దులు రోజురోజుకు కనుమరుగుతున్న తరుణం. పేరెంట్స్‌ను నిర్ధ్యాక్షిణంగా వదలి
ఒంటరితనంలో నెట్టి వెళ్లిపోతున్నారు పిల్లలు. ఒటరితనం శారీరక అనారోగ్యం మానసిన ఇబ్బందులలో సతమతమవుతున్న తల్లిదండ్రులను గాలికి వదలివేశారు. ఎన్నో

భావోద్వోగాలు, టన్నుల కొద్దీ అనుభవం అపారమైన జ్ఞానం కలిస్తే కుటుంబంలోని పెద్దలు వాళ్లు, నాన్నమ్మలు, అమ్మమ్మలు తాతయ్యలు మన భవిష్యతు ్తకోసం త్యాగాలు చేసి మన నవ్వుల్ని చూసి వారి బాధలు మరచిపోయే మంచివాళ్లు. అనుభవం మంచి, చెడు ఆలోచించే పెద్దరికం వారు అన్నీ తెలిసిన జ్ఞానులు వారు అనుభవజ్ఞులు వయోవృద్ధులు కాదు జీవన జ్ఞానవృద్ధులు. ఇంటికి పెద్ద దిక్కు ఉంటే ఆ ఇంట్లో దివీటీ వున్నట్లే, వారిని మనం భారంగా భావించవద్దు. వారు కూడా మనల్ని భారం అనుకొని ఉంటే ఈ రోజు మనం ఉండే వాళ్లమా! డబ్బు కోసం అతిగా ఆలోచన నిద్రలేమి టెన్షన్లు, ఒత్తిళ్లు ఆవేదన భయం, భయంతో భద్రతలేని జీవితం అన్న ఆనందం, అప్యాయత, అనురాగం, ప్రేమ, సంతోషం, అన్ని మరచి ముందు చూపు లేని జీవితాలు గడుపుతున్న కాలం మీది. తల్లిదండ్రుల ఆరోగ్యం వారి ప్రతిరోజు అవసరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత పిల్లలకు ఉంది. వారి సామాజిక జీవనం సాఫీగా సాగడానికి తోడ్పాటును అందివ్వాలి.

ఇంట్లో పెద్దలు అమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు చెప్పే కబుర్లు నేర్పించే పనులు నైతిక విలువలు, రాత్రిపడుకోబేయే ముందు చెప్పే కథలు పిల్లలను ఉత్తమంగా తీర్చిద్దిడంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపకరిస్తున్నాయి. అనుబంధాన్ని పెంపొందించడంలో సాయపడేది వాళ్లే. అవసరాలకు కోరికలకు నడుమ వ్యత్యాసాన్ని తేలియజేస్తారు. స్కూల్‌కు వెళ్లేముందు కొద్దినిమిషాలైనా దేవుణ్ణి ప్రార్థించాలి అని చెప్పే వారు వాళ్లు. పవిత్ర గ్రంధంల్లోని కథలను వివరించేదివాళ్లే. మంచి చెడుల విచక్షణను
వివరిస్తారు. సమస్య ఎదురైతే పరిష్కార మార్గాలు ఎన్నో విషయాం వాళ్ల స్పూర్తి. పెద్దవాళ్లు చేసే గారాలలో ప్రేమ ఉంటుంది. పిల్లల వ్యవహారశైలిలో ఎంతగానో మార్పు వస్తుంది. పిల్లలకు పెద్దవారితో నడవగల అవకాశం కల్పించాలి. తమను తీర్చి దిద్దిన తమ తల్లిదండ్రులు తమ పిల్లలకు మార్గదర్శకం అవుతారని భావిస్తూ ఆ గొప్పతనాన్ని ఆగౌరవాన్ని వారికి ఇవ్వాలి. అమ్మమ్మ నాన్నమ్మ దగ్గర ఆట విడుపుగా ఉంటుంది. పిల్లలో వారి ఆదరణ అండ అనందం. చనిపోయిన తర్వాత కర్మకాండలకు ఇచ్చే ప్రాధాన్యత బతుకున్నప్పుడు పట్టేడన్నం పెట్టేందుకు ససేమిరీ అంటున్నారు.

నాన్నమ్మనే అందమైన వెన్నెలను, తాతయ్య అనే అనుబంధాల ఆనందపు వెలుగులను కోల్పోతున్నారు.
జీవనసంధ్యలో అలసిన ఆ గుండెలు ఇపుడు నా అన్నవారి అప్యాయత అనురాగాల కోసం పరితపిస్తున్నారు. రాలిపడిన పండుటాకును చూసి విరగబడి నవ్విందట ఓ పచ్చని ఆకు. అప్పుడు ఆపండుటాకు చెబుతుందట తరువాత రాలిపడాల్సింది నువ్వు నీకు ఓ రోజుంది. మనల్ని మనం పోగేసుకుని కూలిన మనసుల్ని పునర్నిర్మించుకోవాలి. మానవసముహాలను నిలబెట్టే ప్రయత్నం చేయాలి. నేడు ఆహారంతపాటు ఆలోచనలూ కల్తీ అవుతున్నాయి.

మనిషికి మనిషికి బంధాలను తెంపుకొని మానవసమాజంలో ఒంటరి మనిషిగానే మిగిలిపోతున్నాడు. ఆధునికత నియంత్రణలోకి బదిలీ అయ్యాక మనిషితనం పూర్తిగా మాయం అవుతున్నది. చుట్టూ ఒంటరితనం గుడుకట్టుకొని జీవిస్తూ నెమ్మది నెమ్మదిగా ఉనికిని కోల్పోతున్నాడు.