బీరకాయ బజ్జీ

Beer akaaya bajji

బీరకాయ బజ్జీ ప్రసిద్ధ దక్షిణాది వంటకం. దీన్ని సాయంకాలం చిరుతిండిగా తింటారు. దీన్ని బీరకాయను సెనగపిండితో కలిపి వేయించి చేస్తారు. టీ తాగుతూ తినడానికి ఎంతో బావుంటుంది. పైన కరకరలాడుతూ లోపల మెత్తని బీరకాయతో బజ్జీలు నోరూరిస్తాయి. దక్షిణాదిలో ప్రసిద్ధమైన ఈ వంటకం అన్ని పండుగలకి, పార్టీలకు వండుతారు. ఇదే తరహాలో బంగాళదుంపల బజ్జీ, మిర్చి బజ్జీలను కూడా తయారు చేసుకోవచ్చు. అతిథులు అనూహ్యంగా వస్తే అప్పటికప్పుడు చేసుకోవడానికి బీరకాయబజ్జీ త్వరగా అవుతుంది.

కావలసిన పదార్థాలు

బీరకాయ – సగం, సెనగపిండి – అరకిలో, పసుపు – అరచెంచా , ఎర్రకారం – ఒక చెంచా, జీలకరర – అరచెంచా, ఉప్పు రుచికి తగినంత, నూనె వేయించడానికి సరిపడ. నీరు కప్పు.

తయారుచేయు విధానం
బీరయాకను సగానికి కోసి ఒకవైపున పైన చెక్కు తీయాలి. చిన్న ముక్కలు గుండ్రంగా కోసి పక్కన పెట్టుకోవాలి. సెనగపిండిని గిన్నెలో వేయాలి. పసుపు, ఇంగువను వేయాలి. ఎర్రకారం, జీలకర్రను కూడ వేయాలి. ఉప్పు వేసి బాగా కలపాలి. వేడిచేసిన పెనంలో రెండు చెంచాల నూనె వేయాలి. నూనె రెండు నిమషాలు కాగనివ్వాలి. అలా కాచిన నూనెను మిశ్రమంలో కలపాలి. కొంచెం కొంచెం నీరు పోస్తూ పిండిని జారుడుగా కలపాలి. వేబజ్జీలను వేయించడానికి బాండీలో నూనెపోసి మరగనివ్వాలి. బీరకాయ ముక్కలను పిండిలో వేసి బాగా పిండి పట్టేలా చూడాలి. ఒక్కొక్క ముక్కను పిండిలో ముంచి నూనెలో వేసి మధ్యమంగా మంటపై వేయించాలి. ఒకవైపు వేగాక, తిప్పి మరోవైపు వేయించాలి. గోధుమరంగులోకి వచ్చే వరకూ వేయించాలి. నూనె నుంచి తీసి వేడి వేడిగా వడ్డించాలి. ఈ బజ్జీ పిండిలో ఒక చెంచా బియ్యం పిండి కలిపితే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. రెండు బజ్జీలలో 156.2 కాల్యరీలు, 6.3 గ్రాములు కొవ్వు, 4.1 గ్రాములు ప్రొటీన్‌, 22.5 గ్రాములు కార్బొహైడ్రేట్లు, 1.1 గ్రాముల చక్కెర, ఫైబర్‌ -3.2 గ్రాములుంటుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/