స్నేహం ఓ స్వాతి చినుకు

                    స్నేహం ఓ స్వాతి చినుకు

FRIENDSHIP
FRIENDSHIP

చలిలో వెచ్చని స్పర్శలా ఉంటుందా ఆప్త హృదయం. ఎవరు ఎవరితో స్నేహం చేయవచ్చంటే మాత్రం సమాధానం అపరిమితం. ఫలానావారు ఫలానా వారితోనే స్నేహం చేయాలన్న నిబంధన ఏదీ లేదు. చిన్నా పెద్దా, తేడా, అసలే లేవ్ఞ. అరవై ఏళ్లవారు పదహారేళ్లవారితో స్నేహం చేయవచ్చు. ధనం, హోదా లాంటివేవీ స్నేహసామ్రాజ్యంలో చోటులేదు. స్నేహం చేయడానికి కావలసింది ఒకరినొకరు అర్థం చేసుకోవడం, స్నేహితుని భావాలను పంచుకోవడం. ఇదే స్నేహానికి కనీస అర్హత. తల్లిదండ్రులతో, అక్కాచెల్లెళ్లతో, అన్నదమ్ములతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటుంటారు. మనసును తేలిక పరచుకుంటుంటారు. ఒకరంటే ఒకరికి అవగాహనను కలిగించి, ఒకరి మీద ఒకరికి నమ్మకం కుదిర్చి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్లుగా చేసే శక్తి స్నేహానికుంది.

మానవత్వ విలువలను ఎన్నింటినో స్నేహం ద్వారానే తెలుసుకుంటారు. స్నేహంలో త్యాగం, నమ్మకం గౌరవం ఉన్నాయి. అందుకే స్నేహానికి అంత విలువ్ఞంది. కష్టాల్లో సైతం ఓదార్పును ఇచ్చేది స్నేహం. బాధలైనా, సంతోషమైన ఎవరితో ఎక్కువగా పంచుకోగలం. ఇవన్నీ చెప్పుకునేందుకు దేవ్ఞడు మనకొక మనసు ఇచ్చాడు. ఆ మనసుకో స్నేహితుడినిచ్చాడు. ఆపదలో ఆదుకునేవాడే అసలైన మిత్రుడని దీనికి సందేశం. మల్లెలా తెల్లనిది, మంచుకన్నా చల్లనిది స్నేహబంధం. మల్లెపూవ్ఞలా స్వచ్ఛమైన మనస్సు కలిగి, మంచులా కరిగే దయార్ద్ర హృదయం కలిగి, నీతి నిజాయితీలతో ఉన్న స్నేహం కలకాలం నిలుస్తుంది. భగవంతుడికి, భక్తుడికి, గురువ్ఞకు, శిష్యుడికీ మధ్య ఉండే సంబంధం కూడా ఒక విధమైన స్నేహబంధమే.

స్వార్థమెరుగని త్యాగానికి ప్రతీక అయిన స్నేహ సౌందర్యాన్ని ఆస్వాదించమని, అనుభవించని వ్యక్తి ఈలోకంలో ఉండడేమో! మన వ్యక్తిత్వం స్నేహంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. లింగభేదాలు లేని స్నేహమే అసలైన స్నేహం. స్నేహితులను బట్టే వాతావరణం కూడా మారిపోతూ ఉంటుంది. స్నేహితులే ఒక వాతావరణంగా ఉంటారు. కెరీర్‌కు స్నేహం దోహదం చేస్తుంది. కాని ఈతరం కుర్రకారు స్నేహానికి కొత్త భాష్యం చెబుతున్నారు. స్నేహితులతో కాకుండా ఇంట్లో ఛానళ్లు మార్చడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. నవ్ఞ్వతూ పలకరించుకోవడం కన్నా నాలుగు డబ్బులు వెనకవేసుకోవడమే జీవన విధానమని భ్రమిస్తున్నారు. చివరికి పొందే దానికన్నా పోగొట్టుకునేదే ఎక్కువ.ఇంత పరుగు తీశాక ఎప్పుడో బతుకు మలిసంధ్యలో ఇంటి వరండాలో వాలు కుర్చీ వేసుకుని, వెనక్కు వాలితే, ఏమీ ఉండదు.

నెమరు వేసుకునేందుకు మన గురించి మనం చెప్పుకునేందుకు ఎంతకీ ఎడతెగని ఈ పరుగు ఏ దరికి? నిన్ను నిన్నుగా ఆదరించి, అక్కున చేర్చుకొనే మనిషి ఒక్కరూ లేకపోతే ఇక ఇంత పరుగు దేనికి? సంపాదన నీ సామర్థ్యానికి గీటురాయి, అదే నీ జీవనశైలి కాకూడదు. ఆనందం ఎక్కడో లేదు నీలో తప్ప. ప్రతి చిన్నదానికీ బాధపడటం కాదు ఆనందించడం నేర్చుకుందాం. ఎలాంటి వారితో స్నేహం చేస్తే అలాంటి ఫలితాలే వస్తాయి. సముద్రంలోని ఆల్చిప్పల్లో కురిసిన స్వాతి చినుకు ముత్యంగా మారుతుంది. అదే స్వాతి చినుకు విషసర్పం నోట్లో పడితే విషంగా మారుతుంది. ముత్యమా, విషమా అన్నది స్వాతి చినుకు కురిసే ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. చందన వృక్షంతో స్నేహం చేసినా పాము బుసకొట్టడం మానదు. సుఖం, దుఃఖం, సంతోషం, విషాదం, ఆశ, నిరాశ ఇలా మనోభావాలు ఏదైనా స్నేహితునితో పంచుకుంటాం.

నేస్తాన్ని ఎన్నుకోవడమూ మన చేతుల్లోనే ఉంటుంది. కెజిస్థాయి నుండి పిజి స్థాయి వరకూ ఎన్నో పరిచయాలు వాటిలో కొన్ని స్నేహాలుగా మారితే వాటిలో చివరిదాకా నిలబడగలిగే స్నేహాలు ఏ కొన్నో. స్నేహితుల మధ్య ఉన్న అవగాహనపై ఆ విషయం ఆధారపడి ఉంటుంది. అలా నిలిచిన స్నేహాలు పటిష్టమైనవి. బంధుత్వాలలోని ఆప్యాయతల కన్నా స్నేహంలోని అనురాగాలే జీవితంలో మరపురానివిగా నిలుస్తాయి. స్నేహమహత్యాన్ని మాటల్లో చెప్పలేం. మనసుతో చదవాలి. చెడ్డవారి స్నేహం ఉదయం వచ్చే నీడలా మొదట పెద్దదిగా ఉండి క్రమంగా తగ్గిపోతుంది. మంచివారి స్నేహం మిట్ట మధ్యాహ్నపు నీడలా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా పెరుగు తుంది. కాలక్రమంలో కొత్త స్నేహితులు దొరకడం సహజం. అలా అని పాతవారిని మరువకూడదు. కొత్తస్నేహం వెండి వెలుగులైతే పాత స్నేహం పసిడి కాంతి.

ఎవరితో పంచుకోనేని విషయాలను స్నేహితులతో పంచుకుంటారు. కష్టమైనా, బాధ అయినా వారితోనే తమ ప్రపంచమనుకుంటారు. స్నేహానికి ఎల్లలు లేవ్ఞ, సరిహద్దులు అసలే లేవ్ఞ. కులం, మతం రంగులంటూ లేవ్ఞ. ఉండేది ఒక్కటే అభిమానించే మనసు, ప్రోత్సహించే మమత ఉంటే చాలు స్నేహం పదికాలాలపాటు వర్ధిల్లుతుంది. తను చెడిపోతే ఇతరులు పాడైపోవాలనుకోవడం స్నేహం కాదు. తన పరిస్థితి ఎలాగున్నా తనవారికి అంతా మంచే జరగాలని కాంక్షించడం స్నేహభావన కిందకు వస్తుంది. పార్టీలు, పబ్‌లలో కలిసి, కలిసి తాగేందుకు, గెంతులు వేసేందుకు చేసేది స్నేహం కాదు. కంపెనీకోసం ఎదుటివారిని చెడుమార్గంలో నడిపించేందేది స్నేహం ఎంతమాత్రం కాదు. స్నేహం కోరేది ఒక్కటే, అంతా క్షేమంగా ఉండాలని, ఇతరులకు ఆదర్శం కావాలని కోరుకునేదే అసలైన స్నేహం. వాడిపోని స్నేహమధురిమలు