ఆకట్టుకునేలా వాల్‌షీట్లు

Beautiful Wall Sheets
Beautiful Wall Sheets

రంగు వెలిసిపోయి, గీతలు, మరకలు పడిన గోడల్ని చూడలేకపోతే ఈ వాల్‌ షీట్లు గోడలకు అతికిస్తే మీ ఇల్లు కొత్తరూపు సంతరించుకుంటుంది. హాల్‌, లివింగ్‌రూమ్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌ వేటికవే మీకు నచ్చిన డిజైన్‌ పేపర్లు అతికించుకోవచ్చు. ఇటీవల వీటి వాడకం బాగా పెరిగిపోయింది. ఫర్నీచర్‌కు వాడే డెకోలమ్‌ షీట్లలాగా వీటిని కూడా ఇంటి ఫర్నిచర్‌కు తగిన రంగుల్ని ఎంపిక చేసుకుంటున్నారు.
ఈ వాల్‌షీట్లు లతలు, తీగలు, సెలయేర్లు, నచ్చిన బొమ్మలు, పచ్చిక ప్రకతంతా గోడలపై పరచుకోవచ్చు. ఇవి గోడల అందం పెంచడమే కాక, గీతలు, మరకలు పడితే సులువుగా తుడుచుకునే సౌకర్యం కూడా ఉంటుంది. కాకపోతే అంటించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఏ వయసువారికి తగిన డిజైన్లు ఆ వయసువారు ఎంపిక చేసుకోవచ్చు. లేతరంగులు, మహిళలు మెచ్చే ఫ్లోరల్‌ డిజైన్లు, పిల్లలు మెచ్చే కార్టూన్‌ బొమ్మలు, సంప్రదాయ ఆధునిక మేళవింపులో రాతి చెక్కడం డిజైన్లు ఇందులో కనిపిస్తాయి. సాదాసీదా కాగితంలా ఉండదు. ఉడ్‌కట్‌ టెక్నిక్‌ ద్వారా ఆయిల్‌ కలర్స్‌లో ముద్రిస్తారు. దృఢంగా ఉంటుంది. రోల్స్‌ రూపంలో అమ్మే వాటిని పేస్టుతో గోడలకు అంటిస్తారు. అయితే అంటించేవాళ్లకి మాత్రం నైపుణ్యంతో కూడిన అనుభవం ఉండాలి.

ఈ మధ్యకాలంలో మన భారతీయులు ఎక్కువగా వాడుతున్న వీటిని యూరప్‌, అమెరికా దేశాల్లో ఎప్పటినుంచో వాడుతున్నారు. ఇంతకు ముందు కొందరు శ్రీమంతులు అక్కడినుంచి తెప్పించుకుని మరీ ఈ వాల్‌షీట్లను డిజైన్‌ చేసుకునేవారు. పెయింట్‌ల ధరలు పెరగడంతో పాటు టేస్టుకు అనుగుణంగా గదుల్ని అలంకరించుకోవాలని ఇప్పుడు ఎక్కువమందే ఉత్సాహం చూపుతున్నారు.