మార్పును జీర్ణం చేసుకోవాలి

Teenage Girl

ఆడపిల్లలు ఒకప్పుడు 14, 15 సంవత్సరాలకు రజస్వలమయ్యేవారు. ఆధునిక ఆహారపు అలవాట్లు, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో తొమ్మిది, పదేళ్లకే మెచ్యూర్‌ అవ్ఞతున్నారు. దీంతో తల్లిదండ్రులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పిల్లలకు ఏమాత్రం అలాంటి విషయాల పట్ల అవగాహనలేని వయసులో మెచ్యూర్‌ కావటం వారిలో అయోమయం, కంగారు, భయాలకు గురిచేస్తుంది.

అంతేకాదు ఒకలాంటి ఒంటరితనం దిగులు వారిని ఆవరించే ప్రమాదమూ ఉంది. మరీ తొమ్మిది, పదేళ్ల వయసులోనే మెచ్యూర్‌ అయిన పిల్లలకు ఈ మార్పులు తట్టుకునే శక్తి ఉండదు. నిన్నటివరకు ఎగురుకుంటూ వెళ్లి నాన్న ఒళ్లో కూర్చున్న చిట్టితల్లి ఒక్కసారిగా పెద్దదానిలా ప్రవర్తించాలంటే కుదరదు కదా. తల్లిదండ్రులు చదువుకున్నవారయి, ఈ తరుణంలో పాటించే పాత సిద్ధాంతాల పట్ల నమ్మకంలేని ఇళ్లలో అయితే పరవాలేదు. కానీ గ్రామీణ వాతావరణంలో పెరుగుతున్న పిల్లలు అయితే తప్పకుండా ఈ మార్పుని త్వరగా జీర్ణం చేసుకోవాల్సిందే.

అమ్మమ్మ, నాన్నమ్మల మధ్య పెరుగుతున్న పిల్లల్ని స్వేచ్ఛగా ఆడుతూపాడుతూ తిరగకుండా కట్టడి చేయటం మరింత ఎక్కువగా ఉంటుంది.ఒక సహజ శారీరక పరిణామక్రమమైన ఈ పెరుగుదల అంతే సహజంగా ఆడపిల్ల జీవితంలోకి ప్రవేశించాలంటే ఆమెకు ఈ విషయాల పట్ల ఆరోగ్యకరమైన, శాస్త్రీయపరమైన అవగాహనని కల్పించడం అత్యవసరం. పాఠశాలల్లో లైంగిక విద్యాబోధన గురించి ఇంకా తర్జన భర్జనలు, మంచిదా, కాదా అనే భిన్నాభిప్రాయాలు మనచుట్టూ ఉన్నాయి.

అయితే ఈ విషయంమీద అమ్మాయిలకు సరైన అవగాహనను కల్పించాల్సిన మొదటి బాధ్యత తల్లిమీద ఉంటుంది. తల్లికి ఈ విషయం పట్ల ఉన్న దృక్పథమే ఆమె పిల్లల్లోనూ పెరుగుతుంది. మనలో చాలా వరకు దీనిని యవ్వనానికి సూచనగా తీసుకుంటారు కానీ వయసు రీత్యా జరిగే శారీరక ప్రక్రియ ల్లో భాగంగా తీసుకోరు. ఇప్పటికీ పల్లెల్లో ఈ సమయంలో ఇంట్లోకి రాకుండా దూరంగా ఉండేవారు ఉన్నారు. దీనిని అసహజంగా తీసుకుంటూ ఆ మూడురోజుల్ని చాలా ఇబ్బందికరంగా ఎప్పుడెప్పుడు అయిపోతాయా అనే భావంతో ఎదుర్కొనేవారూ ఉన్నారు.

శారీరక ఇబ్బందుల రీత్యా అయితే ఫరవాలేదు, మానసికంగా ఈ పరిస్థితిని ఇబ్బందిగా భావించడం మాత్రం మంచి ఎదుగుదలగా చెప్పలే0. శరీరాన్ని, దాని సహజ ధర్మాలను అర్థం చేసుకోవటం, వాటికి విలువ నివ్వటం, గౌరవించడం ఇవన్నీ ఆడపిల్ల ఆత్మగౌరవంలో భాగాలే అవుతాయి. అపుడే వాళ్లకు తమని తాము గౌరవించుకోవటం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం- ఇవన్నీ అలవాటు అవుతాయి.

ఈ కాలంలో చాలా త్వరగా ఆడపిల్లలు రజస్వల అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని తల్లులు గుర్తుంచుకోవాలి. అందుకు అనుగుణంగా వారు పిల్లల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయాలి.

ఇంకా చిన్నపిల్లలే కదా అని వారి ముందు ఈ విషయాలు ప్రస్తావించకూడదు అనే భావంతో ఉండకూడదు.

తొమ్మిది, పదేళ్ల వయసులో పిల్లలకు ఈ శారీరక మార్పుని గురించి చెప్పవచ్చు. ఆ సమయంలో ఏం జరుగుతుందో తల్లి సునిశితంగా వివరించవచ్చు.

తల్లి తాను ఉపయోగిస్తున్న ప్యాడ్స్‌ని చూపుతూ వివరించినా పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటారు.

ఇదంతా చాలా సహజ శారీరక ధర్మంగా వారికి అర్థం కావాలి. ప్రతి అవయవానికి కొన్ని విధులు ఉంటాయి కదా అని మొదలుపెట్టి, కన్ను, ముక్కు, చెవులు, కాళ్లు, చేతులు ఇవన్నీ మనం వివిధ పనులు చేసుకోవ డానికి వీలుగా తమ ధర్మాలు నిర్వర్తిస్తున్నాయి కదా అలాగే లోపల కూడా కొన్ని అవయవాలు ఉంటాయి అని కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు మొదలైన వాటిని వాటి ధర్మాలను వివరిస్తూ అదే క్రమంలో గర్భసంచి గురించి చెప్పవచ్చు. దాని ధర్మాలు వివరించవచ్చు.

అన్ని అవయవాలు తమ తమ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తాయో ఇదీ అలాగే తన పని తాను చేస్తుం దనీ అందుకే ఇలా అవుతుందనీ చెప్పాలి. పిల్లలు మరీ చిన్నగా ఉన్నపుడే మెచ్యూర్‌ అయితే వారికి మరింత సున్నితంగా ఈ విషయాలు చెప్పాలి. మీ చుట్టుపక్కల, బంధువుల్లో ఉండే అమ్మాయిల్ని ఉదహరిస్తూ అందరికీ ఇలాగే అవుతుంది, నీకొక్కదానికే కాదు అని విషయాన్ని తేలికపరుస్తూ చెప్పాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/