చెదరని ఆత్మవిశ్వాసం

లక్నోలోని ఒక సంస్థ యాసిడ్‌ బాధితులకు అండగా ఉంటుందని తెలిసి వారిని సంప్రదించింది. దాంతో వారు ఆమెకు లైబ్రరీ మేనేజర్‌గా ఉద్యోగమిచ్చారు. ప్రస్తుతం ఆమె వేతనం రూ.22 వేలు. అందులో కొంత ఇంటికి పంపిస్తుంది. అలా గడుస్తున్న సమయంలో మరో సమస్య మొదలైంది. ఆ సంస్థ ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందు ప్రయత్నిస్తున్నది. తనలాంటి వాళ్లకు ఉపాధితో పాటు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్న ఆ సంస్థను రక్షించుకోవడం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దానిపై సుప్రీం కోర్టు స్టే ఆర్డరిచ్చింది. ఆ సంస్థను కాపాడుకునేందుకు తన వంతుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.

Anshu Rajput  (left : File Pic)

ఆడపిల్లలు సున్నిత మనస్కులు. కాని వారి ఆశయాలు దృఢంగా ఉంటాయి. అయినా సమాజంలో ఆడపిల్ల అనగానే ఏదో ఒక రకంగా సొంతం చేసుకోవాలనుకోవడం. పెళ్లి పేరుతో తనదాన్ని చేసుకోవాలకోవడం చాలా మంది చేస్తుంటారు. వారిలో కొందరు వావి వరసలు కూడా పక్కన పెట్టి కూతురు వయసున్న అమ్మాయిలను, మనవరాలు లాంటి పిల్లలను ఇబ్బందుల పాలు చేస్తుంటారు. వారి జీవితాలను నరకప్రాయం చేస్తుంటారు.

కోరుకున్న అమ్మాయి కావాలనుకున్నప్పుడు వయసు తేడా వారికి గుర్తురాదేమో! పదిహేనేళ్ల అమ్మాయిపై యాభై అయిదేళ్ల వ్యక్తికి ఇష్టం కలిగింది. అంతే విచక్షణ కూడా లేకుండా ప్రవర్తించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బిజినోర్‌ గ్రామంలో ఉండే అన్షూరాజ్‌పుత్‌పై యాభై అయిదేళ్ల వ్యక్తి పెళ్లిచేసుకోవాలనుకున్నాడు. తిరస్కరించినందుకు ఆమె జీవితాన్ని చీకటి చేయాలనుకున్నాడు. అన్షురాజ్‌పుత్‌ తనకు జరిగిన అన్యాయానికి ఎదురీదింది.

కంటిచూపు పొగొట్టుకున్నా చదువుకుని, ఉద్యోగం తెచ్చుకుని తన కాళ్లపై తాను నిలబడి ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తు జీవితంపై ఎన్నో కలలతో టీనేజీ వయసులో ఉన్న అన్షూరాజ్‌పుత్‌ కుటుంబం ఉత్తరప్రదేశ్‌ లోని బిజినోర్‌లో ఉంటుంది. తండ్రి వ్యవసాయం చేస్తాడు. అమ్మ చదువుకోలేదు. వారికి ఆరుగురు సంతానం. ఉన్నంతలో సంతోషంగానే ఉండేవాళ్లు. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లి చదుకుంటున్న అన్షు జీవితంలో జరగరాని సంఘటన జరిగి ఆమె జీవితాన్ని మార్చింది. పదోతరగతి చదువుతున్న అన్షు ఇంటిపక్కన ఒక కుటుంబం ఉండేది.

ఆ ఇంట్లో 55 యేళ్ల వ్యక్తి ఆయన భార్య ఉండేవారు. వారికి ఇద్దరు పిల్లలు వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. ఆయనను వీరంతా దాదాజి అని పిలిచేవారు. ఒకరోజు ఆయన అన్షూ వద్దకు వచ్చి ‘నువ్వంటే నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఊహించని పరిణామంతో అన్షూ భయపడిపోయింది. వెంటనే అమ్మానాన్నకు ఈ విషయం చెప్పింది. దాంతో అన్షూ తల్లిదండ్రులు వాళ్లింటికి వెళ్లి ఆయనతో గొడవకు దిగారు. అది మనసులో పెట్టుకున్న దాదాజి ఆ రోజు సాయంత్రం ఇంటి ఎదుట మంచంమీద పడుకున్న అన్షూ ముఖంపై యాసిడ్‌పోసి పారిపోయాడు. ముఖంపై యాసిడ్‌ పడడంతో ముఖమంతా మండిపోతుండడంతో ఆమెకు ఏం జరిగిందో తెలియక రెండు చేతులతో ముఖాన్ని మూసేసుకుంది.

అప్పటికే యాసిడ్‌ ముఖమంతా వ్యాపించింది. మండుతున్న ముఖంతో అన్షూ బాధపడుతుంటే అమ్మానాన్నలు వెంటనే అక్కడికి దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. స్పృహకోల్పోయిన అన్షూ ఆసుపత్రిలోనే కళ్లు తెరిచింది. ఆసుపత్రిలో నెలరోజులు ఉన్నప్పటికీ సరైన వైద్యం అందక ముఖం గాయాలు తగ్గలేదు. మంచి వైద్యం కోసం తండ్రి ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అన్షూ ముఖంపై యాసిడ్‌ పోసింది దాదాజి అని ఆ తరువాత తెలిసింది. ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యుల
చికిత్సతో కొంచెం కోలుకుంది.

ముఖం గాయం మానింది. కానీ కళ్లలో యాసిడ్‌ పడడంతో ఎడమ కన్ను పూర్తిగా కాలిపోయింది. కుడి కన్ను చూపు కోల్పోయింది. వైద్యుల చికిత్సతో కుడికన్ను కొంతవరకు కనిపించడం ప్రారంభించింది. గాయాలు మానిన తరువాత ముఖాన్ని తడుముకుంది. ఒకరోజు అద్దంలో తన ముఖాన్ని చూసుకుని భోరుమంది. చావే తనకు శరణ్యమను కుంది. ‘నువ్వు బతికావు మాకు అదే కావాలి అని అమ్మ అనడంతో చావాలనుకున్న నిర్ణయాన్ని మానుకుంది. అయినా బాధ మాత్రం తగ్గలేదు. అన్షూ పరిస్థితిని చూసి ఆసుపత్రిలో కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

దాంతో ఆమెకు ధైర్యం వచ్చింది. చేయని తప్పుకు శిక్ష ఎందుకు అనుభవించాలనుకుంది. తిరిగి మామూలు స్థితికి వచ్చింది. పదవతరగతి చదువుతున్న ఆమె చదువు కొనసాగించేందుకు స్కూలుకు వెళ్లింది. స్కూలు రిజిస్టరులో తన పేరు తొలగించారు. అన్షూ గాయపడిన ముఖాన్ని చూసి మిగతా పిల్లలు భయపడతారని ఆమెను స్కూలు వాళ్లు వద్దనుకున్నారు. అయినా ధైర్యం చేసి హెడ్‌ మాస్టర్‌తో మాట్లాడింది. చదువుకోవడం తన హక్కు అని పట్టుబట్టింది. ఆమె ధైర్యాన్ని, పట్టుదలను చూసిన హెడ్మాస్టర్‌ తిరిగి స్కూల్లో చేర్చుకున్నారు.

అన్షూను చూసి పిల్లలంతా దూరంగా ఉండేవారు. అందుకు ఆమె ఎంతో బాధపడేది. అయినా చదువుకోవడం తన లక్ష్యం కాబట్టి దానిమీదే దృష్టిపెట్టింది. ఎవరేమనుకున్నా పట్టించుకోలేదు. అలా ఇంటర్మీడియెట్‌ పూర్తిచేసింది. యాసిడ్‌ ప్రభావం ఆరోగ్యం మీద కూడా పడింది. తరచూ అనారోగ్యానికి గురయ్యేది. ఇంట్లో తన వల్ల ఆర్ధికంగా కూడా ఇబ్బందులు కలిగాయి. అయినా తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుని ఉద్యోగం కోసం ప్రయత్నించింది. గాయపడిన ఆమె ముఖాన్ని చూసి ఉద్యోగం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. లక్నోలోని ఒక సంస్థ యాసిడ్‌ బాధితులకు అండగా ఉంటుందని తెలిసి వారిని సంప్రదించింది.

దాంతో వారు ఆమెకు లైబ్రరీ మేనేజర్‌గా ఉద్యోగమిచ్చారు. ప్రస్తుతం ఆమె వేతనం రూ.22 వేలు. అందులో కొంత ఇంటికి పంపిస్తుంది. అలా గడుస్తున్న సమయంలో మరో సమస్య మొదలైంది. ఆ సంస్థ ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తు న్నది. తనలాంటి వాళ్లకు ఉపాధితో పాటు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్న ఆ సంస్థను రక్షించుకోవడం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దానిపై సుప్రీం కోర్టు స్టే ఆర్డరిచ్చింది.

ఆ సంస్థను కాపాడుకునేందుకు తన వంతుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. టెడెక్స్‌ అనే సంస్థ అన్షూను తాము నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రసంగించమని ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో తన అనుభవాన్ని వివరించింది. తన అనుభవాన్ని ఎవరైనా స్ఫూర్తిగా తీసుకుంటే అంతకన్నా తాను సాధించేది మరోటి లేదని అన్షూ రాజ్‌పుత్‌ అంటోంది.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health/