ముడతలు మాయం

Cute face

బంగాళాదుంపను గుజ్జుగా చేసుకొని దానిలో చెంచా తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టి ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత చల్లటినీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉన్న ముడతలు తగ్గుతాయి. చక్కని కాంతి సొంతమవుతుంది.

ఆలివ్‌తో తాజాగా నిర్జీవంగా కనిపించే చర్మతత్వం గలవారు రోజూ ఆలివ్‌నూనెలో మూడుచుక్కల నిమ్మరసం కలిపి ఒంటికి పట్టించి వ్యతిరేకదిశలో గుండ్రంగా మర్దన చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. చర్మానికి తగిన తేమఅంది నిగనిగలాడుతుంది.

పచ్చి పసుపు కొమ్ముని పచ్చిపాలతో అరగదీసి దానికి రెండు చుక్కలు పెరుగు కలిపి ముఖానికి రాస్తే మేనిపై పేరుకొన్న టాన్‌ తొలగి వర్ణం వన్నెలీనుతుంది. గుప్పెడు నల్లద్రాక్ష పళ్లను గుజ్జుగా చేసుకొని దానికి నాలుగు చెంచాల పెసరపిండి రెండు చుక్కల బాదం నూనెను కలిపి అవసరాన్ని బట్టి కాసిని పచ్చిపాలు జతచేసి మెత్తగా చేసుకోవాలి.

దాన్ని ఒంటికి పట్టించి నలుగులా రుద్దుకొని అరగంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగి చర్మం మృదుత్వాన్ని సంతరించుకొంటుంది. గోరువెచ్చని నీళ్లలో కాసిని పాలు, రెండు చుక్కల కొబ్బరినూనె కలిపి పాదాలను నానబెట్టాలి.

ఇలా చేస్తే తగిన పోషణ అందుతుంది. అలానే గుప్పెడు అనాసముక్కల్ని గుజ్జుగా చేసుకొని దాన్ని రెండు చెంచాల పెసరపిండితో పాటు పెరుగులో ఓ అరగంట పాటు నానబెట్టాలి. దానిలో చిటికెడు పసుపు, రెండు చుక్కల తేనె కలిపి మెత్తగా చేసుకొని పాదాలను బాగా రుద్దాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/